చెన్నై: తమిళనాడులో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే)లోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అన్నాడీఎంకే పార్టీకి చెందిన యువ నాయకుడు సింగై జి రామచంద్రన్.. (Singai G Ramachandran) టీవీకేలో చేరారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్‌ను కలిసి టీవీకే కండువా కప్పుకున్నారు. ఆయనకు సీఎం విజయ్ సాదర స్వాగతం పలికారు. విజయ్‌ను స్వయంగా కలిసి అధికార పార్టీలో చేరిన అతి కొద్దిమందిలో రామచంద్రన్ ఒకరు కావడం గమనార్హం.
రామచంద్రన్ గతంలో ఏఐఏడీఎంకే విద్యార్థి విభాగం, ఐటీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. గత నెల 23న అన్నాడీఎంకే పార్టీని వీడారు. రామచంద్రన్ తండ్రి ఏఐఏడీఎంకేలో నిబద్దతత కలిగిన కార్యకర్త కావడంతో ఆయనకు పార్టీలో కీలక పదవులు దక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత 2016లో రామచంద్రన్‌ను పార్టీ ఐటీ విభాగానికి కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నాడీంకే పార్టీలో కొనసాగారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి వైఖరి కారణంగా అన్నాడీఎంకేకు గుడ్ బై చెప్పారు.
జూలై 23న పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రామచంద్రన్ హాజరయ్యారు. తర్వాత కొద్ది గంటలకే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. తన అభిప్రాయాలను పంచుకోవడానికి తగిన అవకాశం ఇవ్వలేదని పళనిస్వామిపై ఆరోపణణలు చేశారు. కాగా, ఏఐఏడీఎంకేలో రామచంద్రన్‌కు ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని.. టీవీకేలో ఆయనకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
చదవండి: మమతా బెనర్జీ మేనల్లుడికి ఊరట


