పండుగ వేళ విషాదం | 8 people died in different areas after falling into the water | Sakshi
Sakshi News home page

పండుగ వేళ విషాదం

Mar 4 2026 4:28 AM | Updated on Mar 4 2026 4:28 AM

8 people died in different areas after falling into the water

నీళ్లలోకి దిగి వేర్వేరు ప్రాంతాల్లో 8 మంది మృతి 

సాగర్‌ ఎడమ కాల్వలో ఇద్దరు బాలుర గల్లంతు 

శోకసంద్రంలో కుటుంబసభ్యులు 

సుభాష్నగర్‌/బోధన్‌/ఆర్మూర్‌టౌన్‌/హాలియా: హోలీ వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. హోలీ సంబరాలను ముగించుకొని నది/చెరువులోకి స్నానాలకని వెళ్లిన వారు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. విగత జీవులైన పిల్లలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.  

సూరారంలో... 
పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన సాగర్, అజయ్, ఛత్రపతి, కృష్ణనగర్‌కు చెందిన అభిషేక్, శ్రీరామ్‌నగర్‌కు చెందిన విగ్నేష్‌ స్నేహితులు. వీరు బహదూర్‌పల్లిలోని తాము చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విశ్వకర్మ కాలనీని ఆనుకొని ఉన్న రామన్‌ చెరువులో స్నానానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. 

అజయ్, విగ్నేష్, ఛత్రపతి.. షాపులో షాంపూలు కొనితెస్తామని చెప్పగా.. సాగర్, అభిషేక్‌ చెరువు వద్దకు వెళ్లి లోపలికి దిగారు. అంతలోనే మిగతా ముగ్గురు స్నేహితులు అక్కడికి రాగా ఆ ఇద్దరు చెరువులో మునిగిపోతూ చేతులు ఊపారు. దీంతో బయట ఉన్న ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నీళ్లలోకి దిగారు.

 అయితే, అక్కడ లోతుగా ఉండటంతో సాగర్, అభిషేక్‌ మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెదక్‌ జిల్లా హవేలీ గణపురం మండలం తొగుట గ్రామానికి చెందిన ఏసు, జ్యోతిల కుమారుడు అభిషేక్‌. విశ్వకర్మ కాలనీకి చెందిన సంతోష్‌ కుమార్, రేఖ దంపతుల చిన్న కుమారుడు సాగర్‌. 

మంజీరలో మునిగి... 
స్నేహితులతో హోలీ సంబరాలు జరుపుకుని మంజీరనదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని ఒకటో వార్డు పరిధిలోని ఆచన్‌పల్లికి చెందిన సాయికుమార్‌ (20), రోని చౌదరి (18) మంగళవారం సాలూర సమీపంలోని మంజీర నదికి వెళ్లారు. స్నానాలు చేస్తూ నీటిలో గల్లంతై మృతి చెందారు. 

సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు నదికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. సాయికుమార్‌ ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రోని చౌదరి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.  

ఆర్మూర్‌లో విషాదం : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో స్థానిక గోల్‌ బంగ్లా ప్రాంతానికి చెందిన బోగడ నరేష్‌ పెద్ద కుమారుడు హర్షిత్‌ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హర్షిత్‌ మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. అనంతరం గుండ్ల చెరువు వద్ద ఉన్న ట్యాంక్‌బండ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో హర్షిత్‌ నీటిలో మునిగిపోయి మరణించాడు.  

సాగర్‌ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు 
నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్‌(14), అదే మండలం శాఖాపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని స్నేహితులు. వీరు హాలియాలో నివాసముంటున్నారు. బబ్లూచారి బైక్‌ వాషింగ్‌ సెంటర్‌లో పనిచేస్తుండగా.. కార్తీక్‌ 9వ తరగతి చదువుతున్నాడు. నాని ఆటోలకు రెగ్జిన్‌ పనిచేస్తున్నాడు. 

ముగ్గురు కలిసి బిర్యానీ పార్సిల్‌తో మంగళవారం సాయంత్రం హాలియాలోని అక్విడెక్ట్‌ వద్దకు వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం కార్తీక్‌ చేతులు కడుక్కోవడానికి సాగర్‌ ఎడమ కాల్వలోకి దిగుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. కార్తీక్‌ను రక్షించేందుకు బబ్లూచారి కాల్వలోకి దిగుతుండగా.. అతడు కూడా కాలుజారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నాని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిగా ఉండటంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు.  

ఏపీలో... 
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిగలో ముగ్గురు స్నేహితులు చెరువులోకి దిగి మృతిచెందారు. బోళ్ల సాయి (15), ముచ్చు వెంకట జోసఫ్‌ (15), దుప్పుల వినయ్‌కుమార్‌(12) హోలీ పండుగ జరుపుకొని అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. కాలుజారి సాయి, వెంకట జోసఫ్, వినయ్‌కుమార్‌ చెరువులో పడి మృతిచెందారు. వీరు గొల్లనపల్లి జెడ్పీ హైసూ్కల్‌లో చదువుతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement