కర్నూలులో కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న అంగన్‌వాడీలు
వైఎస్సార్‌టీయూసీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ మండిపాటు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శాంతియుత నిరసన తెలిపిన అంగన్‌వాడీలను ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అరెస్టులు చేయించడాన్ని వైఎస్సార్‌టీయూసీ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో అంగన్‌వాడీలను పాశవికంగా అరెస్టు చేయడాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కాల్వపల్లి చిన్నమ్మ, ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ తప్పుబట్టారు.
ఈ మేరకు మంగళవారం ప్రకటన చేస్తూ.. అంగన్‌వాడీ మహిళల పట్ల మగ పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన తీరుపై హోంమంత్రిగా ఉన్న మహిళ సమాధానం చెప్పాలన్నారు. గతంలో అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మహిళల ఆగ్రహానికి గురయ్యారన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
అంగన్‌వాడీ మహిళల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంగన్‌వాడీ యూనియన్ నేతలు హెచ్చరించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ యూనియన్ల నాయకులు లక్ష్మీదేవి. జైని, రత్నకుమారి, లలితమ్మ, సుజాత తదితరులు విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీలు నిద్రమత్తులో ఉండగా ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు.
అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్‌లో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే, శాంతియుతంగా ధర్నా చేసిన అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. అంగన్‌వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డాయి.


