భూ దాహం తీరనిది! | Chandrababu govt says it may take hundred years to build Amaravati capital | Sakshi
Sakshi News home page

భూ దాహం తీరనిది!

Mar 4 2026 5:31 AM | Updated on Mar 4 2026 5:31 AM

Chandrababu govt says it may take hundred years to build Amaravati capital

53వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్లు పట్టొచ్చని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట సర్కార్‌ వెల్లడి

రెండో దశలో 50 గ్రామాల్లో 1,75,347.43 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు టెండర్‌ 

నేడు సాంకేతిక, రేపు ఆర్థిక బిడ్‌ను తెరిచి అర్హత సాధించిన కన్సల్టెన్సీకి ప్లాన్‌ తయారీ బాధ్యత అప్పగింత

53 వేల ఎకరాల రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరమని ప్రభుత్వం వెల్లడి

ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో మౌలిక వసతులకు రూ.3.50 లక్షల కోట్లకుపైగా అవసరం అంటున్న నిపుణులు

గ్రేటర్‌ హైదరాబాద్‌ 650, గ్రేటర్‌ చెన్నై 438, బృహత్‌ బెంగళూరు 741, గ్రేటర్‌ ముంబై విస్తరించింది 

603.4 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఈ రాజధానులన్నీ వాటంతట అవే ఎదిగినవని.. వాటిని ఎవరూ నిర్మించలేదంటున్న సిటీ ప్లానర్లు

వాటిని మించి తొలి, రెండో దశలో మొత్తం 926.8 చ.కి పరిధిలో రాజధాని నిర్మాణానికి చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం

ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,348 కోట్లకుపైగా అప్పు

సర్కారు ఆలోచన మేరకు ఇంకా రూ.లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి

ఈ రుణాలన్నీ రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆర్థిక నిపుణుల ఆందోళన 

సాక్షి, అమరావతి: ఇప్పటికే 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347.43 ఎకరాల్లో (709.57 చదరపు కిలోమీటర్లు) రాజధానిని విస్తరించడానికి ‘మాస్టర్‌ ప్లాన్‌’ రూపకల్పనకు ఫిబ్రవరి 16న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్‌లో బిడ్‌ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. అదే రోజున సాంకేతిక, గురువారం ఆర్థిక బిడ్‌ను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి మాస్టర్‌ ప్లాన్‌ తయారీ బాధ్యతలు అప్పగించనుంది. తొలి దశ, రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. 

ఇటీవల బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహా నగరాలైన గ్రేటర్‌ హైదరాబాద్‌ 650 కి.మీ, గ్రేటర్‌ చెన్నై 438, బృహత్‌ బెంగళూరు 741, గ్రేటర్‌ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. 

ఆ మహా నగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,438 కోట్లు అప్పు తెచ్చారని.. నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.లక్షల కోట్ల అప్పు తేవాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095.43 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.    

11 ఏళ్లుగా ప్రాథమిక దశను దాటని రాజధాని 
రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. 

⇒ ఇందులో ప్రభుత్వ, అటవీ భూమి పోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్‌ సమర్పించారు. 

⇒ కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా, శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్‌జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని, ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్‌కు అప్పట్లో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. 

⇒ 2024 జూన్‌ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్‌డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు.

పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం 
⇒ రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్‌లు పంపింది. గతేడాది ఏప్రిల్‌ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

⇒ ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 

⇒ ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్ల అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తొలి విడతకు మూడింతలు.. 
⇒ రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాలిటీగా మిగిలి పోతుందని, భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ రావాలని.. అందుకోసం రెండో విడత భూ సమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు.. వెరసి ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూ సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

⇒ వాటితోపాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడానికి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

⇒ ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూ సమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు.. తూర్పున చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతంలో రాజధాని విస్తరణకు మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 

⇒ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు 6 నెలలు గడువుగా నిర్దేశించింది. తొలుత భూ సమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల్లో వివరణాత్మక ప్రణాళిక.. ఆ తర్వాత మిగిలిన 43 గ్రామాల్లో రాజధాని విస్తరణకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని నిర్దేశించింది. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్‌ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం.. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించగా సీఆర్‌డీఏకు మిగిలే భూమిని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్‌ డెవలప్‌మెంట్‌ వంటి నమునాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ వంటి మార్గాలను అన్వేషిస్తూ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని నిర్దేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement