2025 ప్రపంచమంతటికీ తీపి, చేదుల మిశ్రమంగా గడిచింది. ప్రాకృతిక విపత్తులు, ఘోర ప్రమాదాలు, రాజకీయపుటెత్తులు, యుద్ధక్రీడలు, నేతల నోటి దురుసులు, ఎన్నికల సమరాంగణాలు... ఇలా మొత్తమ్మీద మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలావరకు ఖేదమే మిగిలించాయి. ఆంగ్ల అక్షరక్రమంలో అలాంటి ఘటనల సమాహారం...
ఎ - ఎయిరిండియా ప్రమాదం
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా–171 విమానం టేకాఫైన 32 సెకన్లకే రన్‌వే ఎదురుగా ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. విమానంలోని 242 మంది, కింద ఉన్న మరో 19 మంది నిర్భాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపింది. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ప్రయాణికుడు మృత్యుంజయునిగా చిన్నపాటి గాయాలతో బయటపడటం విశేషం.
బి - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ, ఆర్జేడీ సారథ్యంలోని విపక్ష మహాఘట్‌బంధన్ కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కూటమి 243 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 202 చోట్ల విజయదుందుభి మోగించి ఆశ్చర్యపరిచింది. ఘట్‌బంధన్ కేవలం 35 స్థానాలతో ఘోర పరాభవం మూటగట్టుకుంది. నితీశ్‌కుమార్ సీఎంగా ఏకంగా పదోసారి ప్రమాణస్వీకారం చేశారు.
సి - క్యాస్ట్ సెన్సెస్
కరోనా కారణంగా 2020లో వాయిదాపడ్డ జనగణనను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇది 2027 మార్చి నుంచి మొదలవనుంది. అందులో భాగంగా కులగణన సైతం చేపడుతున్నట్టు వెల్లడించడం విశేషం. బ్రిటిష్ హయాంలో మన దేశంలో 1881 నుంచి 1931 దాకా కులగణన జరిగింది. కుల విభజనను పెంచరాదనే ఉద్దేశంతో స్వాతంత్య్రానంతరం ఆ ప్రక్రియను నిలిపేశారు. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేసినా దాన్ని పూర్తిస్థాయి కులగణనగా పరిగణించడం లేదు.
డి - డీప్‌సీక్
ఈ చైనా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. డౌన్‌లోడ్ చార్టుల్లో చూస్తుండగానే అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్రత్యర్థి ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీని తోసిరాజంది. దాంతో పోలిస్తే కారుచౌకగా సేవలందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా డీప్‌సీక్–ఆర్1ను విడుదల చేసింది. దీని దెబ్బకు ఓపెన్‌ఏఐ మార్కెట్ విలువ 600 బిలియన్ల మేరకు తగ్గిపోయింది.
ఇ - ఎప్‌స్టీన్ ఫైల్స్
20 ఏళ్లనాటి ఈ కామ భూతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వారి లైంగికానందం కోసం బాలికలను ఎరవేసిన వ్యాపారి ఎప్‌స్టీన్ చివరికి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఉదంతం ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. ఈ కేసు విచారణ ఫైళ్లను బయటపెట్టాలన్న కాంగ్రెస్ ఉత్తర్వులపై ట్రంప్ అయిష్టంగానే సంతకం చేసినా, తనకు నష్టం లేనివాటిని మాత్రమే, అదీ విడతలవారీగా వదులుతూ సాగదీస్తున్నారు.
ఎఫ్ - ఫ్లడ్స్ ఇన్ ఆసియా
నానాటికీ తీవ్రమవుతున్న పర్యావరణ మార్పుల సమస్యకు ఈ ఏడాది ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వరదలు అద్దంపట్టాయి. శ్రీలంక, ఇండొనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాం తుఫాన్ల దెబ్బకు కుదేలయ్యాయి. ఈ విపత్తు భారత్‌ను కూడా తీవ్రంగానే నష్టపరిచింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆకస్మిక వరదలు, తుపాన్లు వేలాది నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
జెన్–జెడ్ ఆందోళనలు
ప్రభుత్వాల, పాలకుల కర్రపెత్తనంపై ఆన్‌లైన్ వీరులు ఆఫ్‌లైన్‌లో ఆందోళనలకు దిగితే ఎలా ఉంటుందో నవతరం రుచిచూపింది. ఈ నవయువత నిరసన గళాల ధాటికి నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దె దిగాల్సి వచ్చింది. జెన్–జెడ్ ఆందోళనలు నేపాల్‌కే పరిమితం కాలేదు. ఇండొనేసియా మొదలుకుని మడగాస్కర్, బల్గేరియా మీదుగా పెరు, మెక్సికో దాకా విస్తరించాయి.
జి - హాంకాంగ్ అగ్ని ప్రమాదం
అగ్నిగోళంలా మండిపోతున్న ఆకాశహర్మ్యం. దానికేసి వేలెత్తి చూపుతూ, తన భార్య అందులో చిక్కుబడిందంటూ విలపిస్తున్న వృద్ధుని ఫొటో. ఇటీవల ఆన్‌లైన్‌లో వారాల తరబడి వైరల్‌గా మారిన చిత్రమిది. అందుకు కారణమైన హాంకాంగ్‌లోని వాంగ్‌ఫుక్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం 160 మందిని పొట్టనపెట్టుకుంది. 40 గంటలకు పైగా శ్రమిస్తేనే గానీ మంటలు అదుపులోకి రాలేదు.
హెచ్ - ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్
12 రోజుల యుద్ధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ పోరు ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, క్షిపణి దాడులు ఇరాన్ సైనిక వ్యవస్థలతో పాటు అణు వ్యవస్థలనూ తీవ్రంగా నష్టపరిచాయి. ఇరాన్‌పై బంకర్ బస్టర్ బాంబులేసి అమెరికా యుద్ధజ్వాలల్లో చలికాచుకుంది. తర్వాత తీరిగ్గా తానే సంధి చేసి జబ్బలు చరుచుకుంది.
జె జగ్‌దీప్ ధన్‌ఖడ్
మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ధన్‌ఖడ్. ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్‌గా సభలో చురుగ్గా వ్యవహరిస్తూ, అధికార పక్షానికి పెట్టని కోటగా నిలుస్తూ వచ్చిన ఆయన రాజీనామా సంచలనమే సృష్టించింది. ఇలా తప్పుకున్న తొలి ఉపరాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. పలు అంశాలపై కేంద్రంతో ఆయనకు కొంతకాలంగా అంతరం పెరుగుతూ వచ్చిందంటారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రాజ్యసభలో విపక్షాలిచ్చిన నోటీసును ధన్‌ఖడ్ స్వీకరించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టడం రాజీనామాకు తక్షణ కారణంగా నిలిచిందని అంటారు.
కె కర్ణాటకలో సిద్ధూ వర్సెస్ డీకే
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత పవర్ పాలిటిక్స్ కుస్తీ పోటీలను తలపిస్తున్నాయి. గద్దె దిగేందుకు సీఎం సిద్ధరామయ్య ససేమిరా అంటుండటం, ఒప్పందం ప్రకారం కురీ్చని తనకు అప్పగించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పట్టుబడుతుండటం అధిష్టానానికి తీరని తలనొప్పిగా మారింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగేలా హైకమాండే ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో ఇప్పుడు తన వంతు వచ్చిందన్నది డీకే వాదన.
ఎల్ - లౌరే దోపిడీ
ఈ శతాబ్దంలోనే అతి పెద్ద దోపిడీగా సంచలనం సృష్టించింది. పారిస్‌లోని లౌరే ఆర్ట్స్ గ్యాలరీలోకి అక్టోబర్ 19న ఆదివారం వేళ నలుగురు దోపిడీ దొంగలు చొరబడ్డారు. అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యమున్న 8 అమూల్య ఆభరణాలను కాజేశారు. వాటి విలువ ఏకంగా 10 కోట్ల డాలర్లుగా తేలింది. ఇంతటి దోపిడీని దొంగలు కేవలం ఏడంటే 7 నిమిషాల్లో పని ముగించి జారుకోవడం విశేషం.
ఎం - మోదీ
2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ మరింత పెరిగింది. నిజానికి గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీని నిలబెట్టుకోకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. జేడీ (యూ) వంటి పారీ్టల మద్దతు కీలకంగా మారడంతో మోదీకి ఇక కష్టకాలమేనన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ కీలకమైన ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాలతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపైనా మోదీ పేరుప్రఖ్యాతులు మరింతగా పెరిగాయి. జీ7తో పాటు ఏ శిఖరాగ్ర సదస్సులోనైనా ఆయనే ప్రధాన ఆకర్షణగా మారుతున్న పరిస్థితి!
ఎన్ - నెట్‌ఫ్లిక్స్–వార్నర్ బ్రదర్స్ డీల్
ప్రపంచవ్యాప్తంగా వినోదపు తీరుతెన్నులనే సమూలంగా మార్చేయగల పరిణామంగా అంతా పేర్కొంటున్న ఒప్పందమిది. వార్నర్ బ్రదర్స్ టీవీ స్టూడియోలతో పాటు కీలకమైన స్ట్రీమింగ్ విభాగాన్ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 6.47 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది! హ్యారీపోటర్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, గేమ్ ఆఫ్ థోర్న్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ సిరీస్‌లతో పాటు స్కూబీ డూ, టామ్ అండ్ జెర్రీ కామిక్స్, హెచ్‌బీఓ మాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫాం, డిస్కవరీ చానల్ వంటివన్నీ వార్నర్ నుంచి నెట్‌ఫ్లిక్స్ సొంతమవుతాయి. ఈ దెబ్బకు చాలా దేశాల్లో సినిమా థియేటర్లు మూతబడటం ఖాయమన్న అంచనాలున్నాయి.
ఓ - ఆపరేషన్ సిందూర్
మే 7 తెల్లవారుజాము. బైసారన్ లోయలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన సైన్యం కొట్టిన దెబ్బకు దాయాది గింగిరాలు తిరిగిన రోజు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వందలాది ముష్కరులను హతమార్చి భరతమాతకు రక్తసిందూరం దిద్దిన రోజు. సరిహద్దుల వెంబడి చిన్నాచితకా దాడులతో ఒకట్రెండు రోజులు ప్రతిఘటిస్తున్నట్టు నటించినా, మన దెబ్బకు కీలక వైమానిక స్థావరాలన్నీ వరుసబెట్టి ధ్వంసం కావడంతో మూడో నాటికే పాక్ కాళ్లబేరానికి వచ్చి సంధి చేసుకుంది.
పి - పహల్గాం ఉగ్ర దాడి
ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్‌లోని పహల్గాం ప్రాంతం అమాయక పర్యాటకుల రక్తంతో ఎరుపెక్కింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందువులనే లక్ష్యం చేసుకుంటూ ఉన్మాదులు హత్యాకాండకు తెగబడ్డారు. వారిని పేర్లడిగి మరీ కాల్చి చంపారు. దేశమంతటినీ ఆగ్రహావేశాలకు లోను చేసిన ఈ దారుణం ఆపరేషన్ సిందూర్‌కు దారితీసింది.
క్యూ - క్వైట్, పిగ్గీ!
మహిళా జర్నలిస్టులను అవమానించే దుర్లక్షణం ట్రంప్‌ను ఓ పట్టాన వదిలేలా లేదు. ఎప్‌స్టీన్ వివాదానికి సంబంధించి ప్రశ్నించిన బ్లూంబర్గ్ న్యూస్ జర్నలిస్టు కేథరిన్ లూసీపై ఆయన దారుణంగా నోరు పారేసుకున్నారు. అదే అంశంపై ఆమె రెట్టించడంతో ఉక్రోషానికి లోనై ‘క్వైట్, క్వైట్, పిగ్గీ!’అంటూ అవమానకర పదజాలం వాడుతూ అరుపులకు దిగారు. సదరు వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ట్రంప్ తీరును అంతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘క్వైట్, పిగ్గీ’ హా‹Ùట్యాగ్‌తో నెటిజన్లు హోరెత్తించారు. ట్రంప్‌ను గేలి చేస్తూ దీనిపై మీమ్‌లూ ఇంటర్నెట్‌ను ముంచెత్తాయి.
ఆర్ - రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాం«దీకి 2025 కష్టకాలంగానే సాగింది. విపక్ష నేత పదవికి న్యాయం చేయడంలో ఆయన విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఢిల్లీతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ సోదిలో కూడా లేకుండాపోవడం రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలకు తావిచ్చింది. వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన సోదరి ప్రియాంకా పారీ్టలో ఇక మరింత ‘క్రియాశీలక’ పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పలువురు కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్న పరిస్థితి!
ఎస్ - సెంగర్ అత్యాచార కేసు తీర్పు
సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగర్ తాజాగా మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. అతని జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి ఒడిగట్టడమే గాక న్యాయ పోరాటానికి దిగిన తన తండ్రిని కూడా చంపించిన సెంగర్‌కు ఉరిశిక్ష పడేదాకా వదిలేది లేదని బాధితురాలు అన్నారు.
ఎక్స్ - షీ జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ ఏడాది చాలారకాలుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ టారిఫ్‌లకు బెదరకుండా అమెరికాపై అంతకుమించిన స్థాయిలో టారిఫ్‌లు బాదారు. ఎన్నడూ లేనట్టుగా మోదీతో సాన్నిహిత్యం పెంచుకుని భారత్‌నూ ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నవ్వులు చిందిస్తున్న ఫొటో అయితే ట్రంప్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.
వై - యమున ప్రక్షాళన
నానాటికీ కాలుష్య కాసారంగా మారుతున్న యమునా నదిని తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఏకంగా రూ.57 వేల కోట్లతో మాస్టర్ ప్లానే ప్రకటించింది. దేశ రాజధానిలో మురుగునీటి శుద్ధి సామర్థ్యం పెంపు కోసం 9 ప్రాజెక్టులను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ పరిధిలోని కేవలం 22 కిలోమీటర్ల నిడివే యమున కాలుష్యంలో ఏకంగా 80 శాతానికి కారణంగా మారుతోంది!
జెడ్ - జొహ్రాన్ మమ్దానీ
ఒక మేయర్ ఎన్నికకు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా క్రేజ్ వచ్చిన సందర్భం బహుశా ఇదొక్కటేనేమో! న్యూయార్క్ మేయర్‌గా 34 ఏళ్ల ముస్లిం విద్యాధికుడు జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక పలు రకాలుగా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఆయన్ను ఓడించేందుకు ట్రంప్ అపార శక్తియుక్తులన్నీ వినియోగించినా లాభం లేకపోయింది. మమ్దానీ ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.
టి - టారిఫ్‌లు
ఈ ఏడాదంతా దేశదేశాలను వణికించిన పదమిది. ట్రంప్ ఎడాపెడా పెంచిన టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తొలుత బెంబేలెత్తిపోయాయి. కానీ చైనా ప్రతీకార టారిఫ్‌ల దెబ్బకు ట్రంపే చివరికి కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది. తర్వాత ఒక్కొక్క దేశంపైనా టారిఫ్‌లను ఇష్టానికి పెంచుతూ, తగ్గిస్తూ తన స్థాయినీ, అమెరికా స్థాయినీ పలుచన చేసుకున్నారాయన. భారత్‌పైనా ఒక దశలో 50 శాతం దాకా భారీ టారిఫ్‌లు విధించినా, వాటిని వెనక్కు తీసుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారు.
యు - ఉక్రెయిన్ శాంతి చర్చలు
ప్రపంచానికి ఈ ఏడాది కాస్త ఉపశమనం ఇచ్చిన ఉదంతమిది. మూడున్నరేళ్ల పై చిలుకు యుద్ధానికి తెర దించేందుకు రష్యా సుముఖత వెలిబుచ్చడంతో ఇరు దేశాలతో అమెరికా అత్యున్నత స్థాయిలో శాంతి చర్చలు జరుపుతోంది. ఈ శాంతి వీచికల కారణంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ధాటి బాగా తగ్గింది.
వి - వెనెజులా ధిక్కారం
వెనెజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన తెంపరి ట్రంప్, వాటిని సొంతం చేసుకునేందుకు అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెనకాడబోనని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చారు. ఆ దేశపు చమురు నౌకలను నానా సాకులతో దిగ్బంధిస్తూ, పేల్చేస్తూ కల్లోలం సృష్టిస్తున్నారు. ఏదేమైనా అమెరికాకు తలొగ్గేదే లేదని అధ్యక్షుడు మదురో ధిక్కార స్వరం వినిపించడంతో ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.
డబ్ల్యూ - వక్ఫ్ సవరణ చట్టం
మోదీ సర్కారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వివాదాలు చుట్టుముట్టాయి. వక్ఫ్ ఆస్తులపై కర్రపెత్తనమే దీని లక్ష్యమని ముస్లిం బోర్డులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పుంఖానుపుంఖాలుగా పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (దానం) ఇవ్వొచ్చు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిళ్లలో ఇద్దరు ముస్లిమేతర సభ్యుల వంటి నిబంధనలన్నీ వక్ఫ్ ఆస్తుల స్వా«దీనం కోసం పెట్టినవేనని దుయ్యబడుతున్నాయి. సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెట్టగా మరికొన్నింటిపై పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ కేసులో తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


