కర్నూలు (సిటీ): కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో పంచలింగాలకు చెందిన ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి స్పల్పగాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఉండవల్లి సమీపంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎంపీ బస్తిపాటి నాగరాజు చిన్న కుమారుడు నాగరాజు వివాహం ఇటీవలే జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి మండలం కంచిపాడులో జమ్ములమ్మ దర్శనం నిమిత్తం స్వగ్రామం పంచలింగాల నుంచి కారులో బయలుదేరారు. ఉండవల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై బైక్ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోగా అదుపు తప్పి కారు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో మనెమ్మ (60) అనే మహిళ మృతిచెందగా మద్దిలేటి, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు ఎంపీకి స్వయాన చిన్నమ్మ. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపీ ప్రమాద విషయం తెలుసుకొని తిరుగు ప్రయాణమయ్యారు.


