జీవో రాకముందే మద్యం ధరల పెంపు
జోరుగా సాగుతున్న మద్యం సిండికేట్ దందా
కూటమి ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక మామూళ్లు
జీవో వచ్చాక కూడా దోపిడీ కొనసాగేలా సిండికేట్ స్కెచ్
చేష్టలుడిగి చూస్తున్న ఎక్సైజ్ శాఖ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోతో మాకేం సంబంధం లేదు.. ప్రభుత్వమే మాది.. మా దోపిడీని ఆపేదెవర్రా.. అన్నట్లుంది రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ బరితెగింపు. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు (జీవో) విడుదల కాకముందే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేసి, మూడు రోజులుగా అనధికారికంగా దోపిడీకి తెగబడుతున్నారు. అందుకు ఎక్సైజ్ అధికారులు అడ్డుకోకుండా చూస్తామని చెప్పి.. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు సంక్రాంతి సీజన్ వేళ మద్యం దుకాణాల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ఈ నెల 8న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది.
ఒక్కో బాటిల్‌పై రూ.10 పెంపునకు నిర్ణయించింది. కాగా, అందుకు అనుమతినిస్తూ అధికారికంగా జీవో ఇంకా విడుదల కాలేదు. అంటే మద్యం ధరల పెంపు అధికారికంగా ఇంకా అమలులోకి రాలేదు. కానీ ఈ అధికారిక ప్రక్రియతో తమకు సంబంధం లేదంటూ మద్యం సిండికేట్ బరితెగించింది. ఈ నెల 9 నుంచే మద్యం ధరలు పెంచేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో ధరల పెరుగుదల అనధికారికంగా అమలులోకి వచ్చేసింది. ‘ముఖ్య’ ప్రజా ప్రతినిధి దన్ను ఉండటంతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూడటం మినహా ఏమీ చేయలేక పోతోంది.
సంక్రాంతి స్పెషల్
బాటిల్‌పై రూ.10 అదనం అంటే ఏముందీలే అనుకోవద్దు. ఎందుకంటే రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాలు, 540 బార్లు ఉన్నాయి. వాటిలో నెలకు 6 లక్షల కేసుల వరకు మద్యం విక్రయిస్తున్నారు. రోజుకు దాదాపు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అనధికారికంగా బాటిల్‌పై రూ.10 పెంపుదలతో రోజుకు రూ.5 కోట్లు చొప్పున అనధికారికంగా కొల్లగొడుతున్నారు. ఇలా మూడు రోజులుగా రూ.15 కోట్ల వరకు దందా సాగించారు.
ఇక సంక్రాంతి సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు మద్యం సిండికేట్.. బెల్ట్ దుకాణాల్లో మరో రూ.5 అదనంగా పెంచింది. అందుకోసమే ఏకంగా 75 వేల వరకు బెల్ట్ దుకాణాలను బరితెగించి మరీ ఏర్పాటు చేసింది. మద్యం ధర పెంపు జీవో వచ్చిన తర్వాత కూడా అధికారిక పెంపుదల రూ.10తోపాటు అనధికారికంగా మరో రూ.10 పెంపుదలకు సిండికేట్ ఇప్పటికే నిర్ణయించింది. వెరసి ఒక్కో బాటిల్‌పై రూ.15 అదనపు దోపిడీ ఇకపై కూడా వర్తించనుందన్నది సుస్పష్టం.

కూటమి ప్రజాప్రతినిధులకు మామూళ్లు
మద్యం సిండికేట్ డిమాండ్‌ను తమ ప్రభుత్వం ఆమోదించి ధరలు పెంచింది కాబట్టి.. తమకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో సిండికేట్.. ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.50 వేలు, ఒక్కో బార్ నుంచి రూ.2 లక్షలు చొప్పున వసూలు చేసి కూటమి ప్రజా ప్రతినిధులకు ముట్టజెబుతోంది. ఆ ప్రకారం రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాల నుంచి రూ.18.18 కోట్లు, బార్ల నుంచి రూ.10.80 కోట్లు కూటమి ప్రజా ప్రతినిధులు వసూలు చేశారు. మద్యం దుకాణాల నుంచి సంక్రాంతి మామూళ్ల వసూళ్ల ప్రక్రియను కూటమి ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.


