కాజూరు చెరువు కనుమరుగు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాజూరు చెరువు కనుమరుగు కానుంది. చెరువును సైతం కనుమరుగు చేసే అధికార పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలో ఉండడం వల్లే సాధ్యమవుతోంది. గత నెల రోజులకు పైగా కాజూరు చెరువులోని మట్టిని దోచేస్తున్నారు. యంత్రాలతో మట్టిని యథేచ్ఛగా తోడేస్తున్నారు. కాజూరు చెరువులో మట్టిని ఇష్టానుసారంగా తవ్వుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం స్పందించడం లేదు. చెరువులో రోజు వందలాది లోడ్లు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే వారి ఇళ్ల వద్దకు రౌడీలను పంపి దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు కాజూరు లోని ఓ టీడీపీ నాయకుడు, చిత్తూరులోని ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరుగుతోందని తెలిసింది. వేల మంది రైతులకు ఉపయోగపడే కాజూరు చెరువును అభివృద్ధి చేయాల్సింది పోయి ఆ చెరువును ప్రస్తుత సర్కారులో కనుమరుగు చేస్తున్నారు. చెరువును కబ్జా చేస్తున్నప్పటికీ ఇరిగేషన్, నగరపాలక అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి మట్టి దోపిడీ చేస్తున్న అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కాజూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు, కాజూరు చెరువు నుంచి ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్న దృశ్యాలు
కాజూరు చెరువు కనుమరుగు


