తిరువనంతపురం: తమిళనాడులోని తేని నుంచి కేరళలో శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో ధృవీకరించారు.
ఈ ప్రాజెక్టు కోసం సాంకేతిక, కార్యాచరణ సాధ్యతలను అంచనా వేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) తయారు చేస్తారు. సర్వే పూర్తయిన తర్వాత తమిళనాడు, కేరళ ప్రభుత్వాల సంప్రదింపులతో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం తేని పరిసర ప్రాంతాల భక్తులు కుంబం, కుమిలి, ఎరుమేలి, పంబాల మీదుగా రోడ్డు మార్గంలో మాత్రమే శబరిమలకు చేరుకుంటున్నారు. ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం కానుంది.
శబరిమలలో ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతి
శబరిమలకు సంబంధించి ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న 'అంగమలి-శబరి' లైన్ కోసం కేరళ ప్రభుత్వం స్థల సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.505 కోట్లు కేటాయించింది.
రెండు మార్గాలు (తేని–ఎరుమేలి, అంగమలి–శబరి) అందుబాటులోకి వస్తే రెండు వేర్వేరు దిశల నుండి శబరిమల క్షేత్రానికి అద్భుతమైన రైలు సదుపాయం సమకూరుతుంది.


