పెద్ద పండుగ... ప్రాంతానికో ప్రత్యేకం
గోదావరి జిల్లాల్లో కోడి పందేలు
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడ్ల పోటీలు
కోనసీమలో ప్రభల తీర్థం
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జల్లికట్టు సాహసం
సాక్షి, అమరావతి: ‘ప్రకృతి ఒడిలో పసిడి కాంతుల పరవశం.. ముంగిట ముగ్గులు.. మురిపించే గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. ఆకాశంలో గాలిపటాల విన్యాసాలు.. అంబరాన్నంటే కేరింతలు.. కొత్త బియ్యం పాయసాలు.. కమ్మని నెయ్యి పరిమళాలు.. భోగి మంటల వెచ్చదనం.. ఆతీ్మయ కలయికల మాధుర్యం.. రైతు కంట ఆనందం.. ఇంటింటా సంక్రాంతి వైబోగం..’ అంతటితో సరిపెడితే ఎలా అనుకున్నారో ఏమో.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకత చాటుకునేలా సంక్రాంతి కోలాహలాన్ని కొనసాగిస్తూ మరింత జోష్ నింపుతున్నారు. పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి వేళ ప్రత్యేక సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులపాటు సంక్రాంతి ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహిస్తూనే మరింత సందడి నింపేలా చేస్తున్న కార్యక్రమాలు ఆ ప్రాంతాలకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాయి. అవి ఏమిటంటే..
కత్తులు దూసే పందెం కోళ్లు
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందాలకు పెద్ద క్రేజ్ ఉంది. పల్నాటి బ్రహ్మనాయుడు, నాగమ్మ మధ్య పోరాటంలో కోడి పందేలు సైతం పౌరుషాన్ని చాటాయని చరిత్ర చెబుతుండగా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. తొలినాళ్లలో కత్తులు కట్టకుండా సరదాగా నిర్వహించిన కోడి పందేలు రానురాను సంప్రదాయం ముసుగులో జూదాల జాతరను తలపించేలా సాగుతున్నాయి. తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలనూ కోడి పందేలు తాకాయి.
ప్రధానంగా భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఏలూరు, అమలాపురం, రాజమహేంద్రవరం, దెందులూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించే భారీ పందేలను తిలకించేందుకు వేల సంఖ్యలో జనం వస్తుంటారు. నెత్తురోడుతున్నా గెలుపు కోసం జూలు విదిల్చి కత్తులు దూసే కోడి పందాల్లో బెట్టింగ్‌లకు పలు రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. విదేశాల్లో స్థిరపడిన వారు సంక్రాంతికి ఈ ప్రాంతానికి వ్యయ ప్రయాసలకోర్చి చేరుకుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు ఈ ప్రాంత వాసులు ప్రత్యేక బస ఏర్పాట్లు చేయడంతోపాటు విందు, వినోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఇప్పుడు భారీ టెంట్లు, ఫ్లడ్‌లైట్లు కాంతులు, ప్రత్యేక గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, బౌన్సర్లు, అతిథులకు విందు, వినోదాలతో కోడి పందేలు నిర్వహించే తీరు అబ్బో అనిపిస్తుంది.
ప్రభల తీర్థం.. కోనసీమ ప్రత్యేకం
400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభల తీర్థం కోనసీమ ప్రాంతానికి ప్రత్యేకం. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శైవ ఉత్సవంగా నిర్వహించే ప్రభల తీర్థంలో సమీపంలోని 11 గ్రామాల నుంచి 11 ప్రభలు (తడికెలు, కర్రలతో తయారు చేసినవి) తీసుకొస్తారు. ఏకాదశ రుద్రులుగా పరిగణించే ప్రభలను వరి పొలాలు, కాలువలు, కౌశిక నది (గోదావరి పాయ) దాటి తీసుకుని వచ్చి జగ్గన్నతోట ప్రాంతంలో కొబ్బరి తోటల్లో ఉంచుతారు.
ఎడ్ల పందేలు చూసి తీరాల్సిందే..
సంక్రాంతి వేళ ముఖ్యంగా కనుమ రోజున పశువులను పూజించి ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడ్ల అందాల పోటీలు, బండ లాగుడు పోటీలు, పరాక్రమ పోటీలు నిర్వహించడం ఆచారంగా మారింది. తొలినాళ్లలో రైతులు నిర్వహించిన ఈ పోటీలు రానురాను ప్రత్యేక ప్రదర్శన, ఆకర్షణగా మారాయి. రాష్ట్రంలో ప్రధానంగా ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడ్ల పరుగు పందేలు, బరువైన బండ్లను లాగుతూ వేగంగా పరిగెత్తించడం, ఒంగోలు గిత్తల ప్రదర్శన వంటి పోటీలు నిర్వహించడంతో వేల సంఖ్యలో తిలకించేందుకు వస్తారు.
జల్లికట్టు.. ప్రాణాలతో చెలగాటమే
తమిళనాడుకు చెందిన జల్లికట్టును ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అనేక గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా పశువుల పండగను పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తుంటారు. అదుపు తప్పి పరుగులు తీసే ఎద్దులకు ఎదురెళ్లి కట్టడి చేసేందుకు యువకులు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ జల్లికట్టులో పాల్గొంటారు. ఎద్దులను, గిత్తల కొమ్ములకు కట్టిన జెండాలను చేజిక్కించుకునే క్రమంలో వాటి కొమ్ములు దిగి, కాళ్ల కింద నలిగి గాయాలపాలైనా వాటిని కట్టడి చేసేందుకు చేసేందుకు ప్రయత్నిస్తారు.
గుర్రపు పందేలు.. పందుల పందేలు..
సంక్రాంతి రోజుల్లో ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాలోని కొన్నిచోట్ల గుర్రపు పందేలు నిర్వహిస్తుంటారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వినోదం కోసం పందులు, పొట్టేళ్ల పందేలు నిర్వహించడం జరుగుతోంది.


