2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ! | Tollywood Top Stars missing in 2025 | Sakshi
Sakshi News home page

2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!

Dec 31 2025 3:20 AM | Updated on Dec 31 2025 3:20 AM

Tollywood Top Stars missing in 2025

ఒకప్పుడు ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో కనిపించేవారు స్టార్‌ హీరోలు. ట్రెండ్‌ మారాక ఏడాదికి ఒక్కసారి కనిపించడమే పెద్ద విషయంగా మారిపోయింది. భారీ బడ్జెట్‌ పాన్  ఇండియా సినిమాల నిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడమో, అనుకున్న సమయానికి విడుదల కాకుండా వాయిదా పడటమో వంటి కారణాలతో ఈ ఏడాది కొందరు టాప్‌ స్టార్స్‌ వెండితెరపై కనిపించలేదు. కొందరు యువ హీరోలు కూడా వెండితెరకు ఎక్కలేదు. అయితే 2026లో ‘నో గ్యాప్‌’ అంటూ సిల్వర్‌ స్క్రీన్ పై కనువిందు చేయనున్నారు. ఆ విశేషాల్లోకి...

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరైన చిరంజీవి 2024ని మాత్రమే కాదు... 2025ని కూడా మిస్సయ్యారు. అయితే 2026లో మాత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు, విశ్వంభర’ సినిమాలతో ప్రేక్షకులకు డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్‌’ 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన ‘విశ్వంభర’ 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. 

దీంతో చిరంజీవి సినిమా విడుదలై, దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. అయితే 2026లో సంక్రాంతి బరిలో దిగుతున్నారాయన. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ ఏడాది వాయిదా పడిన ‘విశ్వంభర’ సినిమా 2026 సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ రకంగా అభిమానులకు డబుల్‌ ఫీస్ట్‌ ఇవ్వనున్నారు చిరంజీవి

2026లోనూ నో?
2024 సంక్రాంతికి ప్రేక్షకులకు ‘గుంటూరు కారం’ ఘాటు చూపించిన మహేశ్‌బాబు 2025ని మిస్‌ అయ్యారు.‘గుంటూరు కారం’ తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రనిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడం సహజం. సో... ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ 2026లోనూ విడుదలయ్యే అవకాశం లేదు. 2027 వేసవిలో ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంచనా ఉంది. ఈ లెక్కన మహేశ్‌బాబు 2026లోనూ సిల్వర్‌ స్క్రీన్ ని మిస్‌ అవుతున్నట్టే అన్నమాట.

వచ్చే ఏడాదీ లేనట్లేనా?
‘పుష్ప’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్ . ఆయన నటించిన ‘పుష్ప 2: ది రూల్‌’ మూవీ 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్‌బస్టర్‌ గా నిలవడంతోపాటు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే 2025 లో అల్లు అర్జున్  సిల్వర్‌ స్క్రీన్ ని మిస్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఏఏ 22 అండ్‌ ఏ 6’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో సైన్ప్‌ ఫిక్షన్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అనుకున్నారు. భారీ కథ, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న కారణంగా చిత్రీకరణకు ఎక్కువ టైమ్‌ పడుతోందట. దాంతో 2027లో ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. అంటే వరుసగా 2025, 2026ని అల్లు అర్జున్  మిస్‌ అయినట్లే.  

వచ్చే ఏడాదిపోరాట యోధుడిగా...
సీనియర్‌ హీరోల్లో గోపీచంద్‌ ఈ ఏడాది తెరపై కనిపించలేదు. ఆయన హీరోగా నటించిన ‘విశ్వం’ సినిమా 2024 అక్టోబరు 11న విడుదలైంది. ఆ తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్‌ యాక్షన్  డ్రామాలో నటిస్తున్నారు గోపీచంద్‌. ఏడో శతాబ్దం  నేపథ్యంలో 
ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని ఒక చారిత్రక ఘట్టంతో ఈ చిత్రం రూపొందుతోందట. ఇంకా ఈ ఏడాది సిల్వర్‌ స్క్రీన్ ని మిస్‌ అయిన సీనియర్‌ హీరోలు మరికొందరు ఉన్నారు. పైన పేర్కొన్నవారే కాదు.. మరికొందరు యువ హీరోలు కూడా 2025ని మిస్‌ అయిన వారి జాబితాలో ఉన్నారు. వారిలో కొందరయినా 2026లో వెండితెరపై వెలుగుతారని కోరుకుందాం.

రెండు భాగాలుగా రూపొందిన 
‘బాహుబలి’ సినిమా అప్పుడు ప్రభాస్‌ వెండితెరపై రెండు మూడేళ్ల గ్యాప్‌లో కనిపించారు. అయితే ఆ గ్యాప్‌ విలువైనదనే చె΄్పాలి. ప్రభాస్‌ని పాన్  ఇండియన్  స్టార్‌గా నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. కానీ ఇకపై తమ అభిమాన హీరో  సిల్వర్‌ స్క్రీన్ పై గ్యాప్‌ లేకుండా కనిపించాలని

అభిమానులు ఆశించారు. గత ఏడాది ‘కల్కి 2898ఏడీ’లో హీరోగా కనిపించారు ప్రభాస్‌. అనుకోకుండా 2025లో గ్యాప్‌ వచ్చింది. కానీ ‘కన్నప్ప’లో చేసిన అతిథి పాత్ర కొంతవరకూ అభిమానులను సంతప్తిపరిచింది. ఇక ప్రభాస్‌ నటించిన ‘ది రాజా సాబ్‌’ 2026 జనవరి 9న విడుదలవుతోంది. అలాగే ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. సో... 
అభిమానులకు డబుల్‌ ధమాకా అన్నమాట.

2026లో ఫుల్‌ మాస్‌
2025 లో ఎన్టీఆర్‌ ఏ తెలుగు సినిమా చేయకపోయినా హిందీ చిత్రం ‘వార్‌ 2’లో కనిపించి, ఫ్యాన్స్ని ఆ విధంగా ఆనందపరిచారు. అయితే ఎంత లేదన్నా మాతృభాషలో కనిపిస్తేనే ఫ్యాన్స్కి మజా వస్తుంది. ఆ కొరత ఈ ఏడాది ఉన్నప్పటికీ వచ్చే ఏడాది అసలు సిసలు ఫుల్‌ మాస్‌ కమర్షియల్‌ తెలుగు సినిమాలో కనిపిస్తారు ఎన్టీఆర్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘డ్రాగన్ ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. థాయ్‌ల్యాండ్, మయన్మార్, లావోస్‌ సరిహద్దుల్లోని గోల్డెన్  ట్రయాంగిల్‌ప్రాంతం చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అక్కడ జరిగే అక్రమ కార్యకలాపాలను హీరో పాత్ర ఎదుర్కొంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ చిత్రం విడుదల కానుంది.

యువ హీరోలకు సైతం గ్యాప్‌
కొందరు యువ హీరోలు సైతం 2025ని మిస్సయ్యారు. శర్వానంద్‌ నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్  7న రిలీజైంది. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి, బైకర్‌’ చిత్రాలు 2025లో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలూ 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. వరుణ్‌ తేజ్‌ కూడా ఆడియన్స్ని పలకరించి ఏడాదికి పైనే అయింది. ఆయన హీరోగా నటించిన ‘మట్కా’ మూవీ 2024 నవంబరు 14న రిలీజైంది.  మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ చేస్తున్న సినిమా 2026 లో విడుదలకానుంది.

అడివి శేష్‌కి కూడా 2025లో గ్యాప్‌ వచ్చింది. ఆయన నటిస్తున్న ‘డెకాయిట్‌’, ‘జీ 2’ చిత్రాలు 2026లో రిలీజ్‌ కానున్నాయి. ఇక అక్కినేని అఖిల్‌ ఆడియన్స్ ముందుకొచ్చి రెండున్నరేళ్లకు పైనే అయింది. ఆయన నటించిన ‘ఏజెంట్‌’ మూవీ 2023 ఏప్రిల్‌ 28న విడుదలైంది. ఆ తర్వాత అఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ఈ సినిమా 2026లో రిలీజ్‌ కానుంది. మరో యువ హీరో సాయిదుర్గా తేజ్‌ కూడా ఆడియన్స్ని పలకరించి రెండున్నరేళ్లకు పైనే అవుతోంది.

‘విరూపాక్ష’, ‘బ్రో’ (2023) వంటి సినిమాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రం 2026లో విడుదలకానుంది. అదే విధంగా నిఖిల్‌ సిద్ధార్థ్‌ సినిమా విడుదలై ఏడాదికి పైనే అయ్యింది. నిఖల్‌ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ 2024 నవంబరు 8న రిలీజైంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్  ఇండియా చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమా 2026లో ఆడియన్స్ ముందుకు రానుంది.  – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement