విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యశ్వంత్ కుమార్ గోషిక (33) శనివారం డల్లాస్‌లో గుండెపోటుతో మరణించారు. యశ్వంత్ ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. స్నేహితులను, తెలుగు ఎన్నారై సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
యశ్వంత్ కుమార్ తెలంగాణలోని చౌటప్పల్ గ్రామంలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అమెరికాలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత టాప్ MNCలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు.
స్లీప్ అప్నియాకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఆకస్మిక గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించాడని సన్నిహితులు వెల్లడించారు. తోటి తెలుగువారితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు యశ్వంత్ మృతదేహాన్నిఅంతిమ సంస్కారాల కోసం భారతదేశానికి తిరిగి పంపడానికి NRI సంఘం ప్రయత్నాలు చేస్తోంది.
విషాదం ఏమిటంటే
యశ్వంత్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికోసం స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో, పెళ్లికొడుకుగా చూడాలనుకున్న యశ్వంత్ అకాలమరణం వారిని తీరని విషాదంలోకి నెట్టేసింది.


