కచ్: సెల్ ఫోన్ విషయమై తండ్రితో గొడవపడిన ఓ టీనేజర్ బోరుబావిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ తాలుకాలో ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన ఓ కుటుంబం కుక్మా గ్రామంలోని ఫాంహౌస్‌లో ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన రుస్తొమ్ షేక్(17) శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఖరీదైన సెల్‌ఫోన్ విషయంపై తండ్రితో గొడవపడ్డాడు.
చేతిలోని సెల్‌ఫోన్‌ను విసిరి పారేసి, దగ్గర్లో ఉన్న పడావు పడిన బోరు బావి వద్దకు చేరుకున్నాడు. దానిపైన అడ్డుపెట్టిన బండరాయిని తొలగించి అమాంతం లోపలికి దూకాడు. భూమికి రెండున్నర అడుగుల ఎత్తులో, అడుగున్నర వెడల్పున్న ఆ బావి లోతు 140 అడుగులు. సమాచారం అందడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఊపిరి అందక రుస్తొమ్ కేకలు వేస్తుండటంతో లోపలికి ఆక్సిజన్‌ను పైపుల ద్వారా పంపించారు.
వెంటనే సహాయక చర్యలను మొదలుపెట్టారు. ఎట్టకేలకు అతడిని అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో వెలుపలికి తీయగలిగారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


