తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం! | first Goa trip 4 of Delhi family die in nightclub fire | Sakshi
Sakshi News home page

తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!

Dec 8 2025 10:53 AM | Updated on Dec 8 2025 11:23 AM

first Goa trip 4 of Delhi family die in nightclub fire

న్యూఢిల్లీ: గోవాలో ఎంజాయ్‌ చేసేందుకు తొలిసారిగా వెళ్లిన ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురయ్యింది. జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందాలని ఆశపడుతూ, సాగిన వారి పర్యటన చివరికి వారిని మృత్యు ఒడికి చేర్చింది. ఆదివారం తెల్లవారుజామున ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్, ఆయన భార్య భావన, ఆమె సోదరీమణులు అనిత, కమల, సరోజ్‌లతో పాటు కమల భర్త నవీన్, పిల్లలు కలిసి  గోవా ట్రిప్‌కు బయలుదేరారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున క్లబ్‌లో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో టిఫిన్‌ చేసి, తిరిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఎలాగోలా బయటకు పరుగుపెట్టిన భావన, తన సోదరీమణులు లోపల చిక్కుకోవడాన్ని గమనించి ఉలిక్కిపడింది.

మరోవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెడుతున్న జనాన్ని చూసి కూడా.. భావన తన అక్కాచెల్లెళ్లను కాపాడేందుకు ధైర్యంగా మంటల్లోకి వెళ్లారు. వినోద్ కుమార్ కూడా  ఇదే ప్రయత్నంలో భావన వెంట వెళ్లారు. అంతకంతకూ ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగకు తోడు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వారు కూడా ఆ మంటల మధ్యలో  చిక్కుకున్నారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు సోదరీమణులు.. అనిత, కమల, సరోజ్, భావన భర్త వినోద్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. భావన మాత్రం ఎలాగోలా బయటపడగలిగారు.

కుటుంబంలో నలుగురు మరణించిన విషయం తెలియడంతో ఢిల్లీలోని కరావాల్ నగర్‌లోని వారి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆ ఇంటి పెద్ద అయిన వృద్ధురాలికి ఇంకా చెప్పలేదని కుటుంబ స్నేహితుడు హరీష్ సింగ్ తెలిపారు. ‘వారు గోవాకు వెళ్లడం ఇదే మొదటిసారి. వారంతా చాలా ఉత్సాహంగా వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వారి తల్లి ఆరోగ్యం బాగోలేదు. అందుకే  ఆమెకు ఈ విషయం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాం’ అని సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందారు.

ఇది కూడా చదవండి: గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement