హాంకాంగ్: చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) మంగళవారం రెండో రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి జస్టిస్ మిషన్ 2025 పేరుతో విన్యాసాలకు తెరతీసింది.
తైవాన్‌కు బయటి నుంచి అందే ఎలాంటి మద్దతునైనా అడ్డుకునే సత్తా తమకుందని చూపేందుకు స్వయం పాలిత దీవిని దిగ్బంధనం చేసి, లైవ్ ఫైర్ డ్రిల్స్ సాగిస్తోంది. ఇందులో పీఎల్‌ఏ సదరన్ థియేటర్ కమాండ్‌లోని డె్రస్టాయర్లు, ఫ్రిగేట్లు, యుద్ధ విమానాలు, బాంబర్లు పాల్గొంటున్నాయి. తైవాన్ ఉత్తరం వైపు మొదలుకొని దక్షిణ వైపు సముద్ర జలాలతోపాటు గగనతలంపైనా దిగ్బంధనం కొనసాగిస్తున్నాయి. తైవాన్ ఉత్తర ప్రాంతంపై లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టినట్లు సదరన్ కమాండ్ తెలిపింది.
కాగా, సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తమ దీవికి సమీపంలో చైనాకు చెందిన ఫైటర్ జెట్లు, బాంబర్లు కలిపి 130 విమానాలు, 14 మిలటరీ ఓడలు, 8 ఇతర షిప్పులు కనిపించాయని తైవాన్ తెలిపింది. చైనాకు చెందిన కనీసం 90 విమానాలు జలసంధిలోని తైవాన్ గగనతల రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయని పేర్కొంది. చైనా బెలూన్ కూడా సంచరించిందని తెలిపింది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ విభాగం తమ ఉత్తర ప్రాంతంపై కాల్పులు జరిపిందని వివరించింది. తమ తీరానికి 44 కిలోమీటర్ల దూరం వరకు వీటి ప్రభావం కనిపించిందని వెల్లడించింది.


