మూలకు చేరిన కియోస్క్‌లు
పలమనేరు : గత ప్రభుత్వంలో రైతుల చెంతనే ఉంటూ వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉన్న రైతుసేవా కేంద్రాల్లో నేడు సేవలు అంతంత మాత్రంగానే మారాయి. గతంలో రైతులకు ఎప్పుడు ఎరువులు కావాలన్నా దొరికేవి. నేటి కూటమి పాలనలో కేవలం ఓ బస్తా యూరియా కోసం పొరుగునే ఉన్న కర్ణాటక లేదా ఎప్పుడో అందించే యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. పలమనేరు నియోజకవర్గంలో 90 పంచాయతీల్లో రైతుసేవా కేంద్రాలున్నాయి. పలమనేరు రూరల్ మండలంలోని కోటూరు ఆర్‌స్‌కేలో గోదాంగా మారింది. ఇక సముద్రపల్లి కేంద్రం అలంకారప్రాయంగా మారింది. పెద్దపంజాణి, గంగవరం మండలాల్లోని ఆర్‌స్‌కేల్లో కియోస్క్‌లు మూలకు చేరాయి. బైరెడ్డిపల్లి మండలంలో కొన్ని చోట్ల రైతులు పంట ఉత్పత్తులను సెంటర్ల ముందు వేసుకొని వాడుకుంటున్నారు. మండల కేంద్రమైన వీకోట, బైరెడ్డిపల్లిలోనూ ఆర్‌ఎస్‌కేల్లో ఎలాంటి సేవలు లేవు. దీంతో ఆర్‌ఎస్‌కేల వద్ద బూతద్దం పెట్టి వెతికినా రైతులు కనిపించడం లేదు.


