5న వాదనలు ముగించండి | High Court order on petitions against Justice Ghosh Commission on Kaleswaram | Sakshi
Sakshi News home page

5న వాదనలు ముగించండి

Mar 4 2026 4:23 AM | Updated on Mar 4 2026 4:23 AM

High Court order on petitions against Justice Ghosh Commission on Kaleswaram

‘కాళేశ్వరం’పై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై పిటిషన్లలో హైకోర్టు ఆదేశం

ప్రజాప్రయోజనాలు కాపాడేందుకే కమిషన్‌ ఏర్పాటు: ఏజీ

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నివేదికను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో గురువారం (5న) వాదనలు ముగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులైన ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు.. తర్వాత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు సమర్పించాలని స్పష్టం చేసింది. రోజుల తరబడి వాదనలు వినడం సరికాదని, క్లుప్తంగా వాదనలు ముగించాలని సూచించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. 

అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు పొడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్‌ ఘోష్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్‌ శైలేంద్ర కుమార్‌ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

కమిషన్‌ను తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది
‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ,, కేంద్ర జల కమిషన్‌ వంటి సంస్థల నుంచి అందిన పత్రాల ఆధారంగా మాత్రమే సమగ్ర నివేదికను సమర్పించింది. ఎవరినీ నిర్బంధించడానికి ఎవరిపైనా ఎటువంటి ఆధారాలు తీసుకోలేదు. ప్రజా ప్రయోజనాలు కాపాడే విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం సర్కార్‌కు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సహా ఇతర ఏ ప్రాజెక్టుపైనైనా విచారణ కమిషన్‌ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. 

కమిషన్‌ ఏర్పాటును తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది. చట్టప్రకారం ఇచ్చిన అధికారం మేరకే కమిషన్‌ విధులు నిర్వహించి నివేదిక అందజేసింది. కేబినెట్‌ సబ్‌కమిటీ ఆమోదం లేకుండా నాటి సీఎం, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి సంతకాలతో రూ.వేల కోట్లు విడుదల చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం’ అని ఏజీ చెప్పారు. ‘రూ.1.47 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మించే కాళేశ్వరం గిట్టుబాటు కాదని కాగ్‌ ఆక్షేపించింది. 

ఎకరాకు రూ.6.42 లక్షల పెట్టుబడి పెట్టింది. ఎత్తిపోతలకు విద్యుత్‌ వినియోగంతో రాష్ట్రంపై అదనపు భారం పడుతోంది. అంత మొత్తం పెట్టుబడికి తగిన ఆదాయం వ్యవసాయం నుంచి రావడం లేదు’ అంటూ పీవీ జగన్నాథ్‌రావు వర్సెస్‌ ఒడిశా, ఏలేరు కమిషన్‌లో సుప్రీంకోర్టు తీర్పులను ఏజీ ప్రస్తావించారు.

Advertisement
 
Advertisement
Advertisement