సాక్షి, ముంబై: ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడం, అక్కడ డాలర్లలో సంపాదించడం చాలామంది యువకుల కల. ఇంకా చెప్పాలంటే ప్రతీ తల్లిదండ్రుల కల. కానీ విదేశాల్లో చదువులు, లక్షల కొద్దీ లోన్లు, తద్వారా ఎదురయ్యే ఆర్థిక సవాళ్లపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో తీవ్రమైన చర్చకు దారితీసింది. విషయం ఏమిటంటే.
ఒక కుటుంబం తమ కొడుకు మాస్టర్స్ డిగ్రీ చదువు కోసం కెనడాకు పంపింది. ఇందుకోసం పదిహేళ్లనుంచి కష్టపడి దాచుకున్న రూ. 50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కరిగించింది. తీరా చూస్తే లక్షల్లో ఆదాయం ఏమోగానీ, ఆ గ్రాడ్యుయేట్ ఇప్పుడు టొరంటోలో అధిక పన్నులు, ఖరీదైన అద్దె, పెరుగుతున్న జీవన వ్యయాలతో సతమతమవుతున్నాడు. అనుకున్నంత పొదుపు చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని వ్యాపారవేత్త హర్ష్ గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: నిబంధనలు గాలికి,అపరిశుభ్రత : జెప్టోకు భారీ షాక్
ప్రస్తుతం ఆ యువకుడు టోరంటోలో ఏడాదికి 55 వేల కెనడియన్ డాలర్లు (CAD) సంపాదిస్తున్నప్పటికీ , అక్కడి అధిక ఖర్చుల వల్ల, భారత్‌లోని ఏదైనా మధ్యస్థ నగరంలో ఉద్యోగం చేసుకుంటే వచ్చే పొదుపు కంటే ఇక్కడే తక్కువ మిగులుతోందని పోస్ట్‌లో పేర్కొన్నారు. రూ. 50 లక్షల్ని భారత్‌లోనే పెట్టుబడి రూపంలో ఉంచితే వచ్చే లాభాలను ఎవరూ పరిగణనలోకి తీసుకోరని, విదేశీ డిగ్రీలు కేవలం ఒక ఖరీదైన అనుభవంగా మిగిలిపోతున్నాయని గుప్తా అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి లెక్కలు వేసుకునేంత వరకు విదేశాలకు వెళ్లడం ఒక కలలా కనిపిస్తుంది. విపరీతమైన అద్దె, పన్నులు, జీవన వ్యయం వంటి వాటి మధ్య, డాలర్లు లేదా కెనడియన్ డాలర్లలో సంపాదించడం వల్ల, మన స్వదేశంలోని ఒక సాధారణ ఉద్యోగంతో పోలిస్తే చాలా తక్కువే పొదుపు చేయగలం అని వ్యాపారవేత్త హర్ష్ గుప్తా తెలిపారు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా అంత మొత్తం ఖర్చు చేయడం ముమ్మాటికీ పొరపాటని కొందరు వ్యాఖ్యానించగా, ఈ అభిప్రాయాన్ని తప్పుబడుతూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇదీ చదవండి: జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...!


