నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వాన్ తాలూకా, సప్తష్రింగ్ గర్ ఘాట్‌లో ఒక టయోటా ఇన్నోవా కారు అదుపుతప్పి, ఏకంగా 600 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో పింపాల్‌గావ్ బస్వంత్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతులను ఒకే కుటుంబానికి చెందిన కీర్తి పటేల్ (50), రసీలా పటేల్ (50), విఠల్ పటేల్ (65), లతా పటేల్ (60), వచన్ పటేల్ (60),మణిబెన్ పటేల్ (70)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. లోయలో పడిన కారు తుక్కుతుక్కుగా మారింది. మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు , జిల్లా విపత్తు నిర్వహణ కమిటీ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ విషాదకర ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
‘ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. తమ సన్నిహితులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఘటనను ‘చాలా విషాదకరం’ అని అభివర్ణించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ కమిటీ సిబ్బందిని సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నాసిక్ పోలీసు సూపరింటెండెంట్ బాలాసాహెబ్ పాటిల్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాహనం పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. మృతదేహాలను వెలికితీసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయాన్ని అందిస్తుందని రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్‌కుమార్ రాజ్‌పుత్ తెలిపారు.
ఇది కూడా చదవండి: అర్థరాత్రి దాటాక.. నైట్ క్లబ్‌ల షాకింగ్ సీక్రెట్స్!


