బెంగళూరు ఐటీ ఉద్యోగి అకాల మరణం ఆందోళన రేపింది. నల్లురహళ్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మురళి గోవిందరాజు గురువారం ఆత్మహత్య చేసుకున్నడు. అయితే ఒక స్థలం కొనుగోలు విషయంలో లంచాలకు ఆశపడిన అధికారులు వేధింపుల కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
మురళి గోవిందరాజుకు భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ఠ, దేశిత ఉన్నారు. 2018లో నల్లురహళ్లిలో ఒక బంధువు నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న, ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు మురళిని పలుసార్లు (సుమారు 10 నుంచి 15 సార్లు) ఇంటికొచ్చి మరీ రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి మృతుడు నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. వారు కొంతమంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో కుమ్మక్కయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదేపదే సందర్శించి, తమ కుమారుడిని మానసికంగా వేధించి, బెదిరించారని కుటుంబం ఆరోపించింది.
నిరంతర వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో తల్లి పేర్కొంది. సంఘటన జరిగిన రోజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటలకు నిర్మాణంలో ఉన్న భవనానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కోసం ఉద్దేశించిన ఇనుప హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పని కోసం వచ్చిన వడ్రంగి గణేష్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.ఉష, శశిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మురళి తల్లి కోరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.


