ఆహారం.. కేవలం ఆకలిని తీర్చుకునే పదార్థమే కాదు.. జీవితం, సంస్కృతి,చరిత్రల ప్రతిబింబం. ప్రపంచంలోని ప్రతి మూలనా ఆహారం ఒక భాషగా పరిణమించింది. తరతరాలుగా అందిన ఆహార కథలు సంప్రదాయాలను తెలియజేస్తాయి. పండుగలలో కుటుంబంతో పాటు పంచుకునే విస్తృతమైన విందుల నుండి, రోడ్ల పక్కన దొరికే అల్పాహారం వరకు.. మనం తినే ప్రతి వంటకం ఆ ప్రదేశపు గుర్తింపును,చరిత్రను తెలియజేస్తుంది. ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లను అధిగమిస్తూ బెంగళూరు ‘ఉత్తమ ఆహార నగరం’గా నిలిచింది. నెట్టింట మరో యుద్ధానికి దారి తీసింది.
స్కాటిష్ కంటెంట్ సృష్టికర్త హ్యూ ఆన్‌లైన్‌లో ‘హ్యూ అబ్రాడ్’గా పేరొందారు. తన ఆహార రుచుల పరిశోధన తరువాత ఆయన బెంగళూరుకు పట్టంకట్టారు. బెంగళూరులో లభ్యమయ్యే అల్పాహారాలలో ముఖ్యంగా ఇడ్లీ, దోసె, ఫిల్టర్ కాఫీల క్లాసిక్ కలయిక, తన హృదయాన్ని దోచుకుందని హ్యూ ఆనందంగా తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో హ్యూ భారతదేశంలోని ఏడు ప్రధాన నగరాల మీదుగా వారాల తరబడి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, కొచ్చిలతో పాటు బెంగళూరులను సందర్శించారు.

అల్టిమేట్ ఫుడ్ సిటీ?
భారతదేశ పర్యటన ముగించుకున్న ఆయన పాకిస్తాన్‌కు కూడా వెళ్లారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఈ రెండు దేశాల ఆహారాన్ని పోల్చుతూ నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో, ఒక అభిమాని భారతదేశంలో ‘అల్టిమేట్ ఫుడ్ సిటీ’ ఏదని అడిగారు. దీనికి సమాధానంగా హ్యూ.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహార పర్యాటక ప్రాంతాలను పక్కన పెట్టి, బెంగళూరు పేరును వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బెంగళూరులో లభ్యమైన అల్పాహారానికి ఫిదా అయిన ఆయన అల్టిమేట్ ఫుడ్ సిటీ కిరీటం బెంగళూరుకే దక్కుతుందన్నారు. అక్కడ తాను తాగిన ఫిల్టర్ కాఫీ, తిన్న దోసెలు, ఇడ్లీలు మరో ప్రపంచాన్ని చూపించాయని ఆయన అన్నారు. తన ఈ ప్రయాణంలో బెంగళూరులోనే తాను ఆహారాన్ని అమితంగా ఆస్వాదించానని స్పష్టం చేశారు.
గుర్తుకొస్తే చాలు..
దోసె వేసే తీరును, రుచిని ఆయన వర్ణిస్తూ ‘దోసెలు.. గ్లాస్ మాదిరిగా పారదర్శకంగా క్రిస్పీగా ఉంటాయి’ అని వివరించారు. అదేవిధంగా ఇడ్లీలు నోటిలో పెట్టుకోగానే కరిగిపోతాయని అభివర్ణించారు. ఆ వంటకాల గురించి ఆలోచిస్తుంటే మళ్లీ ఆకలిని పెరుగుతున్నదన్నారు. హ్యూ ఆహార తీర్పు వెలువడిన వెంటనే ఆన్‌లైన్‌లో అది చర్చకు దారితీసింది. బెంగళూరులో నివసించే కొందరు ఉత్తర భారతీయులతో సహా పలువరు ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు అల్పాహారం విషయంలో బెంగళూరు టాప్‌లో ఉంటుందని అంగీకరించారు.

ఉత్తర భారతీయులు గరంగరం
ఒక యూజర్ తాను బెంగళూరులో నివసిస్తున్న ఉత్తర భారతీయుడినని.. దోసె, ఇడ్లీలు ఉత్తమ అల్పాహారం అని నేను అంగీకరిస్తున్నానని రాశారు. మరికొందరు ఈ వ్లాగర్ అందించిన తీర్పు కేవలం అల్పాహారం వరకే పరిమితమని రాశారు. ఆహార ప్రియులైన మరికొందరు హ్యూను భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఆహార కేంద్రాలను సందర్శంచాలని కోరారు. మరొక యూజర్ మీరు దేశవ్యాప్తంగా ఇతర ఆహారాలను కూడా ప్రయత్నించాలని, అల్పాహారం ఆధారంగా ఇలా చెప్పడం తప్పని హ్యూకు సూచించారు. మరొకరు.. పంజాబ్, యూపీలను మినహాయించి ఈ వ్యక్తి ఆహారంపై వీడియో చేశాడని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
హైదరాబాద్, ఢిల్లీ..
మరో వినియోగదారు ఉత్తమ ఆహార నగరాలుగా లక్నో, హైదరాబాద్‌లను పేర్కొన్నారు. పాకిస్తాన్ విషయానికొస్తే హ్యూ అక్కడి కరాచీని తనకు ఇష్టమైన ఆహార నగరంగా ఎంచుకున్నారు. భారతదేశంలో బెంగళూరుకు కిరీటాన్ని పెట్టిన ఆయన ఢిల్లీని కూడా ప్రశంసించారు. అక్కడ లభ్యమైన జిలేబీ, రబ్డీని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ అంతిమంగా ఇడ్లీ, దోసె, ఫిల్టర్ కాఫీల కలయికతో బెంగళూరు అత్యుత్తమ ఆహార అనుభూతిని అందించిన నగరంగా నిలిచిందని హ్యూ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Pakistan: అప్పు కోసం విమానయాన సంస్థ బేరం


