రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక క్రేజీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడుగా నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదట దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటన చేశారు.
సుందర్.సి అవుట్
అంతేకాదు ఈ చిత్ర పూజ కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగడంతో పెద్ద చర్చే జరిగింది. అయితే రజనీకాంత్‌కు కథ సంతృప్తిని కలిగించకపోవడమే ఇందుకు కారణం అని నటుడు, నిర్మాత కమల్ హాసన్ వివరణ ఇచ్చారు.
పార్కింగ్ డైరెక్టర్ కూడా తప్పుకున్నట్లే!
ఆ తర్వాత పార్కింగ్ చిత్రంతో జాతీయ అవార్డును పొందిన రామ్‌కుమార్ రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీ సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది. పార్కింగ్ చిత్రం తర్వాత రామ్‌కుమార్ శింబు హీరోగా చిత్రం చేయడానికి కమిట్ అయ్యారు. అయితే రజనీకాంత్‌కు దర్శకత్వం వహించే లక్కీచాన్స్ రావడంతో ముందుగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత శింబు హీరోగా సినిమా చేయాలని దర్శకుడు భావించినట్లు సమాచారం.
కొత్తగా ఆయన పేరు తెరపైకి..
అందుకు శింబు హీరోగా చిత్రాన్ని నిర్మించతలపెట్టిన డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇప్పుడు ఈ యువ దర్శకుడు కూడా రజనీకాంత్ (Rajinikanth) సినిమా నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రజనీకాంత్ 173 వ చిత్రానికి దర్శకత్వం వహించినున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదైనా ఫైనల్ అవుతుందో? లేదో? చూడాలి!


