భార్యకు హెచ్‌ఐవీ ఉందని నమ్మించే ప్రయత్నం
దాడి చేసి హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన వైనం
కర్నూలు: కర్నూలు మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తపై కన్నేసిన ఓ మహిళ భార్యాభర్తలను విడదీసేందుకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌తో దాడి చేసి, పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. కర్నూలు నగరం గణేష్ నగర్‌లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నివాసముంటున్నారు. నందికొట్కూరు రోడ్డులోని మల్లారెడ్డి వెంచర్‌లో నివాసముంటున్న బీచుపల్లి బోయ వసుంధరకు మహిళా వైద్యురాలి భర్తతో పరిచయం ఉంది.
భార్యాభర్తలను విడదీస్తే తాను మరింత దగ్గర కావొచ్చన్న దురుద్దేశంతో ఆదోని ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన కొంగె జ్యోతి, భూమా జస్వంత్, భూమా శృతితో కలిసి వైద్యురాలిపై దాడికి పథకం పన్నింది. వైద్యురాలికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ఇచ్చి, ఆమెకు హెచ్‌ఐవీ సోకిందని చెబితే ఆ జంట విడిపోతుందని భావించింది. ఈ నెల 9న ఆమె ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా లక్ష్మీనగర్ కేసీ కెనాల్ గట్టు వద్ద వైద్యురాలి వాహనాన్ని ఢీకొట్టారు.
ఆమెను ఆటోలో ఎక్కించేందుకు సహాయం చేస్తున్నట్లు నటించి, హెచ్‌ఐవీ ఇంజెక్షన్ వేసి పరారయ్యారు. జరిగిన విషయాన్ని వైద్యురాలు తన భర్తకు చెప్పడంతో ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ పేర్కొన్నారు.


