ఢిల్లీ : ప్రయాణాల్లో పొరపాటున వస్తువులు మర్చిపోతే అవి తిరిగి దొరకడం గగనమైన ఈ రోజుల్లో ఓ క్యాబ్ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ప్రయాణికుడు క్యాబ్‌లో వదిలేసిన ఖరీదైన 'ఐఫోన్ 16'ను స్వయంగా వెళ్లి అప్పగించి అందరి మనసులనూ గెలుచుకున్నాడు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిధిలో రైడ్ ముగిసిన తర్వాత మీర్ షేక్ అనే డ్రైవర్‌కు తన క్యాబ్ వెనుక సీట్లో ఐఫోన్ 16 కనిపించింది. ఆ ఫోన్ ఎవరిదో గుర్తించడానికి, యజమానిని సంప్రదించడానికి అతనికి ఎలాంటి ఆధారం లభించలేదు. సదరు ప్రయాణికుడు ఒక సీనియర్ సిటిజన్ అని మాత్రమే అతనికి గుర్తుంది. ఫోన్‌కు ఎలాంటి ఇన్‌కమింగ్ కాల్స్ రాకపోవడం, క్యాబ్ యాప్ ద్వారా నేరుగా కస్టమర్‌ను సంప్రదించే వీలు లేకపోవడంతో షేక్ ఈ విషయాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు.
ఫోన్‌ను ఎవరికీ ఇవ్వకుండా భద్రంగా తన వద్దే ఉంచుకుని, యజమాని నుంచి కాల్ వచ్చే వరకు ఎదురుచూశాడు. కాసేపటికి ఫోన్ రింగ్ కావడంతో యజమానితో మాట్లాడాడు. వారు మలబార్ హిల్‌లో ఉన్నారని తెలుసుకున్న మీర్ షేక్, స్వయంగా అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ఆ ఫోన్‌ను సురక్షితంగా వారికి అందజేశాడు.
ఫోన్ తిరిగి అందిన ఆనందంలో సదరు ప్రయాణికుడు డ్రైవర్ నిజాయితీని, శ్రమను అభినందిస్తూ అతనికి రూ. 2,500 నగదును బహుమతిగా అందించారు. దీనిపై మీర్ షేక్ స్పందిస్తూ.. నిజాయితీకి తగిన గౌరవం, ప్రతిఫలం దక్కడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


