ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (CRDMO) అయిన న్యూసిలియన్ థెరప్యూటిక్స్‌ను తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసింది. జీనోమ్ వ్యాలీలో ఉన్న ఈ సీఆర్‌డీఎంఓ క్యాన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అరుదైన జన్యుపరమైన వ్యాధులకు అధునాతన చికిత్సల కోసం వరల్డ్ లైఫ్ సైన్స్ ఆవిష్కర్తలకు మద్దతు ఇస్తోంది. ఈ కంపెనీ ప్లాస్మిడ్ డీఎన్‌ఏ, వైరల్ వెక్టార్స్, ఆటోలోగస్, అల్లోజెనిక్ సెల్ థెరపీ విభాగాల్లో కొత్త చికిత్సలను అభివృద్ధి చేస్తుంది.
సెల్ అండ్ జీన్ థెరపీ(CGT)లపై దృష్టి
‘ఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి. అందులో సెల్ అండ్ జీన్ థెరపీలు కీలకంగా ఉంటాయి. అధునాతన థెరపీ ప్లాట్‌ఫామ్‌లను భారతదేశ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలో ఏకీకృతం చేయడం, సంక్లిష్టమైన, అరుదైన వ్యాధులకు పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని న్యూసిలియన్ థెరప్యూటిక్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..
న్యూసిలియన్ థెరప్యూటిక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘు మాలపాక మాట్లాడుతూ..‘ఈ కొత్త కంపెనీ క్లినికల్ నుంచి కమర్షియల్ సమస్యలకు సంబంధించిన ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను అందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు(FDA, EMA) అనుగుణంగా ఉంటుంది. అరుదైన జన్యు రుగ్మతలు, క్యాన్సర్ వంటి వ్యాధుల కట్టడికి పరిష్కారాలు అందిస్తుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌పై ఈడీ చర్య


