breaking news
Vandemataram
-
పాట వచ్చి 28 ఏళ్లైనా పవర్ ఏమాత్రం తగ్గలేదు
ఆ పాట.. మన దేశాన్ని ప్రేమించమని చెప్పే పాట. అందులోని సంగీతం.. దేశాన్ని చూపే చూపును మార్చేసిన ఒక భావోద్వేగం. అది వింటున్నప్పుడు ప్రతీ భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. దేశం పట్ల ప్రేమను పదే పదే గుర్తు చేస్తుంది. అందుకే అదొక కాలాతీత గీతమై.. కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రెహమాన్ Vande Mataram ఆల్బమ్.. 28 ఏళ్ల తర్వాత కూడా నేటికి అదే ఉత్సాహంతో, అదే గర్వంతో దేశమంతటా మార్మోగుతోంది.అప్పటికే సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏఆర్ రెహమాన్‌కు ఐదేళ్లు అయి ఉంటుంది. కానీ, ఆ తక్కువ కాలంలోనే అతని సంగీతానికి దేశం చికుబుక్ రైలే అంటూ చిందులేస్తోంది. సరిగ్గా.. అదే సమయంలో సోనీ మ్యూజిక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. లోకల్ టాలెంట్‌ను ఇంటర్నేషనల్‌గా ప్రమోట్ చేసే ప్రయత్నంలో.. తొలిగా రెహమాన్‌తో మూడు ఆల్బమ్స్ కోసం ఒప్పందం చేసుకుంది. అలా పుట్టిందే.. వందేమాతరం ఆల్బమ్. స్నేహితుడి ఆలోచనతో.. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆత్మలు.. యాడ్ ఫిల్మ్మేకర్లు భారత్ బాలా, కనికా. రెహమాన్‌కు బాలా బాల్యమిత్రుడు. అతని సలహా మేరకే సోనీ కంపెనీ తొలి అల్బమ్‌గా దేశభక్తి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు రెహమాన్. పైగా బాలా తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్ల, ఈ పాటకు ఆయన ఎమోషనల్‌గా ఎంతో కనెక్ట్ అయ్యారు. బాలా, కనికలు తల్చుకుంటే స్టైలిష్ ఆల్బమ్ అయ్యి ఉండేది. కానీ, 50 ఏళ్ల స్వతంత్ర భారతావని ఆత్మను చూపించాలని నిర్ణయించుకున్నారు వాళ్లు. అలా ఈ వీడియో కోసం దేశం నలుమూలలకు తిరిగారు. హిమాలయాల శిఖరాల నుంచి.. తమిళనాడులోని గ్రామాల వరకు.. భారతదేశం యొక్క అసలైన రూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. దేశం నలుమూలల అందాలను, ప్రజల జీవనశైలిని, సంస్కృతిని చూపిస్తూ ఈ పాటకు రూపం ఇచ్చారు. లండన్‌కు చెందిన యాక్ బోండీ ఈ పాటకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. పాకిస్తానీ సూఫీ సింగర్ నుస్రాత్ ఫతేహ్ అలీ ఖాన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాడు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఆనాడు లేవు కాబట్టి రెహమాన్‌కు ఎలాంటి ఆటంకాలు.. విమర్శలు ఎదురు కాలేదు. ఈ ఆల్బమ్‌కు కాన్సెప్ట్ అందించడంతో పాటు దర్శకులుగా భారత్ బాలా, కనికాలు వ్యవహరించారు. రెహమాన్ సహదర్శకత్వం వహించాడు. పాటకు హిందీలో సాహిత్యాన్ని అప్పటికే తనతో రంగీలా, దావూద్ చిత్రాలకు పని చేసిన గేయ రచయిత మెహబూబ్‌కు అప్పగించాడు. అలాగే.. తమిళ్ వెర్షన్ థాయి మన్నే వణ్ణక్కంకు సీనియర్ గేయరచయిత వైరముత్తు సాహిత్యం అందించారు. పాటలో వినిపించే ప్రతి పదం.. సంగీతంలోని ప్రతి నోటు.. భారతదేశం పట్ల గౌరవాన్ని, ప్రేమను, గర్వాన్ని వ్యక్తపరిచేలా ఉండేలా చూడాలని రెహమాన్ ఆ ఇద్దరికి విజ్ఞప్తి చేశాడు. అలా ఆ పాట సిద్దమైంది.. కర్లీ జుట్టుతో ఆ పాటలో స్వయంగా రెహమానే నటించారు. కనిక, భరత్ బాలా(ఫైల్ ఫొటోలు) 1997 ఆగస్టు.. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 50 ఏళ్ల సందర్భం. స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు.. మా తుజే సలాం అనే పాట క్యాసెట్ల రూపంలో విడుదలైంది. దేశభక్తికి ఒక శక్తివంతమైన ప్రతీకగా మారడానికి ఈ పాటకు ఎంతో సమయం పట్టలేదు. రోజుల వ్యవధిలోనే దేశంలోనే బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇంకోవైపు.. విజువల్స్ ఆల్బమ్ ఆరోజుల్లో తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో.. దేశభక్తిని కమర్షియల్‌గా మార్చారనే విమర్శలు వచ్చాయి. పాటకాపీ రైట్పైనా కొన్ని వివాదాలు నడిచాయి. కానీ, వాటంటిన్ని దాటుకుని ‘మా తుజే సలాం’.. దేశ ప్రజల గుండెను తాకింది. అప్పటి నుంచి గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలప్పుడు టీవీ చానెల్స్ల్లో, విద్యాసంస్థల్లో, మైక్సెట్లలో, రేడియో..ఎఫ్ఎం స్టేషన్లలో, ఆఖరికి ఇప్పుడు రీల్స్ రూపంలో పిల్లల వాయిస్‌తో వినిపిస్తున్న రీమిక్స్గానూ మారుమోగుతోంది. విడుదలై 28 ఏళ్లు అవుతున్నా.. రెహమాన్ ‘వందేమాతరం’ పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఇది కేవలం పాట, సంగీతం కాదు.. ఇది భారతీయతకు అద్దం.:::వెబ్ డెస్క్ స్పెషల్VIDEO Credits: SonyMusicIndiaVEVO -
మధ్యప్రదేశ్‌లో ‘వందేమాతరం’ వివాదం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వందేమాతరం గీతం విషయంలో వివాదం నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో ప్రతి నెలా మొదటి పని దినం నాడు వందేమాతరం ఆలపించడం 13 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మంగళవారం నిలిపివేసింది. దీంతో బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరుద్ధరించుకోవాలని.. లేని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలందరం కలిసి అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యే (7వ తేదీ) నాడు వందేమాతరం పాడతామని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సీఎం కమల్‌నాథ్ సూచనల మేరకే వందేమాతరం పాడటం నిలిపివేశారని చౌహాన్ ఆరోపించారు. వందేమాతరం పాడకపోవడంపై వస్తున్న విమర్శలను కమల్‌నాథ్ ఖండించారు. -
‘ఆ తప్పు చేయకపోతే దేశ విభజన జరిగేది కాదు’
కోల్‌కతా : ‘కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయం వందేమాతరాన్ని కూడా విడదీసి చూస్తుంది... తన రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయానికి మతం రంగు పులుముతుంద’ని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. గురువారమిక్కడ శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ వారి అధ్వర్యంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ సృష్టికర్త బంకించంద్ర ఛటర్జీ తొలి స్మారకోత్సవానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘జాతీయ గేయమైన వందేమాతరం మన దేశ భౌగోళిక సాంప్రదాయనికి నిదర్శనం. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. జాతీయతకు ప్రతిరూపమైన ఈ గేయానికి మతం రంగులు పులమడం మంచిది కాదు. 1937లో కాంగ్రెస్ వందేమాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించింది. కానీ వందేమాతరం గేయంలోని తొలి రెండు చరణాలను మాత్రమే తీసుకుంది. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఆ తప్పు చేసి ఉండకపోతే దేశ విభజన జరిగేదే కాదు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా తీసుకుంది. కేవలం ఒక మతం వారిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఇలా చేసింది. ఫలితంగా దేశం రెండుగా చీలిపోయింది. కాబట్టి దేశ విభజన పాపం కాంగ్రెస్‌దే. చాలా మంది చరిత్రకారులు దేశ విభజనకు కారణం ఖిలాఫత్ ఉద్యమం, విభజించు - పాలించు విధానం అనుకుంటూ వాటిని విమర్శిస్తారు. కానీ నా వరకూ మాత్రం కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే తీసుకుని దేశ విభజనకు కారణమయ్యింది’ అన్నారు. -
‘వందేమాతరం పాడమంటే పాడం’
లక్నో: ఎవరెన్ని చెప్పినా వందేమాతరం పాడమంటే పాడమని బీఎస్పీ మేయర్ సునీతా వర్మ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల ప్రారంభానికి ముందు వందే మాతరం పాడమని, జాతీయ గీతం జనగణమన ఆలపిస్తామని ఇటీవల ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వందేమాతరం అంటే దండం పెట్టడమని, తల్లికి కాకుండా ఉగ్రవాదులకు దండం పెడుతారా.. అని ఆయన ఘాటుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. సునీతా వర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినా ఆమె వెనక్కి తగ్గకుండా మళ్లీ పాడమని తెగేసి చెప్పడం చర్చనీయాంశమైంది. -
అమ్మకు కాకుండా.. అప్జల్‌గురుకు దండం పెడతారా..?
న్యూఢిల్లీ: వందేమాతరం ఆలపించడంపై నెలకొన్న వివాదంపై భారత ఉప రాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు ఘాటుగా స్పందించారు. తల్లికి కాకుండా ఉగ్రవాది అయిన అప్జల్‌గురూకు దండం పెడతారా అని ప్రశ్నించారు. వందేమాతరం ఆలపించమని, జాతీయగీతమైన జనగణమననే పాడుతామని కొన్ని రాజకీయ పక్షాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ పుస్తక రిలీజ్ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. వందేమాతరం పాడటం అంటే మాతృభూమికి దండం పెట్టడమేనన్నారు. మాతృభూమికి దండం పెట్టడంలో వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఇక స్కూళ్లలో విద్యార్థులు వందేమాతరం ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘భారత్ మాతాకీ జై’ అనేది దేవున్ని పూజించడం కాదన్న ఆయన దేశంలో నివసిస్తున్న 125 కోట్ల మంది మతం, కులాలతో సంబంధం లేకుండా మేమంతా భారతీయులమని నివసిస్తున్నారని స్పష్టం చేశారు. ‘హైందవం అంటే గొప్ప ధర్మం. అది ఒక సంప్రదాయం. అదే భారతీయత. దీనిని మనం వారసత్వంగా పొందాం. హిందుత్వం అంటే ఓ జీవన విధానం’’ అని వెంకయ్యనాయుడు వివరించారు. -
వందేమాతరం పాడాల్సిందే: మద్రాస్ హైకోర్టు
చెన్నై: పాఠశాలల్లో వందేమాతర గేయాన్ని తప్పనిసరిగా పాడాల్సిందేనని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కనీసం వారంలో రెండు రోజులైనా స్కూళ్లలో వందేమా తరాన్ని ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. సోమ, శుక్రవారాల్లో జాతీయ గేయాన్ని విద్యార్థులతో పాడించాలని తమిళనాడులోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సూచించింది. మంగళవారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంవీ మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నెలకు ఒకసారైనా వందేమాతర గేయాన్ని ఆలపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ బెంగాలీ, సంస్కృతంలో వందేమాతరాన్ని ఆలపించడం ప్రజలకు కష్టమైతే.. తమిళంలోకి అనువాదం చేసేందుకు చర్యలు చేపడతామని వివరించారు. -
జాతీయ భావం.. సమైక్య సంకల్పం
పెదవేగి రూరల్: వెయ్యి గళాలు ఒక్కటయ్యాయి.. ఐదు గంటల పాటు మదినిండా దేశభక్తి భావంతో చిన్నారులు జాతీయ గీతం, జాతీయ గేయం, దేశ ప్రతిజ్ఞను మూడు భాషల్లో ఆలపించారు. జాతీయ భావాన్ని, సమైక్య సంకల్పాన్ని ఎలుగెత్తి చాటారు. 75వ క్విట్ ఇండియా దినోత్సవం, 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని పెదవేగి ఎస్ఎంసీ పాఠశాలలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్, ఎస్ఎంసీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం కోసం ‘వందేమాతరం, జనగణమని, భారతదేశం నా మాతృభూమి’ని ఆలపించి చిన్నారులు ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి జాతీయ సమైక్యతను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పరిశీలకుడు సాయిశ్రీ అన్నారు. ఎస్ఎంసీ సంస్థ చైర్మన్ ఫాదర్ డొమినిక్ చుక్కా జ్వోతి ప్రజ్వలనం చేశారు. సభాధ్యక్షుడిగా లయన్ ఎ.శేషుకుమార్ వ్యవహరించగా విశిష్ట అతిథిగా డీజీఎం ఫాదర్ మోజెస్ హాజరయ్యారు. ముందుగా స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్ అక్కినేని వెంకటేశ్వరరావు, జోన్ చైర్పర్సన్ సీహెచ్ అవినాష్‌రాజ్, సర్పంచ్ మాతంగి కోటేశ్వరరావు, హెచ్ఎం కె.ఉషారాణి, లయన్ నూలు రామకృష్ణ పాల్గొన్నారు. -
‘అలా అని రాజ్యాంగంలో రాసి ఉందా?’
హైదరాబాద్ : భారత్‌మాతాకీ జై అని అనని వాళ్లు దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా? అని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. డెబ్భై ఏళ్ల స్వతంత్ర భారతంలో భారత్‌మాతాకీ జై, వందేమాతరం ప్రస్తావన లేనేలేదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని, గతంలోబ్రిటీష్వారికి తొత్తులుగా ఉన్న బీజేపీ నాయకులు అనవసరంగా భారత్‌మాతా వివాదాన్ని ముందుకు తెస్తున్నారని ఎద్దేవాచేశారు. గురువారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు కుహనా జాతీయవాదంతో ఆయా అంశాలను ప్రస్తావిస్తున్నారన్నారు.