న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల వేళ అందరినీ నిరుత్సాహ పరిచే వాతావరణం ఏర్పడింది. 2026 న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దట్టమైన పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పరిసరాల్లో దృశ్యమానత (Visibility) గణనీయంగా పడిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శీతాకాలపు చలి తీవ్రతకు పొగమంచు తోడవడంతో రాజధాని ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పొగమంచు ప్రభావంతో దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్‌జెట్,ఎయిర్ ఇండియా మొదలైనవి తమ విమాన సర్వీసుల్లో జాప్యం జరుగుతున్నదని వెల్లడించాయి. తక్కువ దృశ్యమానత కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ‘క్యాట్ III’ ప్రమాణాలకు అనుగుణంగా లేని విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల షెడ్యూల్‌లో మార్పులు తప్పవని స్పష్టం చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ఏడాది వేడుకల కోసం ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. విమానాల ఆలస్యం కారణంగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్స్ అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు చలి, మరోవైపు గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు సర్వీసులపై కూడా ఈ పొగమంచు ప్రభావం పడటంతో రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది.
ఈ నేపధ్యంలో విమానయాన సంస్థల ప్రతినిధులు ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రయాణికులు ఇంటి నుండి బయలుదేరే ముందే తమ విమాన స్థితిగతులను తెలుసుకోవాలని, ఇందుకోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌ల ద్వారా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. అలాగే ఎయిర్‌లైన్స్ పంపే ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్‌లను గమనిస్తూ ఉండాలని సూచించారు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే విమానయాన సంస్థల హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించాలన్నారు.
ఇది కూడా చదవండి: ‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్ టెస్ట్.. 180లోనూ తొణకని నీరు!


