capital land scam
-
భూ దాహం తీరనిది!
సాక్షి, అమరావతి: ఇప్పటికే 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347.43 ఎకరాల్లో (709.57 చదరపు కిలోమీటర్లు) రాజధానిని విస్తరించడానికి ‘మాస్టర్ ప్లాన్’ రూపకల్పనకు ఫిబ్రవరి 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. అదే రోజున సాంకేతిక, గురువారం ఆర్థిక బిడ్‌ను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలు అప్పగించనుంది. తొలి దశ, రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహా నగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కి.మీ, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహా నగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,438 కోట్లు అప్పు తెచ్చారని.. నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.లక్షల కోట్ల అప్పు తేవాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095.43 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 11 ఏళ్లుగా ప్రాథమిక దశను దాటని రాజధాని ⇒ రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ⇒ ఇందులో ప్రభుత్వ, అటవీ భూమి పోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్ సమర్పించారు. ⇒ కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా, శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని, ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్‌కు అప్పట్లో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ⇒ 2024 జూన్ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం ⇒ రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్‌లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.⇒ ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ⇒ ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్ల అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తొలి విడతకు మూడింతలు.. ⇒ రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాలిటీగా మిగిలి పోతుందని, భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూ సమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు.. వెరసి ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ⇒ వాటితోపాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ⇒ ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూ సమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన అవుటర్ రింగ్ రోడ్డు వరకు.. తూర్పున చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతంలో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ⇒ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు గడువుగా నిర్దేశించింది. తొలుత భూ సమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల్లో వివరణాత్మక ప్రణాళిక.. ఆ తర్వాత మిగిలిన 43 గ్రామాల్లో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం.. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించగా సీఆర్డీఏకు మిగిలే భూమిని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమునాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ వంటి మార్గాలను అన్వేషిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. -
రైతుల ముసుగులో నకిలీలు
-
ఇన్సైడర్ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద'
సాక్షి, అమరావతి : రాజధాని భూకుంభకోణంలో తీగలాగితే చంద్రబాబు బృందం డొంక కదులుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) కూడా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రూ.400 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ, కాంట్రాక్టు సంస్థ నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ పేరుతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భారీగా భూములు కొన్నారు. విజయవాడకు అత్యంత సమీపంలో.. వెలగపూడి సచివాలయానికి కూతవేటు దూరంలో ఉండవల్లిలో 11.34 ఎకరాల భూమి కొనుగోలు చేయడాన్ని దర్యాప్తు సంస్థ సీఐడీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువే రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజధాని గ్రామాల్లోనూ.. సీఆర్డీఏ పరిధిలోనూ భారీగా భూముల కొనుగోలులో వరదాపురం సూరి మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన సీఐడీ.. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీకి అందజేసింది. దీంతో ఈ రెండు సంస్థలు సీఐడీకి సమాంతరంగా విచారణ చేపట్టనున్నాయి. బాబు హయాంలో కేసులు నిర్వీర్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన సూరి 2014 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్వారీల్లో అక్రమ మైనింగ్.. నాసిరకంగా పనులు చేసినందుకు నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2014కు ముందే పలు కేసులు నమోదు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులను నిర్వీర్యం చేయించుకున్న సూరి.. ఆ తర్వాత చంద్రబాబు బృందంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం తెలుసుకున్న ఆయన.. తాడేపల్లి మండలం ఉండవల్లిలో సర్వే నంబర్లు 144–2ఏ2, 144–2ఏ3, 149–బీ2, 149–బీ3, 151–2ఏ, 195–ఏ, 196–సీ1ఏ1ఏ, 199–3, 207–3, 207–5ఏలలో తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ పేరుతో 5.6725 ఎకరాలు, సర్వే నంబర్లు 140–1బీ, 180–1బీ1, 184–ఏ2/3, 196బీ3బీ, 200–ఏ1, 206–1ఏలలో 5.67 ఎకరాలు మొత్తం 11.34 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదే రీతిలో సీఆర్డీఏ పరిధిలోని పలు మండలాల్లోనూ 56 ఎకరాలకు పైగా భూమిని కొన్నారు. వీటి విలువ రూ. 400 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో.. సూరి కుటుంబ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన సీఐడీ.. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, మనీల్యాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఐటీ, ఈడీలకు నివేదిక అందజేసింది. కాగా, 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు ఆదేశాల మేరకు తనను తాను రక్షించుకోవడానికి బీజేపీ గూటికి చేరారు. -
అమరావతి బకాసురులు
-
‘పారిపోయి అమరావతికి వచ్చిన చంద్రబాబు’
సాక్షి, అమరావతి : తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను బెదిరించి ప్రభుత్వం కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను తిరిగి వారికి ఇస్తామని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రాజధాని లంక అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ, వైఎస్సార్ సీపీ నాయకుల బృందం గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మాణం పేరిట రైతులను బెదిరించి వారి నుంచి బలవంతంగా పచ్చని పొలాలను, అసైన్డ్ భూములను లాక్కున్నారని విమర్శించారు. చంద్రబాబు లాంటివాడు ఉంటాడనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారన్న ఆర్కే... రాజధాని పేరుతో అరాచకం చేసిన అధికారుల్ని సైతం వదలమని హెచ్చరించారు. దళితుల పట్ల వివక్ష: నందిగం సురేష్ రాజధానిలో ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోందని రాజధాని లంక అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ నందిగం సురేష్ ఆరోపించారు. పట్టా భూములు ఒక ప్యాకేజీ, దళితులు సాగుచేస్తున్న అసైన్డ్ భూములకు మరొక ప్యాకేజీ ఇవ్వటం దారుణమన్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంపై వెంటనే విచారణ చేయాలని, చట్టప్రకారం అసైన్డ్ భూములు రైతులు కూడా సమాన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంజాయ్మెంట్ సర్వే చేయని పొలాలను వెంటనే సర్వే చేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.రాజధానిలో రైతులు రైతు కూలీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు మేరుగుల నాగార్జున మాట్లాడుతూ... దళితులు పండించుకునే భూములను తీసుకోవడానికి ప్రభుత్వానికి అర్హత లేదని పేర్కొన్నారు. రాజధానిలో పట్టా భూములకు ఇచ్చే ప్యాకేజీ.. అసైన్డ్ భూముల రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు రాష్ట్రవ్యాప్తంగా దళితులపై పెరిగిపోతున్నాయన్న నాగార్జున.. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో దళితులే బుద్ది చెప్తారన్నారు. దళితుల అభివృద్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. దళితులను మోసం చేసే జూపూడి ప్రభాకర్, కారెం శివాజీ లాంటి వాళ్ల పట్ల దళితులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబు దళిత ద్రోహి: కిలారి రోశయ్య పట్టా భూములు ఉన్న రైతులకు ఒక ప్యాకేజీ దళితులకు మరొక ప్యాకేజీ ఇవ్వడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిలారి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తామంతా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుని ప్రజలంతా తొందర్లోనే ఇంటికి పంపుతారని వ్యాఖ్యానించారు. -
సభలో సమరమే!
♦ నేటి నుంచి శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ♦ రాజధాని భూ కుంభకోణం, ప్రజా సమస్యలు, ♦ ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రస్తావించనున్న ప్రతిపక్షం ♦ 18 రోజులపాటు కొనసాగనున్న అసెంబ్లీ ♦ 10న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి యనమల ♦ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి ప్రత్తిపాటి ♦ స్పీకర్, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్న వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. 18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవ సాయ బడ్జెట్‌ను ఇదే సమావేశాల్లో ప్రవేశపెడతారు. బీఏసీ సమావేశం శనివారం జరగనుంది. భూకుంభకోణంపై ప్రతిపక్షం గురి రాజధాని భూముల దురాక్రమణ అంశంతోపాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సన్నద్ధమైంది. సమస్యలను పరిష్కరించలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఏ అంశం కూడా చర్చకు రాకుండా ఉండాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన రాజధాని భూముల దురాక్రమణ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పడేసింది. ఈ అంశం ఉభయ సభలను కుదిపేసే అవకాశం ఉంది. ప్రతిపక్షం ఇదే అంశాన్ని సభలో ప్రధానంగా ప్రస్తావించనుంది. భూకుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేయనుంది. ధరల పెరుగుదల, అవినీతి తునిలో కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసం, అనంతరం అమాయకులపై కేసుల నమోదు, కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరిస్తున్న తీరు, రాష్ర్టంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం, నిధులు రాబట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, తాగునీటి సమస్య, వ్యవసాయ రంగంలో సంక్షోభం, పార్టీ ఫిరాయింపులను ప్రభుత్వం ప్రోత్సహించడం, ఒక్కో ఎమ్మెల్యేను రూ.40 కోట్లతో కొనుగోలు చేయడం, అంగన్వాడీ కార్మికుల తొలగింపు, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పడకేయడం, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి వంటి కీలక అంశాలను సభలో ప్రస్తావించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ప్రతిపక్ష సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేద్దాం ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై సభలో చర్చ జరిగే తమకు ఇబ్బందులు తప్పవని అధికార పక్షం ఆందోళన చెందుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి సభను పక్కదారి పట్టించి పబ్బం గడుపుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే అంశాన్ని నేతలకు స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతోపాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. శాసనసభ, శాసన మండలి సభా వ్యవహారాల సలహా కమిటీలు గవర్నర్ ప్రసంగం తరువాత సమావేశమై సభలో చర్చకు పెట్టాల్సిన అంశాలను ఖరారు చేయనున్నాయి. ప్రజా సమస్యలపై శాసనసభలో చర్చ జరిగేందుకు అందరూ సహకరించాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు కోరారు.


