కూలీలకు డబ్బుల్లేవ్‌... పనులకు కోత కూలిన ‘ఉపాధి’! | AP Guaranteed Employment Workers Not Paid for Months in Chandrababu Naidu govt | Sakshi
Sakshi News home page

కూలీలకు డబ్బుల్లేవ్‌... పనులకు కోత కూలిన ‘ఉపాధి’!

Jan 12 2026 3:33 AM | Updated on Jan 12 2026 3:33 AM

AP Guaranteed Employment Workers Not Paid for Months in Chandrababu Naidu govt

దాదాపు ఆరు నెలలుగా కూలీలకు డబ్బులు ఇవ్వకుండా తొక్కిపెట్టిన బాబు సర్కారు

పండుగ నాడూ నిరుపేదల పస్తులు 

కూలీలకు చెల్లించాల్సిన ఉపాధి డబ్బులు రూ.454 కోట్లు 

ఆగస్టు 10 తర్వాత నుంచి డబ్బులు అందక నిరుపేదల అగచాట్లు 

మరోవైపు రాష్ట్రంలో బాగా తగ్గిపోయిన ‘ఉపాధి’ కల్పన

2023 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 21.75 కోట్ల పనిదినాలు  

2025 ఏప్రిల్‌ – డిసెంబర్‌ మధ్య బాబు సర్కారు కల్పించింది 16.29 కోట్ల పనిదినాలే

సాక్షి, అమరావతి: ఎండల్లో చెమటోడ్చి చేసిన పనికి కూలి డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు సర్కార్‌ నిరుపేదలను వేధిస్తోంది. ఒకపక్క ఉపాధి పనుల్లో కోత.. మరోపక్క దాదాపు ఆరు నెలలుగా కూలి డబ్బులు అందక నిరుపేదలు నరక యాతన పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలు పండగ పూట సైతం పస్తులతో గడపాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో లక్షలాది పేద కుటుంబాల్లో సంక్రాంతి సంతోషం ఛాయలు కానరావడం లేదు. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజులకు మించి ఉపాధి కూలీలకు కూలి డబ్బులు బకాయి పెట్టకూడదని కేంద్ర చట్టం చెబుతోంది.

అయితే రాష్ట్రంలో గతేడాది ఆగస్టు 10 తర్వాత ఉపాధి కూలీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కూలీలకు రూ.425 కోట్ల మేర కూలి డబ్బుల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 20 రోజుల క్రితం రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించింది. జనవరి 10వతేదీ నాటికి కూలీలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.454 కోట్లకు పెరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కూలి డబ్బులపై ఆధారపడి జీవనం సాగించే లక్షలాది నిరుపేద కుటుంబాలు రోజువారీ అవసరాల కోసం అల్లాడుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

‘ఉపాధి’ బకాయిలు ఏపీలోనే అత్యధికం 
దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.1,766 కోట్లు వేతన బకాయిలు ఉండగా అందులో నాలుగో వంతు ఏపీలోనే ఉండటం గమనార్హం.

పనులు భారీగా తగ్గుదల..
మరోవైపు గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనుల కల్పన కూడా భారీగా తగ్గిపోయింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 ఏప్రిల్‌ – డిసెంబర్‌ మధ్య 21.75 కోట్ల పనిదినాలు కల్పించి గ్రామీణ పేదలను ఆదుకోగా.. చంద్రబాబు సర్కారు 2025 ఏప్రిల్‌ – డిసెంబరు మధ్య కేవలం 16.29 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించింది. గత ప్రభుత్వంతో పోలిస్తే  దాదాపు ఐదున్నర కోట్ల మేర పని దినాల కల్పన తగ్గిపోవడం గమనార్హం.

తగ్గిపోయిన లబ్ధిదారులు.. 
అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో  47 లక్షల కుటుంబాలకు చెందిన 75 లక్షల మంది పేదలు ఏటా వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ప్రయోజనం పొందుతుంటారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో 75.43 లక్షల మంది కూలీలు 25.30 కోట్ల పనిదినాల ద్వారా రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందారు. అదే 2025 ఏప్రిల్‌ నుంచి 2026 జనవరి 10 వరకు కేవలం 41 లక్షల కుటుంబాలకు సంబంధించి 65 లక్షల మంది ఉపాధి కూలీలకు రూ.4,400 కోట్లు మాత్రమే ప్రయోజనం చేకూరింది.

నిరుపేద ఎస్సీలకు కోత..
చంద్రబాబు సర్కారు వచ్చాక ఉపాధి హామీ పధకం పనులు భారీగా తగ్గిపోవడంతో నిరుపేద ఎస్సీలే అధికంగా నష్టపోయారు. 2023–24లో గత ప్రభుత్వం కల్పించిన మొత్తం 25.30 కోట్ల పనిదినాల్లో 22.41 శాతం మేర పనిదినాలు ఎస్సీలకే దక్కాయి. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం 2025–26లో కల్పించిన 16 కోట్ల పనిదినాల్లో ఎస్సీలు కేవలం 20.60 శాతం పనిదినాలు మాత్రమే పొందగలిగారు.

పండుగ చేసుకునే పరిస్థితి లేదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉపాధి హామీ పథకం కూలీల ఉసురు తీస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే గత ఐదు నెలల నుంచి రూ.454 కోట్లు వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు సక్రమంగా వచ్చి ఉంటే ప్రతి కుటుంబానికీ కనీసం రూ.3 వేల మేర కూలి అందేది. ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా పేద కుటుంబాలైతే, పండుగ ప్రశాంతంగా జరుపుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం సంక్రాంతి లోపు కూలీలకు వేతన బకాయిలని్నంటినీ చెల్లించాలని డిమాండ్‌ 
చేస్తున్నాం.     – వి.వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పనులే కల్పించడం లేదు 
రెండు నెలలుగా మా గ్రామంలో ఉపాధి పనులు పెట్టలేదు. వర్షం పడిందని పనులు ఆపేశారు.  ఆ తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదు. పనులు పెట్టమని అడుగుతున్నాం. ఉపాధి పనులు చేస్తే మాకు కాస్త చేదోడుగా ఉంటుంది. పనులు ఉంటే చేతిలో కాస్త డబ్బులు ఉంటాయి. సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకునేవాళ్లం. అధికారులు స్పందించి మాగ్రామంలో ఉపాధి పనులు ఏర్పాటు చేయాలి.     – దగ్గుమాటి శ్యామల, ఆత్మకూరు గ్రామం, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా

డబ్బులు జమ చేయడం లేదు
ఉపాధి హామీలో నేను పని చేసి నాలుగు నెలలైంది. అప్పటి నుంచి పని కల్పించడం లేదు. కనీసం మా ఖాతాలో డబ్బులు జమ చేయలేదు. సంక్రాంతి పండుగ సమయంలో డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేసి సొమ్ములు ఖాతాలో జమ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి.  – మెరుగు బాబూరావు, కొత్తూరు, కామవరపుకోట మండలం, ఏలూరు జిల్లా

తినడానికి కూడా కష్టంగా ఉంది..
ఉపాధి హామీ పనులే మాకు జీవనాధారం. ఈ పనులు చేసుకునే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. చేసిన పనులకు కూలి డబ్బులు పడకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. తినడానికి కూడా కష్టంగా ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో కూడా కూలి డబ్బులు పడకపోతే పస్తులు ఉండాల్సిందే.    – గోదా వెంకట్రావు, ఉపాధి హామీ కూలీ, కొత్తూరు, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా

ఎలా నెట్టుకురావాలో ?
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. పనులు చేస్తేనే కుటుంబం గడిచేది. ఉపాధి హామీ పనులు చేసినప్పటికీ కూలి డబ్బులు ఇంతవరకు జమ కాలేదు. కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో తెలియక నానా కష్టాలు పడుతున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకుదెరువు కోసం మరో పని చూసుకోవాల్సిందే. త్వరగా కూలి డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలి.    – వల్లెల మేరి, ఉపాధి హామీ కూలీ, కొత్తూరు, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement