అర్బన్ ప్రాంతాల్లో టీకాల కోసం ప్రదక్షిణలు
ఆస్పత్రులకు పరుగులు..తప్పని ఛీవాట్లు
క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అలసత్వం
పర్యవేక్షణ శూన్యం
తల్లడిల్లుతున్న పిల్లల తల్లిదండ్రులు
చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం టీకాలు ఉచితంగా అందిస్తోంది. వీటిని వేయిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంతోపాటు వారికి భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. అలసత్వం.. ఉదాసీనత కారణంగా చిన్నారులకు టీకాలు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు టీకాలు వేయించడానికి ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. పొద్దస్తమానం ఆస్పత్రుల వద్ద నిరీక్షణతోపాటు సిబ్బందితో ఛీవాట్లు తినాల్సివస్తోంది. ఇలా టీకాలు వేయించక చిన్నారులకు ఆరోగ్యరక్షణ కొరవడుతోంది.
కాణిపాకం: చిత్తూరు జిల్లాలో టీకా లక్ష్యం నీరుగారుతోంది. అర్బన్ ప్రాంతాల్లో నిర్లక్ష్యం ఆవహించింది. పిల్లలకు టీకాలు వేయడంలో వైద్యసిబ్బంది అలసత్వం స్ప ష్టంగా కనిపిస్తోంది. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది. సకాలంలో టీకాలు వేయించలేక తల్లులు తల్లడిల్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
చిన్నారులు ఏ వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం రూపొందుతుంది. పూర్వం టీ కాలు అందుబాటులో లేకపోవడం, ఉన్నా సరైన అ వగాహన లేకపోవడం తదితర కారణాలతో మాతా శిశుమరణాలు జరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు చక్కటి టీకాలు అందుబాటులోకి వచ్చాయి.
అందని ఫలితం?
నిరుపేదల వైద్యం కోసం ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రాకపోగా, చిన్నారులకు బాల్యంలో వేయించలేకపోవడంతో వారు వ్యాధుల బారిన పడుతున్నారు. పేద, ధనిక తేడా లేకుండా ఎక్కడ జన్మించిన శిశువులైనా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రతి బుధ, శనివారాల్లో టీకాలు వేస్తున్నారు.
ఏటా సాధారణ రోజులతో పాటు పల్స్ పోలియో కార్యక్రమం ఏటా రెండుసార్లు, ఇంధ్రధనస్సు పేరుతో ఏడాదికి రెండుసార్లు టీకాలు అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా చిన్నారులకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించే టీకాలు పూర్తి స్థాయిలో వేయించడం లేదని పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేయాల్సిన పనులివీ..
వ్యాధులు దరి చేరకుండా రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండేందుకు పుట్టినప్పటి నుంచి 16 ఏళ్లలోపు వారికి, గర్భిణులు, బాలింతలకు 10 రకాల టీకాలు అందించాలి. విటమిన్–ఏ కూడా ఇందులో భాగమే బీఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో బాధితులను గుర్తించి సకాలంలో సమాచారం అందించాలి. మరోవైపు అధికారులకు తెలియజేయాలి. ప్రతి బుధవారం ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గుర్తించిన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేయాలి. కానీ చాలా చోట్ల ఈ ప్రక్రియ సాగడం లేదు.
అర్బన్‌లో అవస్థ
అర్బన్ ప్రాంతాల్లో వెద్య సిబ్బంది టీకా లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. వ్యాక్సినేషన్ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సిబ్బంది వారి పరిధిలో టీకాలు వేయడం లేదు. టీకాకు వెళితే.. ఇక్కడి రండి.. అక్కడకు వెళ్లండంటూ తిప్పిస్తున్నారు. లేదంటే వ్యాక్సిన్ అయిపోయిందని, తీసుకెళ్లి ఇచ్చేశామని, వచ్చేవారం రమ్మని వాయిదా వేస్తున్నారు. లేకుంటే తేలికగా పిల్లల తల్లులను జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, సీహెచ్‌సీలకు పంపుతున్నారు. లేదంటే పక్కన్న ఉన్న సెంటర్లకు వెళ్లాని సూచిస్తున్నారు. దీంతో తల్లులు పిల్లలతో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
టీకా మీ పరిధిలో వేసుకోవాలని...ఇక్కడకు ఎందుకు వచ్చారని ఆస్పత్రి సిబ్బంది తల్లులపై కసుబుసులాడుతున్నారు. ఛీవాట్లు పెట్టి గంటలకొద్ది పరీక్ష పెడుతున్నారు. ఇక ప్రసవించిన తర్వాత శిశువులకు ప్రాథమిక టీకాలు వేయించిన తర్వాత తల్లిదండ్రులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో వారు నివాసం ఉండే ప్రాంతాల్లో టీకాలు వేయించేందుకు ఆసక్తి చూపడం లేదు. క్షేత్రస్థాయిలోని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు టీకాలు వేయించడంలో ఆసక్తి చూపడం లేదు.
పల్లె ప్రాంతాల్లో కూడా చాలా ఇదే పరిస్థితి ఎదరవుతోంది. టీకాల అందించడంలో అలసత్వం చూపుతూ జిల్లా కేంద్రానికి పంపుతున్నారు. ఈ కారణంగా తల్లులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇక సకాలంలో వ్యాధినిరోధక టీకాలు అందించక శిశుమరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు ఎప్పటికప్పడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్యాలయానికి పరిమితం చేశారు. అనుమతితోనే పరిశీలనకు వెళ్లాలని చెప్పడంతో టీకాల అధికారులు తోలు»ొమ్మలా మారారనే విమర్శలు వస్తున్నాయి.
చిత్తూరు నుంచే.. చిత్తూరు జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వ్యాధి నిరోధక టీకాల విభాగముంది. ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా, తిరుపతి, అన్నమయ్య జిల్లాలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలకు టీకాలు చేరుతాయి. డిమాండ్లు, కాలమానిని ప్రకారం ప్రాంతీయ, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 162 ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అవుతున్నాయి. 4,97,668 మంది పిల్లులకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందించాల్సి ఉంది. అయితే స్థానిక వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వ్యాక్సినేషన్ వేయడంతో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
వ్యాధులు.. టీకాలు ఇలా...
» ప్రసవం నుంచి 24 గంటలలోపు టీబీ, జాండిస్ నుంచి రక్షణకు బీïÜసీ, పోలియో, నివారణకు ఓపీవీ 0 డోసు, కామెర్ల వ్యాధి అరికట్టేందుకు హెపటైటిస్ టీకాలు వేయాల్సి ఉంది.
» 45 రోజులకు పోలియో నివారణకు ఓపీవీ–1, ఓపీవీ–2, ఓపీవీ–3, ఐపీవీ
» 75 రోజులకు కంఠ సర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు, న్యుమోనియా నివారణకు పెంటా–1, 2, 3 టీకాలు వేయాల్సి ఉంది.
» 105 రోజులకు తీవ్ర నీళ్ల విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి నివారణకు ఆర్వీవీ–1, 2, 3 టీకాలు వేయాలి.
» 9–12 నెలల మధ్య తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్–1, అంధత్వ నివారణకు విటమిన్–ఏ, మెదడువాపు నివారణకు జేఈ–1, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందుల నివారణకు ఎఫెవీవీ–3, అంధత్వ నివారణకు విటమిన్–22 టీకాలు వేయాల్సి ఉంది.
» 5–6 సంవత్సరాల మధ్య కంఠ సర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీటీ–2 వేయాల్సి ఉంది. అయితే ఈ మేరకు టీకాలు వేయడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి వ్యాక్సిన్ సరఫరా అయ్యే కేంద్రాలు
పీహెచ్‌సీలు 101 యూపీహెచ్‌సీ 37
సీహెచ్‌సీలు 17 ఏహెచ్ 5
డీహెచ్ 2 మొత్తం 162


