నాడు దుష్ప్రచారం.. నేడు క్రెడిట్‌ చోరీ | YS Jagan Fires On Chandrababu In Press Meet | Sakshi
Sakshi News home page

నాడు దుష్ప్రచారం.. నేడు క్రెడిట్‌ చోరీ

Jan 23 2026 5:17 AM | Updated on Jan 23 2026 5:18 AM

YS Jagan Fires On Chandrababu In Press Meet

సమగ్ర భూ రీ సర్వే మహా యజ్ఞం

సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌  

ఏనాడైనా భూ రీసర్వే గురించి ఆలోచించావా? 

మేం చేసిన మహా యజ్ఞం క్రెడిట్‌ను నిస్సిగ్గుగా కొట్టేస్తావా? 

ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు 

భూ మండలంపై ఇంతటి క్రెడిట్‌ చోరుడు ఇంకొకరు ఉండరు 

రీసర్వే కోసం 15 వేల గ్రామ సచివాలయాలు, 40 వేల మంది 

ఉద్యోగులతో మేం చేసిన ప్రతీ ప్రయత్నం ఓ రికార్డు 

సర్వే ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం.. కోట్ల సంఖ్యలో రాళ్లు.. 

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అత్యాధునిక పరిజ్ఞానం 

దేశంలో 100 ఏళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం ఈ సర్వే

రెండు విమానాలు, నాలుగు హెలికాప్టర్‌లు, 200కు పైగా హైఎండ్‌ డ్రోన్స్‌ 

అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఫీచర్స్, క్యూఆర్‌ కోడ్‌తో పట్టాదారు పాస్‌ పుస్తకాలు 

అందుబాటులోకి 1,358 మంది మండల మొబైల్‌ మెజిస్ట్రేట్‌లు 

ఆటోమేటిక్‌ సబ్‌ డివిజన్, ప్రోటోకాల్‌ మ్యుటేషన్‌ జరిగేలా చర్యలు 

సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం.. ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో సర్వే పూర్తి 

కేంద్రం, నీతి ఆయోగ్, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు.. ఇలాంటి రీసర్వేపై భూములు, ఆస్తులు కబ్జా చేస్తున్నారని బాబు నాడు దుష్ప్రచారం 

కేంద్రం రూ.400 కోట్లు ప్రకటించగానే క్రెడిట్‌ కొట్టేయడానికి నానా పాట్లు   

మేమిచ్చిన పాస్‌బుక్‌లు వెనక్కి తీసుకొని.. రంగు మార్చి ఇవ్వడం దారుణం

సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన మా నాన్నకు సమకాలికుడు. ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నారు. నేను చేసిన దానిపై క్రెడిట్‌ కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు ఒక అబద్ధాన్ని ఈ స్థాయిలో గోబెల్స్‌ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? చంద్రబాబు ఒకసారి తన గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని కోరుతున్నా.  

రీ సర్వే ప్రక్రియ చేపట్టడానికి అత్యున్నత కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్‌ ఇండియాతో 2020 డిసెంబర్‌ 9న ఒప్పందం చేసుకున్నాం. యూరప్, అమెరికాలో వాడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీ సర్వేలో వినియోగించాం. రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా సీవోఆర్‌ఎస్‌లు (కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రెఫరెన్స్‌ స్టేషన్స్‌) పెట్టాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి 3,640 గ్లోబల్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ రిసీవర్స్‌ అందుబాటులోకి తెచ్చాం. కచ్చితత్వం కోసం గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌)ను వాడిన ప్రభుత్వం మాది.

సమగ్ర రీ సర్వే కోసం రెండు విమానాలు, నాలుగు హెలికాప్టర్‌లు, 200కు పైగా హైఎండ్‌ డ్రోన్స్‌ను తొలిసారిగా వినియోగించాం. దీని మీద అవగాహన కోసం సచివాల­యాల్లోని 40 వేల మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇదెప్పుడూ గతంలో జరగలేదు. ఇంత గొప్ప యజ్ఞం చేశాము కాబట్టే 5 సెంటీమీటర్లు కూడా తేడా లేకుండా కొలతలు వేశాం. అందుకే దీన్ని మహా యజ్ఞం అంటున్నాం.

చంద్రబాబు అనే వ్యక్తికి చిత్తశుద్ధి, బాధ్యత ఉండదు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్‌ కొట్టేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. సాధారణంగా ఆయనకు అవగాహన తక్కువ. సర్వే మీద కూడా అవగాహన తక్కువే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఇలాంటి సర్వే చేయాలని తపన, తాపత్రయ పడలేదు. సర్వే రాళ్లు లేకుండా సర్వే ఎలా పూర్తవుతుంది? కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించారని బుద్ధి, అవగాహన, జ్ఞానం లేకుండా మాట్లాడారు.     

రైతు, భూ యజమానికి సరిహద్దులు తెలిసేలా రాళ్లను పాతితేనే సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే అయినట్టు ప్రత్యేక (డిస్టింక్ట్‌) రాయి ఉండాలి. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. ఇదే సర్వే రాయి అంటే సరిహద్దులు ఎలా ఉంటాయి? అలా చేస్తే కథ మళ్లీ మొదటికి రాదా? అందుకే ప్రత్యేక (డిస్టింక్ట్‌)  తరహాలో సర్వే రాళ్లను ఉచితంగా ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు ృ భూ రక్ష పేరు పెట్టాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 1923లో బ్రిటీష్‌ వాళ్లు పెట్టిన రాళ్లు కనిపిస్తాయి. (బ్రిటీష్‌ హయాంలో పెట్టిన సర్వే రాళ్లు చూపించారు) చంద్రబాబు ఏమో రాళ్లెందుకు అంటాడు.
 
మేం సంకల్పంతో పని చేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలు రైతులు, భూ యజమానులకు అందకూడదని, జగన్‌కు మంచి పేరు వస్తుందని రాక్షసులకన్నా దారుణంగా చంద్రబాబు, ఆయన ఎల్లో గ్యాంగ్‌ వ్యవహరించారు. యజ్ఞం భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాన రాక్షసుడు.. ఆయన లెఫ్ట్, రైట్‌లో ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి పిల్ల రాక్షసుల పాత్ర పోషించారు. మీ భూమి మీది కాదు.. కాళ్ల కింది నేల కదిలిపోతోంది! అంటూ అబద్ధాలు, వక్రీకరణలు చేశారు. 2024 మే 13న పోలింగ్‌ అయితే మే 10వ తేదీన ఈనాడులో ‘మీ భూమి మీకు కాకుండా పోతుంది’ అంటూ ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు.  

కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీలోని గుర్గావ్‌ నుంచి లక్షలాదిగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేయించారు. వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుందని విషపూరిత, తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ చర్యలతో చంద్రబాబు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొంది ఉండొచ్చు. కానీ, అబద్ధాలు ఎంతో కాలం దాగవు. నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. భూముల సర్వే విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులు, రైతులకు జరిగే మేలు భూములు ఉన్నంత వరకూ నిలిచిపోతాయి.  

రీ సర్వేలో ఏపీ ప్లాటినమ్‌ గ్రేడింగ్‌ సాధించిందని డిసెంబర్‌ 2023లో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రూ.400 కోట్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా? 2025 ఫిబ్రవరి 19న వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనికి కేంద్రం ఈ డబ్బులు ఇచ్చిందని క్రెడిట్‌ చోరీకి పాట్లు పడుతున్నారు. మాకు నాలుగేళ్లు సమయం పడితే.. చంద్రబాబు ఆరు నెలల్లో చేసిన పనికి ప్లాటినమ్‌ గ్రేడింగ్‌ ఇచ్చారట! మరి ఎన్నికల ముందు వరకు ఆయన చేసిన ఆరోపణలు ఏమైపోవాలి?   
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌     

సాక్షి, అమరావతి: మహోన్నత సంకల్పంతో మేం సమగ్ర భూ రీసర్వే మహా యజ్ఞాన్ని చేపడితే వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాక్షసుడిలా విషం చిమ్మి.. ఇప్పుడు ఆ రీసర్వే నీ ఘనతే అంటూ క్రెడిట్‌ చోరీకి పాల్పడతావా? అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భూ మండలంలో అత్యంత దారుణంగా క్రెడిట్‌ చోరీకి పాల్పడే వారు నిన్ను మించి ఎవరైనా ఉంటారా.. నిన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర భూ రీ సర్వేపై చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వెనుక దాగిన నిజాలను సాక్ష్యాధారాలతో వివరించారు. 

‘‘జగనన్న భూ హక్కు – భూరక్ష’’ పథకం అమలు తీరును ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్‌ గ్రేడింగ్‌ ఇవ్వడాన్ని.. ఈ సర్వే దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందంటూ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.వి.సింగ్‌ స్పష్టం చేయడాన్ని, వివిధ రాష్ట్రాలు భూ సర్వేను ప్రశంసిస్తూ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఉద్ఘాటించడాన్ని, నీతి ఆయోగ్‌ అత్యంత పారదర్శకంగా కచ్చితత్వంతో భూ రీ సర్వే చేశారంటూ కితాబు ఇచ్చిన అంశాలను సాక్ష్యాధారాలతో గుర్తు చేశారు. అప్పట్లో ఈ మహాయజ్ఞంపై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు చిమ్మిన విషాన్ని.. నాడు చేసిన భూసర్వేను ప్రశంసిస్తూ కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే అది తన ఘనతేనని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

ఏనాడైనా రీసర్వే ఆలోచనైనా చేశావా? 
ఈ మధ్య కాలంలో భూముల రీ సర్వేపై చంద్రబాబు మాటలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రీ సర్వే క్రెడిట్‌ అంతా తనదేనంటూ చెబుతున్న మాటలు వింటుంటే.. ఈ భూ మండలం మీద ఇంత దారుణంగా క్రెడిట్‌ చోరీ చేసే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉంటారా.. అనిపిస్తోంది. చివరకు ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి బహుశా సిగ్గు పడుతుందేమో! అంతటి దారుణమైన మోసాలు.. అబద్ధాలు. నాలుగుసార్లు సీఎం అని చెప్పే చంద్రబాబుకు భూములు రీ సర్వే చేయాలనే కనీస ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని ఏనాడైనా తపన పడ్డావా? ఈ రోజు క్రెడిట్‌ చోరీ చేస్తూ మాట్లాడుతున్న మాటలకు నిజంగా ఈ పెద్దమనిషి సిగ్గుపడాలి. 

6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి   
మా ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద వ్యవస్థను సృష్టించి, డ్రోన్‌ సర్వే కూడా పూర్తి చేశాం. ఆర్థోరెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌ (ఓఆర్‌ఐ) అన్ని జిల్లాలకు పంపేశాం. ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి చేసేశాం. రైతుల భూ సరిహద్దులను ఖరారు చేశాం. సర్వే రాళ్లను పాతడం పూర్తయింది. ఈ గ్రామాల్లో రికార్డులన్నింటినీ అప్‌డేట్‌ చేసి, సబ్‌ డివిజన్స్, మ్యుటేషన్లు పూర్తి చేసి, ప్రతి భూ కమతాకు విశిష్ట నంబర్‌ (యూనిక్‌ నంబర్‌) ఇచ్చాం. భూ కమతా మ్యాప్‌ను కూడా జియో ట్యాగింగ్‌ చేసి, పాస్‌బుక్‌లో పొందుపరిచి, 30 లక్షల మంది రైతుల సమస్యలు మొబైల్‌ మెజిస్ట్రేట్‌లతో పరిష్కరించాం. 

వివాదాలు లేని విధంగా క్యూ ఆర్‌ కోడ్‌తో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చాం. ఈ క్యూ ఆర్‌ కోడ్‌ ప్రజలు స్కాన్‌ చేస్తే మొత్తం భూమి, యజమాని వివరాలు కనిపిస్తాయి. మీ భూమి పోర్టల్‌ అప్‌గ్రెడేషన్‌ పూర్తి చేశాం. జియో ట్యాగింగ్‌ చేసిన క్రమంలో అక్షాంశాలు, రేఖాంశాలతో సహా మొత్తం భూమి వివరాలు వచ్చేస్తాయి. రియల్‌ టైమ్‌ అలర్ట్‌లతో.. మీ భూమి ఏపీ గవర్నమెంట్‌ పోర్టల్‌ను అప్‌గ్రేడ్‌ చేసి, భూ రికార్డులపై ఆటోమేటిక్‌గా మీకు అలర్ట్‌లు వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చాం. దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న పథకం ఇది. ఇందులో 40 వేల మంది ఉద్యోగుల నాలుగేళ్ల శ్రమ, కష్టం ఉంది. అందుకే ఈ పథకానికి ‘జగనన్న భూ హక్కు – భూరక్ష’ అని పేరు పెట్టాం.   

ఇలా ఏనాడైనా చేశావా బాబూ?  
చంద్రబాబూ.. ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా చేశారా? రైతు, భూ యజమాని నష్టపోకూడదని, అన్ని రకాలుగా మంచి జరగాలని మీరెప్పుడైనా తాపత్రయ పడ్డారా? ఇంత చేసిన మా గురించి ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఎవరు దొంగలో ఇప్పుడు చెప్పండి. ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని అనుకునే ఎవరైనా ప్రత్యేక (డిస్టింక్ట్‌) రాళ్లు పాతి, భూ కమతాల నలుమూలలా  జియో ట్యాగింగ్‌ చేసి, క్యూ ఆర్‌ కోడ్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదార్‌ పాసు పుస్తకాలు ఇస్తారా? చెడు ఉద్దేశాలుంటే ఈ విధంగా మంచి చేస్తారా? అబద్ధాలకు ఒక హద్దు ఉండాలి. మాపై బాబు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. ఒకసారి పాత, కొత్త పాస్‌ పుస్తకాలను అందరూ గమనించాలి. పాత వాటిలో భూ వివరాలన్నీ చేతితో రాసి ఉంటాయి. 

ఆ పాత పుస్తకంలో ఎక్కడా మ్యాప్‌లు లేవు. అక్షాంశాలు, రేఖాంశాలతో జియో ట్యాగింగ్‌ లేదు. మేం సబ్‌ డివిజన్, మ్యూటేషన్‌ చేశాక, విశిష్ట భూ కమతా నంబర్, ఏ మాత్రం తేడాలేని కొలతలతో కూడిన జియో ట్యాగింగ్‌ చేసి, క్యూ ఆర్‌ కోడ్‌లతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చాం. పాస్‌బుక్‌ చివరలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్‌ చేసి, రైతుల వివరాలు అప్‌డేట్‌ చేసి, రియల్‌ టైమ్‌ అప్‌డేట్స్‌తో అందుబాటులోకి తెచ్చాం. సర్వే పూర్తయిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చాం. దాన్ని పూర్తిగా వదిలేశారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ఎందుకంత ముఖ్యమంటే.. కళ్ల ఎదుటే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతూ, రికార్డులు అప్‌డేట్‌ అవుతున్నప్పుడు, మోసాలకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు కాబట్టి. 

నీతి ఆయోగ్‌ కొనియాడింది..  
మేం చేపట్టిన రీసర్వే గొప్పగా జరిగింది కాబట్టే నీతి ఆయోగ్‌ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మహారాష్ట్ర వచ్చి ప్రశంసలు కురిపించింది. అసోం బృందం ఏపీలో పర్యటించి, ఏపీ ప్రభుత్వ సహకారం కోరింది. సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.వి.సింగ్‌ మా ప్రభుత్వ తీరును మెచ్చుకున్నారు. (వీడియో ప్లే చేసి చూపించారు). 

క్రెడిట్‌ కోసం పడరాని పాట్లు 
సమగ్ర భూ సర్వేతో భూములు పోతాయని, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని నాడు చంద్రబాబు విష ప్రచారం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో భాగస్వామిగా ఉండీ ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా మా ప్రభుత్వంలో సర్వే చేశామని కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ట్వీట్‌ చేయడం, చంద్రబాబు థ్యాంక్యూ అని రీ ట్వీట్‌ చేయడం ఆశ్యర్యంగా ఉంది. క్యూ ఆర్‌ కోడ్‌ తానే తెచ్చానంటూ చంద్రబాబు సొల్లు మాటలు చెబుతున్నారు. సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు.  

మేమిచ్చిన పుస్తకాలకే రంగు మార్చి.. 
మేం ఇచ్చిన 30 లక్షల పాస్‌ బుక్‌లు వెనక్కి తీసుకొని, వాటికే చంద్రబాబు రంగు మార్చి ఇస్తున్నారు. రంగు మార్చి ఇస్తున్న వాటిలో తేడా ఏముందో చూస్తే.. అదే క్యూ ఆర్‌ కోడ్, అదే ఫార్మాట్‌. జీయో కో ఆర్డినేట్స్‌తో భూ కమతా నంబర్, జియో కో ఆర్డినేట్స్‌ ల్యాండ్‌ మ్యాప్‌ ఇలా అన్ని ఒకే విధంగా ఉన్నాయి. చివరి పేజీల్లో చూస్తే వైఎస్సార్‌సీపీ హయాంలో అప్‌గ్రేడ్‌ చేసిన మీ భూమి పోర్టల్‌ను కాపీ కొట్టి ముద్రించారు. మేం ఇచ్చిన పుస్తకాలకు రంగు మార్చడం తప్ప ఈ 19 నెలల్లో చంద్రబాబు చేసిందేమీ లేదు. రంగు మార్చి ఇచ్చే పుస్తకాల్లోనూ తప్పుల తడకలే. పేర్లు, ఫొటోలు, ఐడీ నంబర్లు, విస్తీర్ణం అన్నింట్లో తప్పులు వస్తున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి రైతులు మళ్లీ లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి.   

పేర్లు చెరిపేయడానికి రూ.15 కోట్లు 
రీ సర్వే చేసి కొన్ని కోట్ల సర్వే రాళ్లను మేము పాతాం. ఆ రాళ్ల మీద ఉండే వైఎస్సార్, జగనన్న భూ హక్కు – భూ రక్ష పేరును రూ.15 కోట్ల డబ్బు ఇచ్చి మెషీన్లు పెట్టి తుడిచేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము వెచ్చించి, ఇంత పనికిమాలిన పని ఎవరైనా చేస్తారా? ఈయన కొత్తగా రాళ్లు ఇవ్వకపోగా, మేం పాతిన రాళ్లపై పేర్లను చెరిపేస్తున్నారు. అంటే అవి భూ రక్ష రాళ్లు కాదని చూపడానికి, అందులో ఉండే ప్రత్యేకతను(డిస్టింక్ట్‌) దగ్గరుండి తీసివేసే కార్యక్రమం చేస్తున్నాడు. పనికి మాలిన పని కాకపోతే ఇదేంటి? బుద్ధి ఉన్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా? విజయవాడలోని అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర కూడా ఇంతే. విగ్రహం నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేసి, ఆవిష్కరించిందీ నేనే. అదే పనిగా అధికారులను పంపి నా పేరును తీయించారు. ఇటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. నా పేరు తీసేస్తే మాత్రం ఆ అంబేడ్కర్‌ విగ్రహం ఎవరు కట్టారో తెలియదా? రీ సర్వే ఎవరు చేయించారో తెలియదా? ట్యాంపర్‌కు వీల్లేని పాస్‌ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో తెలియదా? చంద్రబాబు వయసేమో 80 ఏళ్లు. మా నాన్నతో సమకాలికుడు. మా నాన్నతో పోటీ దేవుడెరుగు, ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీకి అవస్థ పడుతున్నారు.    

కమీషన్‌ కోసం  దేన్నీ వదలడం లేదు
మా హయాంలో రూ.55.79కు పట్టాదారు పాస్‌బుక్‌ ఇచ్చాం. కలర్‌ మార్చి రూ.76కు చంద్రబాబు ఇస్తున్నారు. అంటే రూ.20 కమీషన్‌. కమీషన్‌ కోసం దేనినీ వదలడం లేదు. ఇంకో ఆశ్చర్యం చంద్రబాబు 22–ఏ గురించి మాట్లాడటం. 22–ఏ గురించి 2016–17లో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి, నిషేధిత జాబితా కింద పెట్టి, రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఆయనది. తప్పులన్నీ ఆయన చేసి, బురద మాత్రం వేరేవాళ్ల మీద చల్లుతారు. 
 
⇒ మేం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా 20.24 లక్షల మంది పేదలు, రైతులకు ఏకంగా 35.44 లక్షల ఎకరాలపై హక్కులు లభించాయి. ఇందులో ప్రధానంగా అసైన్డ్‌ ల్యాండ్‌ పొంది 20 ఏళ్లు దాటితే, వారి భూముల మీద పూర్తి హక్కులు కల్పించిన ఘనత మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది. ఒరిజినల్‌ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపజేస్తూ మేము తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్‌ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి. 

⇒ చుక్కల భూములకు సంబంధించి మరో 97 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు మేం హక్కులు కల్పించాం. షరతులు కలిగిన భూములకు సంబంధించి 22 వేల మంది రైతులకు మరో 35 వేలకు పైగా ఎకరాల భూమి మీద హక్కులు వచ్చాయి. విలేజ్‌ సర్వీస్‌ ఇనాం భూముల కింద 1.58 లక్షల ఎకరాలకు సంబంధించి మరో 1.61 లక్షల మందికి మేలు కలిగిస్తూ హక్కులు కల్పించాం.  

⇒ చంద్రబాబు సృష్టించిన కష్టాల నుంచి మేము పేదలను, రైతులను బయటకు వేశాం. ఇప్పుడేమో ఆ పెద్ద మనిషి 22–ఏ మా హయాంలో పెట్టామని మాట్లాడుతున్నాడు. అబద్ధాలు చెప్పడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క సెంటు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మా ప్రభుత్వ హయాంలో 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్‌ భూములు కొత్తగా మేము పంపిణీ చేశాం. గిరిజన ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కు కల్పించాం. చంద్రబాబు క్రెడిట్‌ చోరీలో భాగంగా, 22ఏ మేము పెట్టామని 
అంటున్నాడు.  

ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్‌ దేశంలో తొలిసారి
భారత్‌లో భూ రికార్డులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. గ్రామాల్లో పట్వారీ ఉపయోగించే మ్యాప్స్‌ను నిజంగా మ్యాప్‌లు అని కూడా అనలేం. అవి కచ్చితత్వం లేని, తప్పులతో కూడిన మ్యాప్స్‌. ఈ పరిస్థితిని సరిచేయడానికి 2008లో ఎన్‌ఎంఎల్‌ఆర్‌పీ అనే ఒక పథకం వచ్చింది. కానీ ఆ పథకం ద్వారా జరగాల్సిన స్థాయిలో సంస్కరణలు జరగలేదు. ఏపీలో దూరదృష్టి కలిగిన సీఎం వైఎస్‌ జగన్‌ సంస్కరణల దిశగా అడుగులు వేశారు. భూ రికార్డులను సంపూర్ణంగా సరిచేయాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చారు. మొదటగా 10 వేల మందికిపైగా గ్రామ సర్వేయర్లను నియమిస్తూ అడుగులు వేశారు. రీసర్వే అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూఏవీలు, డ్రోన్స్, హెలికాప్టర్లు, విమా­నాల సహాయంతో గ్రామాల మ్యాపింగ్‌ జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్న మ్యాప్స్‌­తో పోలిస్తే, ఇకపై రైతులకు లభించే వివరాలు, మ్యాప్‌లు అత్యంత కచ్చితంగా ఉంటాయి. ఇది దేశంలోనే ఒక మైలు రాయి. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్‌ను రూపొందించడం దేశంలో ఇదే తొలిసారి. 17 వేల గ్రామాలకుగాను ఇప్పటికే 7 వేలకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న పథకాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  

– 2022 నవంబర్‌ 23న నరసన్నపేటలో 
సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.వి.సింగ్‌  
(ఈ వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement