సర్కారు వైద్యానికి సుస్తీ! | Chandrababu Govt: Sakshi Ground Report on Govt Hospitals Across AP | Sakshi
Sakshi News home page

సర్కారు వైద్యానికి సుస్తీ!

Mar 11 2026 5:16 AM | Updated on Mar 11 2026 6:00 AM

Chandrababu Govt: Sakshi Ground Report on Govt Hospitals Across AP

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో రక్తం ఎక్కించుకుంటున్న రోగిని తీసుకెళ్తున్న బంధువు , గుంటూరు జీజీహెచ్‌లో ఉదయం 11 గంటలు దాటాక తాళాలు వేసి ఉన్న ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ రూం , తిరుపతి రుయాలో ఎమ్‌ఎస్‌డబ్ల్యూ వార్డు బయట వరండాలోనే రోగులకు చికిత్స

ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల అవస్థలు వర్ణనాతీతం

వైద్యులే కాదు సిబ్బందికీ కొరతే 

మందుల్లేవ్‌.. బయట కొనుక్కోవలసిందే 

బెడ్ల కొరత.. ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులు 

కనిపించని వీల్‌చెయిర్లు, స్ట్రెచర్లు 

అక్కడక్కడా ఉన్నా రోగి బంధువులే వార్డుబాయ్‌లు 

వెంటిలేటర్లు.. ముఖ్యమైన పరికరాల్లేవ్‌ 

స్కానింగ్‌లు, టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు.. ఆస్పత్రుల పరిసరాలు దుర్గంధభరితం 

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులపై సాక్షి ‘గ్రౌండ్‌ రిపోర్ట్‌’

సాక్షి, నెట్‌వర్క్‌: సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. నయం చేయలేని రోగంతో ప్రభుత్వ ఆస్పత్రులు కునారిల్లుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరు­పేదలు వైద్యం కోసం నానా అవస్థలు పడుతు­న్నారు. ఏ ఆస్పత్రి­లోనూ తగినన్ని పడకలు లేవు. ఒకే పడకపై ఇద్దరు నుంచి ఏడుగురు పేషెంట్లు కనిపిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాలు, బాత్‌­రూమ్‌లు దుర్గంధభూ­యిష్టంగా ఉన్నాయి. కనీస పారిశుద్ధ్యం కనిపించలేదు. అత్యవసర చికిత్స కోసం పేషెంట్లు ఆదరాబా­దరాగా వస్తే.. స్ట్రెచర్లు కాదు కదా కనీసం వీల్‌చైర్‌లో తీసుకెళ్లే దిక్కు కూడా లేదు. 

కొన్ని ఆస్పత్రులలో వీల్‌చైర్లు ఉన్నా సిబ్బంది లేరు. రోగి వెంట వచ్చే కుటుంబ సభ్యులే వారిని తీసుకెళ్లడమో మోసుకెళ్లడమో చేస్తున్నారు. వీల్‌చైర్‌లు, స్ట్రెచర్లే కాదు ముఖ్యమైన పరికరాలూ లేవు. ఉన్నా పనిచేయని స్థితిలో ఉన్నాయి. రిపేర్లు చేయించేవారు లేరు. సిబ్బంది కొరతతో పాటు వైద్యుల కొరత కూడా ఆస్పత్రులను వేధిస్తోంది. నెలల తరబడి ఈ ఖాళీలు భర్తీ కావడం లేదు. చచ్చీచెడీ వైద్యం చేయించుకున్నా మందులకు ఠికాణా ఉండడం లేదు. బయట కొనుక్కోండి అని సిబ్బంది చెబుతుంటే పేదలు బిక్కమొహం వేస్తున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో కనిపించిన విషయాలివీ.. 

ప్రాణాధారమైన పరికరాలెక్కడ?
విజయవాడ జీజీహెచ్‌లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. వెంటిలే­టర్లు కొ­నాలని ఆరు నెలలుగా వైద్యులు కోరుతున్నా, ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీ­ంతో ప్రాణాపాయంలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతు­న్నారు. గుంటూరు జీజీ­హెచ్‌లో సిటీస్కాన్‌ పరికరం ఆరు నెలలకుపైగా మూలన పడింది. పట్టించుకునే నాథు­డే లేడు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏరియా వైద్యశాలలో కూడా సీటీస్కాన్‌ పరిక­రం లేదు. బయటకు పంపిస్తున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఒకే ఒక ఎక్స్‌రే యూ­నిట్‌ ఉంది. వందలమంది రోగులు గంటల తరబడి అక్కడ క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది.

వైద్యులే కాదు సాధారణ ఉద్యోగులకూ కొరతే..
విజయవాడ జీజీహెచ్‌లో నాల్గో తరగతి ఉద్యోగుల(ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ) కొరత తీవ్రంగా ఉంది. దీంతో రోగులను ఒకచోట నుంచి మరో చోటుకు తరలించాలన్నా, క్యాజువా­లిటీ నుంచి ఐసీయూకు తరలించాలన్నా రోగుల బంధువులే తీసుకెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది. కనీసం 350 మంది ఉండాల్సిన ఉద్యోగులు కేవలం 96 మంది మాత్రమే ఉన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో రోజు 1,200 నుంచి 1,300 వరకు ఓపీ ఉంటుంది. ఇన్‌ పేషెంట్లు సుమారు 500 మంది ఉంటారు. తగినంత మంది ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓలు లేరు. వీల్‌ చైర్‌లు, స్ట్రెచర్‌లో రోగులను తరలించడం ఇబ్బందిగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సర్వజనాస్పత్రిలో కిడ్నీ వ్యాధితో బాధపడు­తున్న మేదరమె­ట్లకు చెందిన నలబోతుల కోటమ్మ అనే మహిళను 11 ఏళ్ల ఆమె కుమా­రుడు కోటయ్య వీల్‌ చైర్‌లో కూర్చోబెట్టుకొని తోసుకుంటూ తీసుకెళ్లడం కనిపించింది. 

గుంటూరు జీజీహెచ్‌లో మందుల కోసం క్యూ లైన్‌లో బారులు తీరిన రోగులు, వృద్ధులు 

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. అత్యవసర సమయా­ల్లోనూ, ఆదివారా­ల్లోనూ మత్తు డాక్టర్‌ అందుబాటులో ఉండకపోవడం సమస్యగా మారిందని రోగు­లంటున్నారు. ఏలూరు జీజీహెచ్, మెడికల్‌ కళాశాలకు సంబంధించి 51కిపైగా ఖాళీలు ఉన్నాయి. ఇక గుండెపోటు వస్తే వైద్యం చేసే నాథుడే లేడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం ఏరియా ఆస్పత్రిలో నాల్గవ తరగతి ఉద్యోగుల కొరత ఉంది. 18 మందికిగాను కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. జీడీ వర్కర్లు ఎనిమిది మందికి ముగ్గురు ఉన్నారు. పార్వతీ­పురం జిల్లా ఆస్పత్రిలో ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విజయ­నగరం, విశాఖ­పట్నం ప్రాంతాలకు రిఫర్‌ చేస్తున్నారు. 

ప్రధానంగా సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ రేడి­యాలజీ స్పెషలిస్ట్, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్, మైక్రో బయాలజీ, ఈఎన్‌టీ, నర్సింగ్‌ సూ­పరి­ంటెండెంట్‌ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేసే వారు సైతం లేకపో­వడంతో ఈ విభాగం తాళం వేసే ఉంటోంది. దీంతో ఈ సేవలకు కూడా రోగులు బయటకు వెళ్లా­ల్సి వస్తోంది. విజయనగరం జిల్లా సర్వజనా­స్ప­త్రిలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత అల్ట్రా­సౌండ్‌ స్కాన్‌ సేవలు అందడం లేదని రోగులు చెబు­తున్నారు. బంధువులే రోగు­లను ఎక్స్‌రే, స్కానింగ్, వైద్య పరీక్షల కోసం వీల్‌ చైర్, స్ట్రెచర్‌లపై తరలిస్తుండడం కనిపించింది.

ఇద్దరు నుంచి ఏడుగురు రోగులకు ఒకే పడక..
పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 150 పడకలు ఉంటే.. ఇన్‌ పేషెంట్లు 286 మంది ఉన్నారు. దీనివల్ల ఒకే పడకపై ఇద్దరిని సర్దుబాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. రోగులు, వారి బంధువులు వేచి ఉండేందుకు సరిపడా సౌక­ర్యాలు లేవు. కుర్చీలు కూడా లేక కిందే కూర్చోవాల్సిన పరిస్థితి. గర్భిణులకూ ఇవే ఇక్కట్లు. గుంటూరు జీజీహెచ్‌లో తుప్పు పట్టిన మంచాలపై, పరుపులు సైతం చిరిగిపోయిన మంచాలపై రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం ఏరియా ఆస్పత్రిలో 100 పడకలుండాలి కానీ నలభై బెడ్‌­లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కూడా చాలా బెడ్‌లను ఆస్పత్రి కారిడార్లలో ఉంచారు. విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రిలో వార్డుల్లో పడకలు చాలక రోగులకు వరండాలోనే చికిత్స అందిస్తున్నారు. గత ఫిబ్రవరి 7న పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఇడ్లీ, నిల్వ చట్నీ తిని అస్వస్థతకు గురికావడంతో వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బెడ్లు చాలక ఒకే మంచంపై ఏడుగురిని కూర్చోబెట్టి చికిత్స అందించిన దుస్థితి సర్కారు నిర్లక్ష్యానికి అద్దంపట్టింది. 

రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఏడుగురు విద్యార్థులను కూర్చోబెట్టి చికిత్స చేస్తున్న దృశ్యం (ఫైల్‌) 

మందుల్లేవ్‌.. బయట కొనుక్కోండి..
విజయవాడ జీజీహెచ్‌లో కార్డియాలజీ, న్యూరాలజీకి సంబంధించిన కొన్ని రకాల మందులు అందుబాటులో లేవు. దీంతో రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు ఏరియా వైద్యశాలలో చాలా రకాల మందులు అందుబాటులో లేవు. బయట కొనుక్కోమని సిబ్బందే సలహా ఇస్తున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్‌ వైద్యశాలలో జలుబు, దగ్గు మందులు కూడా లేవు. కాకినాడ జీజీహెచ్‌లో మందుల కొరత వేధిస్తోంది. అత్యవసర కేటగిరికి చెందిన మందులు కూడా లేకపోవడం రోగులకు ప్రాణ సంకటంగా మారుతోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మందులు లేవంటూ చీటి రాసి బయట తెచ్చుకోమంటున్నారని రోగులు చెబుతున్నారు.

సాయం పట్టని సిబ్బంది
తీవ్ర అస్వస్థతతో అచేతనంగా కుటుంబ సభ్యుల సాయంతో ఆస్పత్రికి వచ్చిన ఈ వృద్ధురాలి పేరు పి.నాగమణి. శ్వాస సరిగ్గా ఆడటం లేదనీ.. మూత్ర సమస్యతో బాధపడు­తోందంటూ కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు ఉదయం 10.45కి తీసుకొచ్చారు. కుమార్తె క్యాజువాలిటీలోకి వెళ్లి సిబ్బందికి సమస్య వివరించారు. చాలాసేపటి తర్వాత ఆమె చేతికి స్ట్రెచర్‌ ఇచ్చి పంపించారు. నాగమణి కుటుంబ­సభ్యులే ఆటోలోంచి వృద్ధురాలిని లేపి స్ట్రెచర్‌పై పడుకో­బెట్టి.. క్యాజువాలిటీలోకి తీసుకెళ్లాల్సి వచ్చింది.

మనవరాలిని ఎత్తుకుని తాత అవస్థలు 
పాడేరు మండలం కుజ్జెలి గ్రామానికి చెందిన గబ్బాడ గంగన్న గాయపడిన తన మనవరాలు శైలజను చంకన ఎత్తుకుని ఎక్స్‌రే గది వద్ద చాలా అవస్థ పడ్డాడు. ఎక్స్‌రే గది వద్ద రోగుల తాకిడి అధికంగా ఉండడంతో గంగన్న కూడా సుమారు గంటన్నర పాటు క్యూలైన్‌లో నిరీక్షించాల్సి వచ్చింది.

ఆస్పత్రులా.. డంపింగ్‌ యార్డులా..
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల పరిసరాలు దుర్గంధభూయిష్టంగా మారాయి. ఆస్పత్రిలోని డ్రైనేజీలలో నీరు ముందుకు కదలక పాచిపట్టి కనిపిస్తున్నాయి. వాడిన నీరు బయ­టకు వెళ్లే మార్గం లేదు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్‌ వైద్యశాలలో బ్లడ్‌బ్యాంకు వైపు వెళ్లే ప్రాంతాల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అవసరమైన టాయిలెట్లు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఉన్న టాయిలెట్లు రిపేర్ల పేరుతో తాళాలు వేసి ఉంచుతున్నారు. దీంతో రోగులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జీజీహెచ్‌ పరిసరాల్లో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలోనూ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.

వీల్‌చెయిర్లు, స్ట్రెచర్లు లేవు..
గుంటూరు జీజీహెచ్‌ ఓపీ విభాగంలో రోగులు చికిత్స పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వీల్‌చైర్‌లు, స్ట్రెచర్లు అందుబాటులో లేవు. రోగుల సహాయకులే రోగులను తరలించాల్సి వస్తోంది.  కడపలోని జీజీహెచ్‌ (రిమ్స్‌) ఓపి వద్ద వీల్‌ చైర్, స్ట్రెచర్‌లు లేకపోవడంతో రోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

వార్డు బాయ్‌ కూడా లేరు..
మా నాన్న సింహాచలం తీవ్రమైన అనారోగ్య సమస్య­తో బాధపడుతుంటే కేజీహెచ్‌లో అడ్మిట్‌ చేశాం. టెస్టులకు, స్కానింగ్‌కు వెళ్లాల­ంటే మేమే తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఎవరూ సాయం చెయ్యడం లేదు. వీల్‌ చెయిర్‌ ఇస్తున్నారు. అక్కడ వార్డు బాయ్‌ లేరని చెప్పారు.
– సాయికృష్ణ, దత్తిరాజేరు, విజయనగరం జిల్లా

మందులకు రూ.450 ఖర్చు అయ్యింది
కొంత కాలంగా విపరీతమైన దగ్గు వస్తోంది. నోటి నుంచి రక్తం సైతం పడుతోంది. ఏరియా ఆసుపత్రికి వచ్చా­ను. పరీక్షించిన డాక్టర్‌ నాలుగు రకాల మందులు రాయగా అందులో ఒకటే ఇచ్చి మూడు బయట తీసుకో­మ­న్నారు. ప్రైవేట్‌ దుకాణంలో రూ.450 ఖర్చు చేసి కొన్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక మందులు కొనుక్కోవలసిరావడం మా వంటి పేదలకు భారంగా మారింది. 
    – షేక్‌ షఫీ, రోగి, నరసరావుపేట

స్కానింగ్‌ బయట చేయించుకురమ్మన్నారు
మాది మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం  వాకపల్లి గ్రామం. 100 కి.మీ.  బస్సులో ప్రయాణించి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి వచ్చాను. 15 రోజులుగా ఎపెండిక్స్‌ నొప్పితో బాధపడుతున్నా. స్కానింగ్‌ రాశారు. బయట చేయించుకుని నాలుగురోజుల తర్వాత రమ్మన్నారు.  నొప్పి భరించలేకపోతున్నా. చనిపోవాలనిపిస్తుంది. ఏదైనా ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటాను. 
    – టి.చరణ్, వాకపల్లి గ్రామం, విశాఖజిల్లా

వైద్యం చేయలేం.. వెళ్లమన్నారు..
ఇంటి దగ్గర ప్రమాదవశాత్తూ కిందపడ్డా. 55 ఏళ్ల వయసులో నడవలేని స్థితిలో హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికి తెల్లవారుజామునే వచ్చాను. అత్యవసర విభాగంలోకి వెళ్తే.. స్కానింగ్‌ చేయించుకోవాలని చెప్పారు. ఉదయం 11 గంటలు దాటినా.. పట్టించుకునే వారే కనిపించలేదు. డ్యూటీ డాక్టర్‌ వచ్చే వరకు వేచి ఉండాలన్నారు. చివరకు ఇక్కడ వైద్యం చేయలేమని చెప్పి వెళ్లిపోమన్నారు.
    – అడవన్న, నేతులపల్లి, సత్యసాయి జిల్లా

పట్టించుకునే దిక్కులేదు..
నాకు నెల రోజుల కిందట మెదడుకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగింది. పరీక్షలు చేయించుకునేందుకు  శ్రీకాకు­ళం నగరంలోని రిమ్స్‌ ఆస్పత్రికి వచ్చాం. ఓ ప్రైవేట్‌ ట్యాక్సీలో వచ్చిన నన్ను దింపేందుకు ఆస్పత్రి సిబ్బంది ఎవరూ లేరు. కనీసం స్ట్రెచర్‌ అయినా దొరుకుతుందన్న ఆశతో మా వాళ్లు  వెతుకు­లాడారు. ఫలితం లేదు.. సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులెవరూ అందుబాటులో ఉండరని ఎవరో చెప్పారు. చేసేది లేక వెనక్కు వెళ్లిపోయాం.
    – కుమ్మరి రాజారావు, పాలవలస, శ్రీకాకుళం జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement