నీట్ వ్యవహారం.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో మరిన్ని సంచలన విషయాలు | NEET UG 2026 Paper Leak Case: CBI Chargesheets 3 NTA Subject Experts | Sakshi
Sakshi News home page

నీట్ వ్యవహారం.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో మరిన్ని సంచలన విషయాలు

Aug 12 2026 3:17 PM | Updated on Aug 12 2026 3:48 PM

 CBI Names Three NTA Subject Experts in NEET UG 2026 Paper Leak Chargesheet

న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పేర్కొంది. ఇందులో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు చెందిన సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ నిర్వాహకులు, మధ్యవర్తులు, అభ్యర్థులు ఉన్నారని, అనేక రాష్ట్రాల వారు ఈ నేర కుట్రలో భాగమని తెలిపింది. ఈ కేసులో వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రానికి చెందిన సబ్జెక్ట్ నిపుణులతో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంది.

న్యూఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక సీబీఐ కోర్టులో జూలై 28న దాఖలు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం, ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు తమ అధికార హోదాను దుర్వినియోగం చేసి పరీక్షా సామగ్రిని పొందడంతో పాటు భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మధ్యవర్తులకు పంపినట్టు సీబీఐ అంటోంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), అవినీతి నిరోధక చట్టం, ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నిరోధక) చట్టం, 2024 నిబంధనలను అమలు చేసింది. ఛార్జిషీట్‌లో ఆ ముగ్గురు ఎన్‌టీఏ సబ్జెక్ట్‌ నిపుణుల పేర్లను సీబీఐ పేర్కొంది. 

ప్రశ్నపత్రం లీక్ పరీక్షకు కొన్ని నెలల ముందే అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిందని, ఇది చివరి నిమిషంలో చేపట్టిన చర్య కాదని చార్జ్‌షీట్‌లో పేర్కొంది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లు, డిజిటల్ పరికరాల నుంచి పీడీఎఫ్ ఫైళ్లు, ఫొటోలు, ప్రశ్నపత్రాలు, చాట్లు, ఇతర పత్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.

లీకైన ప్రశ్నలు పరీక్షకు కొన్ని రోజుల ముందే టెలిగ్రామ్, వాట్సాప్ తదితర ప్లాట్‌ఫాంల ద్వారా పంపిణీ అయినట్టు సీబీఐ ఆరోపించింది. పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ ఆధారంగా లీకైన సమాచార ప్రయాణాన్ని మొత్తం నెట్‌వర్క్‌లో తిరిగి గుర్తించినట్టు పేర్కొంది.

దర్యాప్తు సమయంలో ప్రశ్నించిన అభ్యర్థుల వాంగ్మూలాలు కూడా చార్జ్‌షీట్‌లో నమోదు చేసింది. ఒక సందర్భంలో, ఓ అభ్యర్థికి, ఆమె తండ్రికి నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం అందిస్తామని చెప్పి రూ.4 లక్షలు కోరినట్టు ఆరోపించింది. ఈ ప్రతిపాదనలో కోచింగ్ సాయం, నిందితుల్లో ఒకరైన ఎన్‌టీఏ సబ్జెక్ట్ నిపుణుడు నిర్వహించిన ఆఫ్‌లైన్ రివిజన్ తరగతులు కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ పరిచయాలు 2025 చివరి భాగం, 2026 ప్రారంభ నెలల్లో జరిగినట్టు సీబీఐ గుర్తించింది. ఇవి విస్తృత కుట్రలో భాగమని వివరించింది.

మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, ఇతర అక్రమాల నేపథ్యంలో మే 12న రద్దు చేశారు. అనంతరం అన్ని అభ్యర్థుల కోసం జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement