మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి
త్వరలోనే పార్టీ సభ్యత్వం, కమిటీలు పూర్తి చేయనున్నాం
వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలనే నిశ్చయంతో ఉన్నాం
ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రీజనల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్‌రెడ్డి
సాక్షి, పుట్టపర్తి: క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు చేపట్టనున్నామని, సంస్థాగత కమిటీలు త్వరలోనే పూర్తి చేస్తామని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులతో పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విస్తృత స్థాయి సమావేశంలో మిథున్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పార్టీ టాస్‌్కఫోర్స్ కమిటీ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఐటీ విభాగం జోనల్ ఇన్‌చార్జ్ చల్లా మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, పీఏసీ సభ్యుడు శంకర్‌నారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేశ్‌కుమార్‌రెడ్డి, హిందూపురం పార్లమెంటరీ పరిశీలకులు రమేశ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం పీవీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ జెండా మోసే ప్రతి ఒక్కరికీ సభ్యత్వం ఇవ్వడంతోపాటు గ్రామ/వార్డు స్థాయి నుంచి కమిటీల్లో లక్షలాది మందికి చోటు కల్పిస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసి.. ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి వరకు అనుబంధ విభాగాల్లో కమిటీలు పూర్తి చేయాలన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చాలా ధైర్యంగా ఉండాలని జగనన్న భరోసా ఇచ్చినట్లు తెలియజేశారు. నాయకులందరూ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా పని చేస్తారన్నారు.
ఢిల్లీకి మించి భూముల ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు భవనం నిర్మాణాలు చదరపు అడుగు విలువ కంటే అమరావతిలో అధిక ధరలకు నిర్మాణాలు చేపడుతున్నారని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు కట్టిన చదరపు అడుగు ధర కంటే రెండింతల అధిక ధరలకు అమరావతిలో నిర్మాణాలు చేపట్టిన విషయంపై వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోందన్నారు. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ పేద రైతులకు ప్లాట్లు డెవలప్‌మెంట్ చేసి ఇస్తామని చెప్పి.. ఇప్పటికీ అతీగతీ లేదన్నారు.
ఈ విషయంలో ఇటీవల ఓ రైతు తన బాధను తెలియజేసి గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు. వైఎస్ జగన్ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని, మీడియా సమావేశంలో ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కూటమి నాయకులు.. వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రయోజనాలను పక్కనబెట్టి.. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నీటి పంపకాల విషయంలో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.


