ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
వేమూరు(మూల్పూరు): దళిత సర్పంచ్ అయిన తనను పంచాయతీ కార్యదర్శి కె. సాంబశివరావు మానసిక, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ముల్పూరు గ్రామ సర్పంచ్ జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆందోళన వెలిబుచ్చారు. ‘పనులు తీర్మానం చేయాలన్నా, బిల్లులు పెట్టాలన్న తనకు లొంగిపోయి సహకరించాలని కార్యదర్శి వేధిస్తున్నాడు.
అక్టోబరు 13న జిల్లా కలెక్టరు, ఎస్పీకి స్పందనలో అర్జీ పెట్టుకున్నా. డిప్యూటీ ఎంపీడీవో జొన్నలగడ్డ వినయబాబు పంచాయతీకి వెళ్లి తూతూ మంత్రంగా విచారణ చేశారు. ఇక ఎస్పీకి పెట్టుకున్న అర్జీకి సంబంధించి చుండూరు సీఐ శ్రీనివాసరావు నన్నే పిలిపించి.. కార్యదర్శికి సహకరించి పనులు చేసుకోవాలి.. అంటూ చెప్పి పంపించారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎంపీడీవో మహిళ అయి కూడా సాటి మహిళ బాధను అర్థం చేసుకోలేకపోతోందని తెలిపారు. అక్టోబరు 31వ తేదీన జిల్లా కలెక్టరుకు మళ్లీ ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.
ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మా అన్న
‘నాపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశావుగా, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మా అన్న. నీవు ఎంత మంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేవు. నాకు కూటమి ప్రభుత్వం అండ ఉంది. నీకు బిల్లులు రాకుండా చేస్తా. నేను చెప్పినట్లుగా చేయాల్సిందే’’ అని కార్యదర్శి తన బెదిరింపులను కొనసాగిస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.


