ఇంటర్నెట్ అంటే తెలుసు. మరి ‘జీవుల ఇంటర్నెట్’ అంటే? ఆరోగ్య సంరక్షణ కోసం మానవ శరీరాలను డిజిటలైజ్ చేయటం. ఇంకా చెప్పాలంటే.. మైక్రోస్కోపిక్ సెన్సర్ల ద్వారా మన శరీరాలతో ఇంటర్నెట్‌ను నేరుగా కనెక్ట్ చెయ్యటమే. తద్వారా కేన్సర్ వంటి జబ్బుల్ని పుట్టుకలోనే గుర్తించి అప్పటికప్పుడు చికిత్స చెయ్యవచ్చు. వృద్ధాప్యాన్ని సైతం జయించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ అందమైన కల పీడకలగానూ మారే హ్యాకింగ్ ముప్పూ పొంచి ఉందనే అనుమానాలూ లేకపోలేదు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) నుంచే ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్స్ (ఐఓబీ) లేదా జీవుల ఇంటర్నెట్ మాట పుట్టింది. సాంకేతికత ద్వారా గణాంకాల సేకరణ, సత్వర పంపిణీలో మనిషి జోక్యాన్ని సాధ్యమైనంత తగ్గించటమే ఐఓటీతో ఒనగూడే ప్రయోజనం. రోజువారీ పనుల్లో వాడే గృహోపకరణాల దగ్గరి నుంచి ఆధునిక పారిశ్రామిక పరికరాల వరకు సెన్సర్లు, సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతికతల సహాయంతో నిరంతరం అనుసంధానమై ఉంటూ ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని, గణాంకాలను ఎప్పటి కప్పుడు పరస్పరం పంచుకోవటం ఐఓటీలో జరిగే పని.
– సాక్షి, స్పెషల్ డెస్క్
ఏంటి ఈ ఐఓబీ?
» ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్.. మనుషుల దేహాలను ఇంటర్నెట్‌కు ఈ సాంకేతికత అనుసంధానిస్తుంది. అతి చిన్న, అత్యంత అధు నాతన సెన్సర్లు మన శరీరాల్లోకి ప్రవేశించటం ఐఓబీ ద్వారా సుసాధ్యమవుతుంది. సెన్సర్లు, సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతి కతల సహాయంతో మనిషి దేహంలో జరిగే ఆరోగ్యమార్పులను సూక్ష్మ స్థాయిలోనే గుర్తిస్తారు. అంతేకాదు, దేహం లోపలికి సూక్ష్మ రోబోలను పంపి చికిత్స చేయటానికీ ఐఓబీ దోహదం చేస్తుంది.
ఇంటర్నెట్ మూడో దశ
» డిజిటల్ యుగంలో ఇప్పుడు మూడో దశ నడుస్తోంది. మొదటి దశలో కంప్యూటర్లు వచ్చాయి. రెండో దశలో రోజు వారీ జీవితాన్ని ప్రభావితం చేసే వస్తువులను కంప్యూటర్‌తో అనుసంధానం జరిగింది. ఇంటర్నెట్ మూడో దశలో ‘జీవుల ఇంటర్నెట్’ వస్తోంది. మైక్రోస్కోపిక్ సెన్సర్ల ద్వారా మన శరీరాలతో ఇంటర్నెట్‌ను నేరుగా కనెక్ట్ చెయ్యటమే దీని ఉద్దేశ మని ఇటలీ మిలన్ లోని బోకోని విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గ్రిల్లో అన్నారు.
‘జెల్ ఆధారిత ‘బయో రోబోలు’ దేహంలో ఉంటూ మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడమే కాకుండా, రక్తం గడ్డ కడుతున్నప్పుడు గుర్తించి సమాచారం అందిస్తాయి. అవసరమైతే ఆస్పిరిన్ మందును కూడా విడు దల చేస్తాయి. వైరస్‌లు దాడి చేసినప్పుడు టీకాలను సైతం అప్పటి కప్పుడు యాక్టివేట్ చేస్తాయి’ అని ఆయన అంటున్నారు.
వైద్య పరిశోధనలో మేలిమలుపు
‘జీవ ఇంటర్నెట్’.. మన అవయవాల నుంచి ఎప్పటికప్పుడు తాజా డేటాను సేకరించటం ద్వారా వైద్య పరిశోధనను సమూలంగా మార్చగలదు. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని ఓడించడం.. పేద దేశాల్లోనూ ప్రతి ఒక్కరూ వ్యాధుల్లేకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడటం.. వంటి అద్భుత కలలను జీవుల ఇంటర్నెట్ నెరవేర్చుతుందని ఆశిస్తున్నారు.
» నిశ్శబ్ద గుండెపోట్లను సకాలంలో గుర్తిస్తుంది
» అవసరమైనప్పుడు మందులను విడుదల చేస్తుంది.
» శరీరం లోపల నుంచే చికిత్సలను అందిస్తుంది
» తద్వారా ప్రాణాలను కాపాడుతుంది
మరణాలు నివారించవచ్చు..
ఈ సాంకేతికత కొన్ని కొత్త పరిణామాలకు దారితీస్తుందని ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గ్రిల్లో చెబుతు న్నారు. ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వల్ల వ్యాధులు అభివృద్ధి చెందకముందే వాటిని గుర్తించడం సులభం అవుతుంది. ఆహారంలో మార్పులు లేదా మరింత వ్యక్తిగతీకరించిన వ్యాయామ దినచర్యలను సూచించవచ్చు. సకాలంలో హెచ్చరికలు పంపడం ద్వారా మరణాలను నివారించవచ్చు.
ఒక్క అమెరికాలోనే ప్రతి సంవత్సరం 8,05,000 మంది గుండె పోటుతో మరణి స్తుంటే.. సమస్యను గుర్తించలేక 1,70,000 మంది ‘నిశ్శబ్ద’ గుండెపోట్లతో చనిపోతున్నారు. జీవుల ఇంటర్నెట్ యుగంలో వైద్య పరిశోధన, ఔషధ ఆవిష్కరణ ఇప్పటిలా కాకుండా అత్యంత వేగవంతమవుతుంది. భారీ డేటాబేస్‌లు సమస్యకు ఏది పనిచేస్తుందో చూపించే నమూనాలను సూచిస్తాయి. ఔషధాలు చాలా త్వరగా, చౌకగానే కాకుండా కచ్చితత్వంతోనూ అభివృద్ధి అవుతాయి.
పీడ కల కాకుండా..
మన శరీరాలను డిజిటలైజ్ చేసే జీవుల ఇంటర్నెట్‌ను మనం జాగ్రత్తగా వినియోగించాలని నిపు ణులు సూచిస్తున్నారు. హ్యాకర్లు ‘ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్స్’ ను లక్ష్యంగా చేసుకుంటే ఎదురయ్యే విపరిణామాలు భయంకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.


