అ'భయారణ్యం' | Papikondalu National Park is home to diverse animal species | Sakshi
Sakshi News home page

అ'భయారణ్యం'

Mar 4 2026 5:38 AM | Updated on Mar 4 2026 5:38 AM

Papikondalu National Park is home to diverse animal species

విభిన్న జంతు జాతులకు నెలవు పాపికొండలు నేషనల్‌ పార్కు 

విచ్చలవిడిగా వేట..  బలవుతున్న వన్యప్రాణులు

ఆకలేస్తే తప్ప పులి వేటాడదు. ఏ జీవికీ హాని తలపెట్టదు. గత నెలలో తూర్పు గోదావరి జిల్లాలో సాగిన దాని సంచారమే దీనికి రుజువు. రెండు మూడు రోజులకోసారి తప్ప అది జంతువులను హతమార్చింది లేదు. చివరకు అది పట్టుబడిన రోజు కూడా రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాకలో దూరినా.. అందులో గేదెలున్నా వాటికి ఏమాత్రం హాని తలపెట్టలేదు. 

కానీ, మనిషి అలా కాదు.. తనకు అవసరమున్నా లేకపోయినా.. రేపటి కోసం దాచాలనే యావలో ప్రకృతికి చేటు తెస్తున్నాడు. తన మనుగడను కొనసాగించడంలో ఇతర జీవరాశులు, మొక్కల పాత్రను గుర్తించలేని దురవస్థలో ఉన్నాడు. ఫలితంగానే జీవ వైవిధ్యానికి ముప్పు తెస్తున్నాడు.

రంపచోడవరం: విశిష్టమైన జీవ వైవిధ్యానికి, విభిన్న జంతుజాతులకు నెలవు మన మన్యసీమ. పోలవరం జిల్లా విస్తీర్ణం 6,528.52 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 53,771.85 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నా­యి. ఇందులో పాపికొండలు నేషనల్‌ పార్కు 1,012.858 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో 2,531 జాతుల పుషి్పంచే మొక్కలు, అనేక రకాల వెదురు మొక్కలు, రకరకాల ఔషధ మొక్కలు, విలువైన వృక్షాలు ఉన్నా­యి. అలాగే, హైనా, చిరుతపులి, గొర్రగేదెలు, సాంబార్, మచ్చల జింక వంటి అనేక జంతుజాలాలకు ఈ వనసీమ నెలవు. 

నెమళ్లు, అడవి కోళ్ల వంటి 92 రకాల పక్షి జాతులున్నాయి. కింగ్‌ కోబ్రా వంటి అనేక రకాల సర్పాలున్నాయి. ఇంతటి జీవవైవిధ్యానికి నెలవైన పాపికొండలు ప్రాంతంలో జీవజాలాన్ని, వృక్షజాలాన్ని సంరక్షించేందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతాన్ని పాపికొండలు జాతీయ అభయారణ్యంగా 1972­లోనే ప్రభుత్వం ప్రకటించింది. 

అఖండ గోదావరి నదికి ఇరువైపులా కాకినాడ, ఏలూరు, పాల్వంచ, భద్రాచలం అటవీ డివిజన్ల పరిధిలో పాపికొండలు విస్తరించి ఉన్నాయి. అయితే, విలువైన వృక్షాలపై మనిషి వేటు వేయడం.. వన్యప్రాణులను విచ్చలవిడిగా వేటాడుతూండటంతో అభయారణ్యం కాస్తా ఆయా జీవరాశులకు ‘భయారణ్యం’గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. 

యథేచ్ఛగా గొర్ర గేదెల వేట 
పాపికొండల ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో గొర్ర గేదెలున్నాయి. వీటి మాంసానికి డిమాండ్‌ ఉండటంతో వాటిని విచ్చలవిడిగా వేటాడుతున్నారు. గతంలో దేవీపట్నం మండలం పోతవరం, మద్దిరాతిగూడెం, నేలకోట తదితర ప్రాంతాల్లో ఉచ్చుల్లో పడి పలు గొర్ర గేదెలు మృత్యువాత పడ్డాయి. 

గొర్ర గేదెలు గుంపులుగా తిరగడంతో వాటిని విల్లుతో వేటాడే అవకాశం ఉండదు. అందువలన వీటి వేటకు నాటు తుపాకులు వాడుతున్నారు. ఇక్కడ గొర్ర గేదెలు ఎక్కువగా ఉండటంతో వాటిని నల్లమల అడవులకు తరలించి, అక్కడ పెంచే అవకాశాలను ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన బృందం పరిశీలించింది. అయితే, వీటి బరువు ఎక్కువగా ఉండటంతో తీసుకువెళ్లడం క్లిష్టతరం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు.  

జనారణ్యంలోకి జింకలు 
అడవుల నుంచి జింకలు అనేకసార్లు సమీపంలోని జనారణ్యంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు అనేకం జరిగాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీ అధికారులు వాటికి చికిత్స అందించి, అడవుల్లో వదిలిపెడుతున్నారు. అయితే, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడమే ఆయా జంతువులు బయటకు రావడానికి ప్రధాన కారణమని పరిశీలకులు చెబుతున్నారు.  

కింగ్‌ కోబ్రాలు 
మన్యసీమలో కింగ్‌కోబ్రాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో, రంపచోడవరం, మోతుగూడెం, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో కింగ్‌క్రోబాలు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు హడలెత్తిపోయిన సందర్భాలున్నాయి. మోతుగూడెంలోనైతే కింగ్‌కోబ్రా ఏకంగా పీహెచ్‌సీలోకే ప్రవేశించింది. రంపచోడవరం మండలం పెద్దగెద్దాడలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన కింగ్‌క్రోబాను స్థానికుడే పట్టుకుని గోనె సంచిలో వేసి అడవిలో వదిలిపెట్టారు.  

చిరుతలు 
అడ్డతీగల మండలం ఎల్లవరం వద్ద పొలాల మధ్య కాలువ వద్దకు వెళ్తున్న ఓ చిరుత పులి 2023 నవంబర్‌ 30న కోతులకు పెట్టిన వలలో చిక్కుకుంది. ఆ వలను లాక్కుంటూ వెళ్లి, చెట్టు ఎక్కడంతో వేలాడుతూ రోజుంతా అక్కడే ఉండిపోయింది. తీవ్ర జాప్యం అనంతరం ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావడంతో అటవీ అధికారులు దానికి మత్తు మందు ఇచ్చి కిందకు దింపారు. ఆ తరువాత అది చనిపోయింది.  

అడవి పందులు 
రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో అడవి పందుల వేట విచ్చలవిడిగా సాగుతోంది. కరెంట్‌ ఉచ్చులు అమర్చి మరీ వాటిని కొంత మంది హతమార్చుతున్నారు. అడవి పందుల మాంసానికి కూడా మంచి డిమాండ్‌ ఉండటంతో వేటగాళ్లు వాటాలు వేసి మరీ విక్రయిస్తున్నారు. పొలాల్లోకి వస్తున్న అడవి పందులను ఒకవైపు తరుముకుంటూ వచ్చి వల అమర్చుతారు. ఆ వలలో చిక్కిన వాటిని కొట్టి చంపుతారు. కొంత మంది పందుల వేటకు విల్లుతో పాటు నాటు తుపాకులు కూడా ఉపయోగిస్తున్నారు.

పులి.. దారి తప్పి.. 
ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం వద్ద పట్టుకున్న పెద్దపులిని పాపికొండలు నేషనల్‌ పార్కు పరిధిలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. అయితే, ఆ పులి అక్కడి నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం మండలాలకు వచ్చి, పలు గ్రామాల్లో పశువులపై దాడి చేసి, హతమార్చింది. ప్రస్తుతం తాళ్లపాలెం, బోలగొండ అటవీ ప్రాంతంలోనే ఈ పులి ఉంది. 

ఈ పులి మైదాన ప్రాంతానికి రావడానికి అడవులు తగ్గిపోవడం కూడా ఓ కారణమని అంటున్నారు. పులులు సాధారణంగా తమ పరిధిని చాలా ఎక్కువగా విస్తరించుకుంటాయి. గతంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతం నుంచి కూడా పులులు పాపికొండలు అభయరణ్యంలోకి వచ్చేవి. అయితే, వేటతో వాటి సంఖ్య తగ్గిపోయింది. జాతీయ పక్షి నెమలి ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా కనిపించేది. వాటి సంతతి చాలా వరకూ తగ్గిపోయింది.

అవగాహన కల్పిస్తున్నాం 
జంతువుల ఆవశ్యకతపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. అడవులు, జంతువులు వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ చైతన్యం కల్పిస్తున్నాం. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించి, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంపొందిస్తున్నాం. – బి.కొండలరావు, అటవీ అధికారి, ఇందుకూరు రేంజ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement