వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం | President approves Vande Mataram Bill | Sakshi
Sakshi News home page

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Aug 11 2026 8:15 PM | Updated on Aug 11 2026 8:23 PM

 President approves Vande Mataram Bill

సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ‘వందేమాతరం’ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో "ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్", 2026 ఇక చట్టంగా మారింది. ఇకపై జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణే జాతీయ గేయం ‘వందేమాతరం’కు సైతం వర్తించనుంది.

‘వందేమాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, నిలిపివేయడం లేదా ఆ పాట పాడుతున్న సభకు అంతరాయం కలిగించడం ఇకపై నేరంగా పరిగణిస్తారు. గతంలో Prevention of Insults to National Honour Act కింద జాతీయ గీతం ఆలాపనను అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం మాత్రమే శిక్షార్హమైన నేరంగా ఉండేది. ఈ నిబంధనను ఇప్పుడు జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా వర్తించేలా చట్టాన్ని సవరించారు.

ఈ నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. రెండోసారి, ఆ తర్వాత జరిగే ప్రతి నేరానికి కనీసం ఏడాది జైలు శిక్ష ఉంటుంది. గత చట్టంలో ‘వందేమాతరం’కు ఇలాంటి ప్రత్యేక చట్టపరమైన రక్షణ లేదు.

ఈ బిల్లును రాజ్యసభ జూలై 29న, లోక్‌సభ జూలై 30న ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది. దీంతో ‘వందేమాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన’తో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఎర్రకోట ప్రాకారాల నుంచి ‘వందేమాతరం’ ఆలపించనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

జాతీయ గేయం, జాతీయ గీతం రెండింటినీ ఒకే కార్యక్రమంలో ఆలపించినప్పుడు ముందుగా ‘వందేమాతరం’, ఆ తర్వాత ‘జనగణమన’ ఆలపించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 28న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ గేయం ఆలాపనకు సంబంధించి తొలిసారిగా ప్రత్యేక ప్రోటోకాల్‌ను జారీ చేసింది.

అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి రాక, జాతీయ పతాకావిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు వంటి సందర్భాల్లో ‘వందేమాతరం’లోని మొత్తం ఆరు చరణాలను, సుమారు 3 నిమిషాల 10 సెకన్ల వ్యవధిలో ఆలపించాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement