కుప్పం : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కే.ఆర్.జె. భరత్ ఇంటిపై దాడికి యత్నించిన ఘటన, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ కుప్పం మండల యువమోర్చా నాయకుడు వసంత్ వెనక్కి తగ్గారు. పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో దిగివచ్చిన ఆయన, తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ భరత్‌ను బహిరంగంగా క్షమాపణలు కోరారు. అదే సమయంలో తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా కుప్పంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో బీజేపీ నాయకుడు వసంత్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ భరత్ ఇంటి వైపు దూసుకెళ్లి దాడికి యత్నించడంతో పాటు, ఆయన తల్లిని ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చాత్తాపంతో రాజీనామా ప్రకటన
పోలీసు కేసు నమోదు కావడంతో వ్యవహారం ముదరడంతో వసంత్ స్పందించారు. ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర తప్పిదమని, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ భరత్ పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరారు. ఈ వివాదం నేపథ్యంలో తాను కుప్పం మండల బీజేపీ యువమోర్చా బాధ్యతల నుంచే కాకుండా, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.


