
ఆ పాట.. మన దేశాన్ని ప్రేమించమని చెప్పే పాట. అందులోని సంగీతం.. దేశాన్ని చూపే చూపును మార్చేసిన ఒక భావోద్వేగం. అది వింటున్నప్పుడు ప్రతీ భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. దేశం పట్ల ప్రేమను పదే పదే గుర్తు చేస్తుంది. అందుకే అదొక కాలాతీత గీతమై.. కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రెహమాన్ Vande Mataram ఆల్బమ్.. 28 ఏళ్ల తర్వాత కూడా నేటికి అదే ఉత్సాహంతో, అదే గర్వంతో దేశమంతటా మార్మోగుతోంది.
అప్పటికే సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏఆర్ రెహమాన్‌కు ఐదేళ్లు అయి ఉంటుంది. కానీ, ఆ తక్కువ కాలంలోనే అతని సంగీతానికి దేశం చికుబుక్ రైలే అంటూ చిందులేస్తోంది. సరిగ్గా.. అదే సమయంలో సోనీ మ్యూజిక్ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. లోకల్ టాలెంట్‌ను ఇంటర్నేషనల్‌గా ప్రమోట్ చేసే ప్రయత్నంలో.. తొలిగా రెహమాన్‌తో మూడు ఆల్బమ్స్ కోసం ఒప్పందం చేసుకుంది. అలా పుట్టిందే.. వందేమాతరం ఆల్బమ్.

స్నేహితుడి ఆలోచనతో..
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆత్మలు.. యాడ్ ఫిల్మ్‌మేకర్లు భారత్ బాలా, కనికా. రెహమాన్‌కు బాలా బాల్యమిత్రుడు. అతని సలహా మేరకే సోనీ కంపెనీ తొలి అల్బమ్‌గా దేశభక్తి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు రెహమాన్. పైగా బాలా తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్ల, ఈ పాటకు ఆయన ఎమోషనల్‌గా ఎంతో కనెక్ట్ అయ్యారు. బాలా, కనికలు తల్చుకుంటే స్టైలిష్ ఆల్బమ్ అయ్యి ఉండేది. కానీ, 50 ఏళ్ల స్వతంత్ర భారతావని ఆత్మను చూపించాలని నిర్ణయించుకున్నారు వాళ్లు. అలా ఈ వీడియో కోసం దేశం నలుమూలలకు తిరిగారు. హిమాలయాల శిఖరాల నుంచి.. తమిళనాడులోని గ్రామాల వరకు.. భారతదేశం యొక్క అసలైన రూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. దేశం నలుమూలల అందాలను, ప్రజల జీవనశైలిని, సంస్కృతిని చూపిస్తూ ఈ పాటకు రూపం ఇచ్చారు.

లండన్‌కు చెందిన యాక్ బోండీ ఈ పాటకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. పాకిస్తానీ సూఫీ సింగర్ నుస్రాత్ ఫతేహ్ అలీ ఖాన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాడు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఆనాడు లేవు కాబట్టి రెహమాన్‌కు ఎలాంటి ఆటంకాలు.. విమర్శలు ఎదురు కాలేదు.


ఈ ఆల్బమ్‌కు కాన్సెప్ట్ అందించడంతో పాటు దర్శకులుగా భారత్ బాలా, కనికాలు వ్యవహరించారు. రెహమాన్ సహదర్శకత్వం వహించాడు. పాటకు హిందీలో సాహిత్యాన్ని అప్పటికే తనతో రంగీలా, దావూద్ చిత్రాలకు పని చేసిన గేయ రచయిత మెహబూబ్‌కు అప్పగించాడు. అలాగే.. తమిళ్ వెర్షన్ థాయి మన్నే వణ్ణక్కంకు సీనియర్ గేయరచయిత వైరముత్తు సాహిత్యం అందించారు. పాటలో వినిపించే ప్రతి పదం.. సంగీతంలోని ప్రతి నోటు.. భారతదేశం పట్ల గౌరవాన్ని, ప్రేమను, గర్వాన్ని వ్యక్తపరిచేలా ఉండేలా చూడాలని రెహమాన్ ఆ ఇద్దరికి విజ్ఞప్తి చేశాడు. అలా ఆ పాట సిద్దమైంది.. కర్లీ జుట్టుతో ఆ పాటలో స్వయంగా రెహమానే నటించారు.

కనిక, భరత్ బాలా(ఫైల్ ఫొటోలు)
1997 ఆగస్టు.. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 50 ఏళ్ల సందర్భం. స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు.. మా తుజే సలాం అనే పాట క్యాసెట్ల రూపంలో విడుదలైంది. దేశభక్తికి ఒక శక్తివంతమైన ప్రతీకగా మారడానికి ఈ పాటకు ఎంతో సమయం పట్టలేదు. రోజుల వ్యవధిలోనే దేశంలోనే బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇంకోవైపు.. విజువల్స్ ఆల్బమ్ ఆరోజుల్లో తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో.. దేశభక్తిని కమర్షియల్‌గా మార్చారనే విమర్శలు వచ్చాయి. పాటకాపీ రైట్‌పైనా కొన్ని వివాదాలు నడిచాయి. కానీ, వాటంటిన్ని దాటుకుని ‘మా తుజే సలాం’.. దేశ ప్రజల గుండెను తాకింది. అప్పటి నుంచి గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలప్పుడు టీవీ చానెల్స్‌ల్లో, విద్యాసంస్థల్లో, మైక్‌సెట్లలో, రేడియో..ఎఫ్‌ఎం స్టేషన్‌లలో, ఆఖరికి ఇప్పుడు రీల్స్ రూపంలో పిల్లల వాయిస్‌తో వినిపిస్తున్న రీమిక్స్‌గానూ మారుమోగుతోంది. విడుదలై 28 ఏళ్లు అవుతున్నా.. రెహమాన్ ‘వందేమాతరం’ పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఇది కేవలం పాట, సంగీతం కాదు.. ఇది భారతీయతకు అద్దం.
:::వెబ్ డెస్క్ స్పెషల్
VIDEO Credits: SonyMusicIndiaVEVO