న్యూఢిల్లీ: అవినీతి అనేది కేవలం నైతిక సమస్య మాత్రమే కాదు.. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే భయంకరమైన మహమ్మారిలాంటిది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం $1 ట్రిలియన్ల (రూ. ఒక లక్ష కోట్లు) కంటే ఎక్కువ మొత్తాన్ని లంచాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇక్కడ మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి అవినీతి కారణంగా ఏటా $2.6 ట్రిలియన్ల(రూ.2,60,000 కోట్లు) కంటే అధిక మొత్తం పక్కదారి పడుతోంది. ఈ అపారమైన మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాల పురోగతిని అడ్డుకుంటూ, పేదరికాన్ని పెంచుతూ, ప్రజల నమ్మకాన్ని హరిస్తోంది. ఈ దారుణమైన ఆర్థిక నష్టం ప్రపంచ దేశాల ప్రగతికి అతిపెద్ద అడ్డంకిగా మారింది. నేడు( డిసెంబర్ 9) అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
అవినీతిమయ, అవినీతి రహిత దేశాలు
అవినీతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, దాని తీవ్రత దేశాలను బట్టి మారుతూ వస్తోంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వారి 'కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్' (సీపీఐ) ప్రకారం సోమాలియా, సిరియా, దక్షిణ సూడాన్ తదితర దేశాలు అత్యంత అవినీతిమయ దేశాల జాబితాలో తొలుత ఉన్నాయి. ఇక్కడ పాలనా వ్యవస్థలు పారదర్శకత లేక పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఇదే సమయంలో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ తదితర దేశాలు అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశాలుగా నిలిచాయి.. ఈ దేశాలలో పటిష్టమైన చట్టాలు, పారదర్శకమైన ప్రభుత్వాలు, బలమైన ప్రజాస్వామ్య సంస్థలు ఉండటం వల్ల అవినీతిని అరికట్టడం సాధ్యమవుతోంది. ఈ తేడానే ఆయా దేశాల ప్రజల జీవన ప్రమాణాలను, ఆర్థిక అభివృద్ధిని నిర్దేశిస్తుంది.
ఆఫ్రికా సొమ్మంతా..
అవినీతి కారణంగా అత్యంత నష్టపోయిన ఖండాలలో ఆఫ్రికా ఒకటి. ఈ ఖండం నుండి $400 బిలియన్ల(రూ. 33,20,000 కోట్లు)కు పైగా మొత్తం అక్రమంగా దోపీడి అయి విదేశాలకు చేరింది. ముఖ్యంగా నైజీరియా ఒక్క దేశం నుండే దాదాపు $100 బిలియన్ల నిధులు లూటీ అయినట్లు అంచనా. ఆధునిక కాలంలోనే కాదు.. చరిత్రలో నిలిచిపోయిన అవినీతి దోపిడీలు కూడా ఉన్నాయి. జైర్ (ప్రస్తుత కాంగో) నియంత మొబూటు సేసే సెకో (1965–1997) తన పదవీకాలంలో దాదాపు $5 బిలియన్ల(రూ. 500 కోట్లు) సంపదను దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఆ మొత్తం అప్పటి దేశ బాహ్య రుణానికి సమానం. నైజీరియా నియంత సాని అబాచా, అతని అనుచరులు కూడా కోట్లాది నిధులను విదేశాలకు తరలించారు. ఈ చారిత్రక దోపిడీలు పేదరికాన్ని పదింతలు చేశాయి.
అవినీతి వివిధ రూపాలు
అవినీతి అంటే కేవలం లంచం ఇవ్వడం లేదా తీసుకోవడం మాత్రమే కాదు.. ఇది అనేక రూపాల్లో సమాజంలో పాతుకుపోయింది. అపహరణ (Embezzlement), మోసం (Fraud), బంధుప్రీతి (Nepotism), పక్షపాతం (Favoritism), గ్రాఫ్ట్ (Graft) వంటివి అవినీతిలోని ఇతర ప్రధాన రూపాలు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం, పనులు చేసేందుకు అనర్హులకు అవకాశాలు ఇవ్వడం, వ్యక్తిగత లాభం కోసం అధికారిక పదవులను ఉపయోగించడం వంటివి కూడా అవినీతిలో భాగమే. ఇవి ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అడుగంటిపోయేలా చేస్తున్నాయి.
పేదరికంపై ప్రభావం
ప్రపంచ దేశాలలో అవినీతి -పేదరికం మధ్య బలమైన సంబంధం ఉంది. దేశంలో సంపద ఉన్నప్పటికీ, అవినీతి కారణంగా ఆ సంపద సాధారణ ప్రజలకు చేరదు. నైజీరియా దేశం విస్తారమైన చమురు సంపదను కలిగి ఉంది. కానీ తీవ్రమైన అవినీతి కారణంగా, దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది రోజుకు $1(రూ.89.96) కన్నా తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. అవినీతిమయ పాలకులు ప్రజా సంపదను కొల్లగొట్టడం కారణంగా విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులు దారి మళ్లి, పేదరికాన్ని, అసమానతలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
అంతర్జాతీయ చర్యలు
అవినీతి అనేది ఒక దేశానికే పరిమితం కాని, సరిహద్దులు లేని సమస్యగా గుర్తించి, ప్రపంచ దేశాలు దానిని ఎదుర్కొనేందుకు ఐక్యంగా కృషి చేస్తున్నాయి. దీనిలో ఒక ముఖ్యమైన చర్య.. ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక ఒడంబడిక (United Nations Convention against Corruption - UNCAC). 2003లో ఆమోదించిన ఈ ఒప్పందం ప్రపంచంలోనే మొట్టమొదటి చట్టబద్ధంగా అమలు చేయగలిగే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక ఒప్పందం. అవినీతిని నివారించడం, అక్రమంగా తరలించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం వంటి అంశాలపై ఇది దృష్టి సారిస్తుంది. ఇది ప్రపంచ పారదర్శక పరిపాలనకు కీలక మార్గదర్శిగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!


