యెమెన్‌ ఎఫెక్ట్‌.. యూఏఈకి సౌదీ హెచ్చరిక.. | Saudi Arabia Comments On UAE Over Leave Yemen Within 24 hours, Demands Immediate Withdrawal | Sakshi
Sakshi News home page

యెమెన్‌ ఎఫెక్ట్‌.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..

Dec 31 2025 8:36 AM | Updated on Dec 31 2025 9:58 AM

Saudi Arabia Comments On UAE Over Leave Yemen in 24 hours

దుబాయ్‌: సౌదీ అరేబియా, యెమెన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని తీర ప్రాంత నగరం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో యెమెన్‌కు మద్దతుగా నిలుస్తున్న యూఏఈకి సౌదీ హెచ్చరికలు జారీ చేసింది. 24 గంట్లలో యెమెన్‌ నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని సౌదీ వార్నింగ్‌ ఇచ్చింది.

ఇక, అంతకుముందు.. యెమెన్‌లోని వేర్పాటువాదుల కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) పంపిన ఆయుధ నౌకలపై దాడి చేసినట్లు సౌదీ తెలిపింది. యూఏఈ చర్యలు అత్యంత ప్రమాదకరమైనవంటూ వ్యాఖ్యానించింది. యూఏఈ మద్దతు కలిగిన సదరన్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌కు చెందిన వేర్పాటువాదులు ఇటీవలి కాలంలో యెమెన్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. దీనిపై సౌదీ, దాని మిత్ర దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా దాడికి దిగింది.

యూఏఈ తీర నగరం పుజైరాహ్‌ నుంచి ఆయుధాలతో ముకల్లాకు వచ్చిన రెండు నౌకల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను, మిలటరీ వాహనాలను కిందికి దించుతున్న సమయంలోనే మిత్ర కూటమి విమానాలు బాంబులతో దాడి జరిపాయని సౌదీ తెలిపింది. అదే సమయంలో, 24 గంటల్లోగా యెమెన్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని యూఏఈకి తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ పరిణామంపై యూఏఈ స్పందించింది. సహనం, వివేకంతో వ్యవహరించాలంటూ సౌదీకి హితవు పలికింది. యెమెన్‌ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పై మాత్రం ఆ దేశం స్పందించలేదు. యెమెన్‌లోని తమ బలగాలకు అవసరమైన వాహనాలను మాత్రమే ఆ నౌకల్లో పంపామని, ఆయుధాలు లేవని యూఏఈ అంటోంది.

సౌదీ ఆగ్రహం.. 
కాగా, యెమెన్‌లో వేర్పాటు వాదులు ఇటీవల సాధించిన పైచేయికి యూఏఈ కారణమని సౌదీ స్పష్టంచేసింది. దక్షిణ యెమెన్‌కు ప్రత్యేక దేశ స్థాయి కల్పించేందుకు పోరాటం సాగిస్తున్న సదరన్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌(ఎస్‌టీసీ)కు యూఏఈ మద్దతు తెలుపుతోంది. వేర్పాటు వాద సంస్థ ఎస్‌టీసీని సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. ఆ సంస్థకు మద్దతుగా యూఏఈ తీసుకుంటున్న చర్యలు అత్యంత ప్రమాదకరమైనవని సౌదీ పేర్కొంది. సదరన్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌కు మద్దతుగా యూఏఈ నౌకలు ఆయుధాలు చేరవేశాయని ప్రకటన వివరించింది. తాజా పరిణామాలు సౌదీ అరేబియాకు, యూఏఈకీ మధ్య ఉద్రిక్తతల్ని పెంచేలా ఉన్నాయి. పశ్చిమాసియాకు సంబంధించిన అనేక ఇతర విషయాలపై కలసికట్టుగా పనిచేస్తున్న ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ విషయాల్లో విభేదాలు ఉన్నాయి.

రంగంలోకి అమెరికా..
ఇదిలా ఉండగా.. సౌదీ, యెమెన్‌ వ్యవహారంపై అమెరికా ఫోకస్‌ పెట్టింది. తాజాగా యెమెన్‌ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో మాట్లాడినట్టు తెలిపారు. యెమెన్ పరిస్థితి, మధ్య ప్రాచ్య భద్రత, స్థిరత్వాన్ని ప్రభావితం చేసే విస్తృత సమస్యల గురించి ఇద్దరూ చర్చించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement