బొబ్బిల్లంకలో మాజీ భార్య, అత్త హత్య | Ex wife and mother in law assassinated in Bobbillanka | Sakshi
Sakshi News home page

బొబ్బిల్లంకలో మాజీ భార్య, అత్త హత్య

Mar 4 2026 5:12 AM | Updated on Mar 4 2026 5:12 AM

Ex wife and mother in law assassinated in Bobbillanka

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో వదిలేశాడు

రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భార్యపై తగ్గని కోపం

వేరే ఊరు నుంచి తల్లి వద్దకు వచ్చిందని తెలుసుకుని ఘాతుకం

సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు  

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక సుబ్బారావుపేటలో మాజీ భార్య, అత్త దారుణ హత్య సంచలనం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుబ్బారావుపేటకు చెందిన సోడదాసి సీతారామరాజు (పండు), అదే వీధిలో ఉంటున్న లత (30)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీతారామరాజు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుండేవాడు. 

గతంలో పోక్సో కేసులో కొన్నాళ్లు రిమాండ్‌లో ఉన్నాడు. అతడి బెయిల్‌ కోసం లత ఫైనాన్స్‌ వ్యాపార లావాదేవీలు చూసుకునేది. బెయిల్‌పై వచి్చన సీతారామరాజు భార్య లతపై అనుమానం పెంచుకున్నాడు. ఒకసారి మద్యం మత్తులో ఆమెను తీవ్రంగా కొట్టాడు.  భర్తపై అప్పట్లో సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మనస్పర్థలు పెరగడంతో ఏడాదిన్నర కిందట విడిపోయారు. పిల్లలు ముగ్గురూ తండ్రి సీతారామరాజు వద్దే ఉంటున్నారు. 

రెండో పెళ్లి చేసుకున్న సీతారామరాజు 
సీతారామరాజు తన ఇంటి ఎదురుగా ఉంటున్న కుమారిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె గర్భిణి అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలోని తన చెల్లి, బంధువుల ఇంట్లో ఉంటున్న లత ఇటీవల బొబ్బిల్లంకలోని తల్లి గుమ్మడి లక్ష్మి (50) వద్దకు వచ్చింది. ఆమెను సీతారామరాజు గమనించాడు. తనను వదిలేసిన మొదటి భార్య లత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోందని, పిల్లల ఆలనా పాలనా తానే చూసుకోవాల్సి వస్తోందని, ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. 

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కత్తులు తీసుకుని ముగ్గురు స్నేహితులతో కలిసి మాజీ అత్త లక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు స్నేహితులు గేటు బయట ఉండగా, మరో స్నేహితుడు గుమ్మం వద్ద నిలబడ్డాడు. ఇంట్లోకి వెళ్లిన సీతారామరాజు నిద్రిస్తున్న తన మొదటి భార్య లత చేతులు, భుజాలు, మెడ, ముఖంపై కత్తితో నరికాడు. ఆమె భయంతో కేకలు వేసింది. అది గమనించిన అత్త లక్ష్మి గట్టిగా అరుస్తూ అతడికి అడ్డం వచ్చింది. ఆమెను కూడా సీతారామరాజు కత్తితో నరికి హతమార్చాడు. కత్తిని గోదావరిలోకి విసిరేసి, నేరుగా సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో 
లొంగిపోయాడు. 

పోలీసుల విచారణ.. 
సంఘటన స్థలాన్ని రాజమహేంద్రవరం నార్త్‌ జోన్‌ డీఎస్పీ శ్రీకాంత్, కోరుకొండ సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి మంగళవారం సందర్శించారు. నిందితుడు సీతారామరాజుకు నేర చరిత్ర ఉందని తెలిపారు. పన్నెండేళ్ల కిందట రోడ్డుపై ఓ వ్యక్తిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడని, అటువంటి వాడు బతకకూడదదని కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద రోదించారు. మృతదేహాలను పో­స్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యల్లో సీతారామరాజుకు సహకరించిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement