విజయవాడలోని ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీ కార్యకర్తను ఈడ్చేస్తున్న పోలీసులు
ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందు రోజు రాత్రి నమ్మబలికి అమానుషంగా అరెస్టులు చేయిస్తారా?
రెండేళ్లు అవుతున్నా.. అంగన్‌వాడీలకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయరా?
‘సుప్రీం’ తీర్పు మేరకు గ్రాట్యుటీ.. కనీస వేతనం పెంపు హామీలు ఏమయ్యాయి?
దీనిపై మేం ప్రశ్నించడమే నేరమా?
నాడు గుర్రాలతో తొక్కించారు.. నేడు పోలీసులతో ఈడ్చేశారు..
మీరు మారలేదని రుజువైంది బాబూ! పర్యవసానం అనుభవించక తప్పదు
అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరు.. డిమాండ్లు నెరవేరే దాకా పోరాటమే
చర్చలంటూ మంత్రులతో కబురుపెట్టి.. అక్రమ అరెస్టులు, నయవంచనపై భగ్గుమన్న అంగన్‌వాడీలు.. పోలీస్ స్టేషన్ల ఎదుట బైఠాయింపు
విజయవాడ ధర్నా చౌక్‌లో తెల్లవారుజామున రాక్షసకాండ..
రోడ్డుపై అంగన్‌వాడీలు నిద్రిస్తున్న టెంటుపై ఖాకీల మెరుపు దాడి
మగ పోలీసులతో ఈడ్చేసి వ్యాన్లలోకి తోసివేత.. అరెస్టు పలువురు మహిళలకు గాయాలు
2000 జూలై 26..
సమైక్యాంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో వేతనాలు పెంచాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్‌వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా గుర్రాలతో తొక్కించి, బాష్ప వాయువు ప్రయోగించి, అక్రమ అరెస్టులకు దిగింది.
2026 మార్చి 3..
విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడలో.. హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని శాంతియుతంగా నిరసన తెలిపి టెంటులో రోడ్డుపై నిద్రిస్తున్న అంగన్‌వాడీలపై చంద్రబాబు సర్కారు తెల్లవారుజామున విరుచుకుపడింది. పోలీసులతో ఈడ్చేసి అక్రమంగా అరెస్టులు చేసింది. మహిళల పట్ల చంద్రబాబు మార్కు దౌర్జన్యం, పాతికేళ్లుగా మారని బాబు తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనం!
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: నమ్మించి నయవంచన చేయడంలో తాను ఏమాత్రం మారలేదని సీఎం చంద్రబాబు అంగన్‌వాడీల విషయంలో రుజువు చేసుకున్నారు! 2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగన్‌వాడీలను కలిసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తానని టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు వేతనాలు పెంచుతారని, డిమాండ్లు పరిష్కరిస్తారని అంగన్‌వాడీలు ఆశ పడ్డారు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అంగన్‌వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపు లాంటి హామీలకు అతీగతీ లేదు.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్‌వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా అంగన్‌వాడీలు ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో వారిని మరోసారి మోసగించేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ రెండు రోజుల ముందు మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, బాలవీరాంజనేయులు తదితరులతో ప్రకటనలు గుప్పించారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు.
అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపని చంద్రబాబు మంత్రి అచ్చెన్నను రంగంలోకి దించి చర్చల పేరుతో మభ్య పెట్టారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ నాయకులకు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ప్రభుత్వం మంగళవారం రోజు చర్చలకు పిలుస్తుందని సమాచారం ఇచ్చినట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావించిన అంగన్‌వాడీలు రాత్రి ధర్నా టెంట్‌లోనే రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు.
అయితే నమ్మించి దగా చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు తెల్లవారుజామున పోలీసులను ప్రయోగించి అంగన్‌వాడీలను దౌర్జన్యంగా ఈడ్చేశారు! మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్‌వాడీ మహిళలను ఈడ్చి పారేసిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపించింది. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసిన పోలీసులు కిష్కింధకాండను తలపించారు!!
విజయవాడలో తెల్లవారుజామున అంగన్‌వాడీలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు
ఉద్యమంపై ఉక్కుపాదం..
దుర్వాసన వెదజల్లే డ్రైయిన్.. ముసురుకున్న దోమల నడుమ పట్టు వదలకుండా, నిరసన చేపట్టిన టెంట్‌లోనే.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన అంగన్‌వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. విజయవాడలో తెల్లవారుజామున అంగన్‌వాడీలు నిద్రిస్తున్న టెంట్లలోకి చొరబడిన వందలాది మంది పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అంగన్‌వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించే లోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్‌లలోకి ఎక్కించేశారు.
చుట్టూ రోప్ పార్టీ (తాడుతో వలయం) ఏర్పాటు చేసుకున్న పోలీసులు.. అంగన్‌వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా దిగ్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్‌ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్‌కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ వాపోయారు. 
అంగన్‌వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా ఏలూరులో భారీ ర్యాలీ చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
తాము చేసిన తప్పేమిటని సత్తెనపల్లి టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ఆక్రోశించారు. అరకొర వేతనాలు, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరడం మినహా ఏం నేరం చేశామని నిలదీశారు. పోలీసుల దాడిలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఎడమ చేయి విరిగిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్‌వాడీ మహిళలకు ఇచ్చిన గిఫ్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వేతనాలు పెంచి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు.
ఈడ్చేసిన మగ పోలీసులు..
టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో యాక్షన్‌లోకి దిగిన పోలీసులు కేవలం 30 నిమిషాల్లో నిరసన దీక్ష టెంట్‌ను కకావికలం చేసి అంగన్‌వాడీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మగ పోలీసులు అంగన్‌వాడీ మహిళలను ఇష్టానుసారంగా పట్టుకుని ఈడ్చేసి వ్యాన్‌ల్లోకి ఎక్కించారు. కనీసం మహిళల వ్యక్తిగత ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా గంటల తరబడి వ్యానుల్లోనే మగ్గిపోవడంతో నరక యాతన ఎదుర్కొన్నారు. విజయవాడ నుంచి పోలీస్ వ్యాన్‌ల్లో సుమారు 60 నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లోని మారుమూల చోట్లకు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్‌లలో నిర్బంధించి చంద్రబాబు మార్కు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు.
నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
భగ్గుమన్న మహిళలు..
చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శాంతియుతంగా నిరసన తెలిపిన అంగన్‌వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున చంద్రబాబు సర్కారు అక్రమ అరెస్టులకు దిగడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. అన్ని జిల్లాల్లో రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన అంగన్‌వాడీలను తరలించిన సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున బైఠాయించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో అరెస్టు చేసిన కార్యకర్తలను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, చాట్రాయి లాంటి మారుమూల ప్రాంతాలకు తరలించగా స్థానిక అంగన్‌వాడీలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అణచివేత విధానాలను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో అంగన్‌వాడీలు నల్ల బ్యాడీ్జలతో నిరసన తెలిపారు.
కర్నూలులో కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న అంగన్‌వాడీలు
బాబు మారలేదు..
అంగన్‌వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులతో కబురు పంపించిన చంద్రబాబు మరోవైపు పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయడం పట్ల సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ యూనియన్ల రాష్ట్ర కీలక నేతలు కె.సుబ్బరావమ్మ, జె.లలిత, వీఆర్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మారాడనుకున్నామని, అయితే ఆయన ఏమాత్రం మారలేదని రుజువైందన్నారు. దీనికి పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని, జిల్లాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగించాలని అంగన్‌వాడీలకు పిలుపునిచ్చారు. పోలీసుల లాఠీలు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు మూడు యూనియన్ల నేతలు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు.
‘సాక్షి’ కెమెరా లాక్కున్న పోలీసులు
చంద్రబాబు సర్కారు ఆదేశాలతో స్వామి భక్తి ప్రదర్శించిన పోలీసులు రెచ్చిపోయి అంగన్‌వాడీ మహిళలను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఎవరూ చిత్రీకరించకుండా జాగ్రత్త పడ్డారు. అంగన్‌వాడీల వద్ద సెల్‌ఫోన్‌లు లాక్కున్నారు. పోలీసుల దమనకాండను చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ కెమెరామెన్‌ను దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించి కెమెరా గుంజుకున్నారు.


