వివేకా హత్య కేసులో.. కొత్త నిందితులెవరూ లేరు | CBI Court Hearing on YS Vivekananda Reddy Death Case | Sakshi
Sakshi News home page

వివేకా హత్య కేసులో.. కొత్త నిందితులెవరూ లేరు

Mar 11 2026 5:37 AM | Updated on Mar 11 2026 5:37 AM

CBI Court Hearing on YS Vivekananda Reddy Death Case

మరింత దర్యాప్తు అవసరం లేదన్న సీబీఐ

ట్రయల్‌ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు పూర్తి 

సీబీఐ కోర్టుకు అనుబంధ నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ

కొత్తగా ఎవరి పాత్రా బయట పడలేదు.. నిందితులుగా చేర్చలేదు

కిరణ్‌యాదవ్, అర్జున్‌రెడ్డి కాల్‌ రికార్డులపై సునీత పొరపడ్డారు

‘యూటీసీ’ సమయానికి ఐదున్నర గంటలు కలిపితే భారత్‌ టైం

ఉదయం 7.12కి కిరణ్, అర్జున్‌కు మెసేజ్‌ చేయడం సాధారణమే

అప్పటికే వివేకానందరెడ్డి మృతి వార్త మీడియాలోనూ ప్రసారం

విచారణ ఈ నెల 16కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేశామని, కొత్తగా నిందితులెవరూ లేరని, తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పేర్కొంది. ఈ మేరకు సీబీఐ కోర్టుకు అనుబంధ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో కొత్తగా ఎవరి పాత్ర బహిర్గతం కాలేదని అనుబంధ నివేదికలో సీబీఐ వెల్లడించింది. సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌యాదవ్, ప్రకాశ్‌రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డి సీడీఆర్‌ రికార్డుపై వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత పొరపడ్డారని స్పష్టం చేసింది. యూటీసీ సమయాన్ని భారత కాలమా
నంగా భావించారని తెలిపింది.

వాస్తవానికి యూటీసీ సమయానికి 5:30 గంటలు కలిపితే ఇక్కడి సమయం వస్తుందని, ఆ మేరకు ఉదయం 7:12 గంటలకు కిరణ్, అర్జున్‌కు మెసేజ్‌ పంపడం అనుమానించాల్సిన విషయం కాదని పేర్కొంది. అర్జున్‌ కూడా వరుసకు వివేకాకు మనవడు అవుతారని, అందుకే వివరాలు తెలియజేశారని వెల్లడించింది. దీంతో ఎలాగైనా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతిని ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేసిన పచ్చమీడియా, సునీత కుయుక్తులు బెడిసికొట్టాయి. వైఎస్‌ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో నర్రెడ్డి సునీత పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పాక్షిక దర్యాప్తునకు అనుమతిస్తూ డిసెంబర్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

⇒ చార్జిషీట్‌లో వివరాలు..
‘2019 మార్చి 15న వివేకా తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన పీఏ కృష్ణారెడ్డి.. ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్, భార్య సౌభాగ్యమ్మకు ఫోన్‌ చేసి చెప్పారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీబీఐకి కేసు బదిలీ చేసింది. 2021 అక్టోబర్‌లో ప్రాథమిక దర్యాప్తు తర్వాత గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమా శంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ పులివెందులలోని జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలైంది.

దస్తగిరి అప్రూవర్‌గా మారగా తరువాత శివశంకర్‌రెడ్డిని నిందితుడిగా చేరుస్తూ అనుబంధ చార్జిషీట్‌ వేశారు. అనంతరం కేసు హైదరాబాద్‌ కోర్టుకు బదిలీ అయ్యింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని నిందితులుగా చేరుస్తూ మరో అనుబంధ చార్జిషీట్‌ దాఖలైంది. ఈ కేసు సీఆర్‌పీసీ సెక్షన్‌ 207 కింద నిందితులకు అందించిన పత్రాల ధృవీకరణ దశలో ఉంది’ అని 
చార్జిషీట్‌లో పేర్కొంది.

⇒  సమాచారం ఇవ్వడంలో తప్పులేదు..
‘ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత 2025 సెప్టెంబర్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు ఆమె పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించింది. వివేకా మృతి చెందిన నాటి రాత్రి సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌యాదవ్, వైఎస్‌ ప్రకాశ్‌రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డి ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించి ఏదైనా ఉంటే దర్యాప్తు చేయాలని 2025 డిసెంబర్‌లో కోర్టు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కాల్‌ డేటా రికార్డు(సీడీఆర్‌)ను పరిశీలించాం. 2019 మార్చి 15న కో–ఆర్డినేటేడ్‌ యూనివర్సల్‌ టైమ్‌ (యూటీసీ) 1:42:42 ప్రకారం.. ‘వివేకం సర్‌’, ‘అర్జున్‌ అన్నా.. సర్, చనిపోయారు..’ అని మెసేజ్‌ పంపారు.

ఈ సమయంపై పొరపడిన సునీతారెడ్డి అర్థరాత్రిగా భావించారు. కానీ, వాస్తవం ఏమిటంటే.. యూటీసీ సమయానికి అదనంగా 5:30 గంటలు కలిపితే భారత కాలమానం వస్తుంది. 1:42:32 యూటీసీ సమయం అంటే.. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:12:42 (7 గంటల 12 నిమిషాల 42 సెకన్లు). అప్పటికే వివేకా మృతి వార్త మీడియాలోనూ ప్రసారమైంది. అంతేకాదు.. ఆ రోజు రాత్రి, ఉదయం కిరణ్‌ యాదవ్‌ తన ఇంట్లోనే ఉన్నారని తేలింది. ఉదయం (తెల్లవారుజామున) టీవీ చూస్తుండగా వివేకా మరణవార్త అతనికి తెలిసింది. అదే రోజు అర్జున్‌రెడ్డి లాంటి వారు కొందరు కిరణ్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కిరణ్‌ ఫోన్‌ చేసినా అర్జున్‌ అందుబాటులోకి రాకపోవడంతో మెసేజ్‌ పంపారు. అర్జున్‌కు వరుసకు వివేకా తాత అవుతారు.

అందుకే కిరణ్‌ వివరాలు తెలిపారు. అంతేగానీ ఈ హత్యతో వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇతరుల పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేశాం. వివేకా హత్య కేసులో మరే ఇతర వ్యక్తి పాత్ర బయటపడలేదు. కేసులో తదుపరి దర్యాప్తును ముగించాలి. ఈ అనుబంధ నివేదికను అంగీకరించాలి’ అని సీబీఐ చార్జిషీట్‌లో నివేదించింది. అర్జున్, కిరణ్‌యాదవ్‌ నుంచి సేకరించిన వాంగ్మూలం రికార్డులు, సమయానికి సంబంధించి ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ రవీందర్‌ చౌహాన్‌ నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్‌ను నివేదికకు జత చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement