న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ మహిళా నేత నవజ్యోత్ కౌర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2027లో పంజాబ్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యల దరిమిలా రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ భార్య నవజ్యోత్ కౌర్ ఏమన్నారు?
తన భర్త నవజ్యోత్ సిద్ధూను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే, ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని నవజ్యోత్ కౌర్ వ్యాఖ్యానించారు. సిద్ధూకు తగిన అవకాశం లభిస్తే రాష్ట్రానికి సేవ చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడతారని ఆమె స్పష్టం చేశారు. అయితే పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయని, ఐదుగురు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని, వారు సిద్ధూ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నవజ్యోత్ కౌర్ ఆరోపించారు. హైకమాండ్ దీనిని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.
సిద్ధూ దృష్టి పంజాబ్ అభివృద్ధిపైనే ఉందని, ఏ పార్టీకి ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదని, అయితే తాము మంచి ఫలితాలు ఇస్తామని, పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తామన్నారు. రూ. 500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడనేది మా విధానం కాదని అన్నారు. పంజాబ్ రాజకీయాల్లో డబ్బు పాత్రపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. అభివృద్ధి ఆధారిత రాజకీయాలకు సిద్ధూ కట్టుబడి ఉంటారని ఆమె అన్నారు.
క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగినప్పటికీ, నవజ్యోత్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీతోనూ, పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారని నవజ్యోత్ కౌర్ తెలిపారు. కాగా గత కొంతకాలంగా సిద్ధూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేయలేదు. రాజకీయాల నుండి దూరమైన తర్వాత, సిద్ధూ ఐపీఎల్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే తన అనుభవాలు ప్రేరణాత్మక చర్చలు, జీవనశైలి తదితర విషయాలను తెలియజేస్తూ ఆయన ‘నవ్‌జోత్ సిద్ధూ అఫీషియల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. నవజ్యోత్ కౌర్ చేసిన తాజా ప్రకటన దరిమిలా నవజ్యోత్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటించడం ద్వారా పంజాబ్‌లో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చాలని ఆమె కాంగ్రెస్ హైకమాండ్‌కు సంకేతాలు పంపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే తదుపరి నిర్ణయంపై సిద్ధూ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
సిద్ధూ రాజకీయ ప్రయాణం ఇలా..
నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షడిగా సేవలందించారు. 2004లో బీజేపీ తరఫున అమృత్‌సర్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో బీజేపీకి రాజీనామా చేసి, 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021, జూలై నెలలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 మార్చి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.
ఇది కూడా చదవండి: నెలాఖరుకు ‘వందేభారత్ స్లీపర్’.. విశేషాలివే!


