గోవా: గోవాలోని అర్పోరాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 25 మంది ప్రాణాలు కోల్పోవడం దేశంలోని అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఈ నేపధ్యంలో ప్రమాదం జరిగిన ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ ఎవరిదనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నైట్‌క్లబ్‌ను ఒక గోల్డ్ మెడలిస్ట్ స్థాపించాడని తెలియగానే పలువురు ఆశ్చర్యపోతున్నారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి బీటెక్‌లో బంగారు పతకం అందుకున్న సౌరభ్ లూత్రానే ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ యజమాని. చదువు పూర్తయిన తర్వాత లూత్రా అంతర్జాతీయ క్లయింట్‌ల కోసం బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. తరువాత తన కెరీర్‌ను రెస్టారెంట్, నైట్‌లైఫ్ వ్యాపారం వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నారు. 2016లో ఆహారపానీయాల (ఎఫ్ అండ్ బీ) పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే ఏడాది న్యూఢిల్లీలో ‘రోమియో లేన్’ అనే బ్రాండ్‌ను స్థాపించారు.
ఈ బ్రాండ్ వేగంగా విస్తరించింది. అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని లూత్రా ప్రణాళికలు వేశారు. అతని నైట్‌క్లబ్ వెబ్‌సైట్ ప్రకారం రోమియో లేన్ ప్రస్తుతం భారతదేశంతో సహా నాలుగు దేశాలలోని 22 నగరాల్లో ఔట్‌లెట్‌లను కలిగి ఉంది. ఈ విస్తరణ అతని వ్యాపార దార్శనికతకు నిదర్శనంగా నిలిచింది. అతని బ్రాండ్‌కు లభించిన పలు అవార్డులు.. ఫోర్బ్స్ ఇండియాలో ఈ బ్రాండ్ ఫీచర్ కావడం మొదలైనవి అతని వ్యాపార విజయాలకు అద్దం పడుతున్నాయి.
లూత్రాకు చెందిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం అతను రోమియో లేన్‌కు మాత్రమే కాకుండా ‘బిర్చ్’, ‘మామాస్ బుయోయి’ తదితర సంస్థలకు కూడా ఛైర్మన్‌గా ఉన్నారు. ఇది ఆయన నైట్‌లైఫ్, హాస్పిటాలిటీ రంగంలో ఎంతటి విజయం సాధించారో తెలియజేస్తుంది. అయితే గోవాలోని అతని క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం అతని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలుడు వల్ల మంటలు చెలరేగి, 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యాన్స్ ఫ్లోర్‌లో 100 మందికి పైగా జనం ఉన్నట్లు సెక్యూరిటీ గార్డు తెలిపారు. ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో.. క్లబ్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నియమాలను విస్మరించిందని వెల్లడయ్యింది. మృతులలో ఎక్కువ మంది వంటగది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. పోలీసులు నైట్‌క్లబ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య


