‘పారిపోయి అమరావతికి వచ్చిన చంద్రబాబు’

Alla Ramakrishna Reddy Fires On AP Govt Over Capital Area Land Acquisition - Sakshi

సాక్షి, అమరావతి : తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను బెదిరించి ప్రభుత్వం కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను తిరిగి వారికి ఇస్తామని వైస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రాజధాని లంక అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ, వైఎస్సార్‌ సీపీ నాయకుల బృందం గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మాణం పేరిట రైతులను బెదిరించి వారి నుంచి బలవంతంగా పచ్చని పొలాలను, అసైన్డ్‌ భూములను లాక్కున్నారని విమర్శించారు. చంద్రబాబు లాంటివాడు ఉంటాడనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారన్న ఆర్కే... రాజధాని పేరుతో అరాచకం చేసిన అధికారుల్ని సైతం వదలమని హెచ్చరించారు.

దళితుల పట్ల వివక్ష: నందిగం సురేష్‌
రాజధానిలో ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోందని రాజధాని లంక అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ నందిగం సురేష్ ఆరోపించారు. పట్టా భూములు ఒక ప్యాకేజీ, దళితులు సాగుచేస్తున్న అసైన్డ్ భూములకు మరొక ప్యాకేజీ ఇవ్వటం దారుణమన్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంపై వెంటనే విచారణ చేయాలని, చట్టప్రకారం అసైన్డ్ భూములు రైతులు కూడా సమాన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంజాయ్‌మెంట్ సర్వే చేయని పొలాలను వెంటనే సర్వే చేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.రాజధానిలో రైతులు రైతు కూలీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులు మేరుగుల నాగార్జున మాట్లాడుతూ... దళితులు పండించుకునే భూములను తీసుకోవడానికి ప్రభుత్వానికి అర్హత లేదని పేర్కొన్నారు. రాజధానిలో పట్టా భూములకు ఇచ్చే ప్యాకేజీ.. అసైన్డ్ భూముల రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రోజురోజుకు రాష్ట్రవ్యాప్తంగా దళితులపై పెరిగిపోతున్నాయన్న నాగార్జున.. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో దళితులే బుద్ది చెప్తారన్నారు. దళితుల అభివృద్ధి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితోనే ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. దళితులను మోసం చేసే జూపూడి ప్రభాకర్‌, కారెం శివాజీ లాంటి వాళ్ల పట్ల దళితులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు దళిత ద్రోహి: కిలారి రోశయ్య
పట్టా భూములు ఉన్న రైతులకు ఒక ప్యాకేజీ దళితులకు మరొక ప్యాకేజీ ఇవ్వడం దారుణమని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిలారి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తామంతా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుని ప్రజలంతా తొందర్లోనే ఇంటికి పంపుతారని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top