తొలి నుంచి వస్తున్న ఆచారం
మా ఇంటి ఇలవేల్పు
వీరభద్రస్వామి
ఇల కై లాసంగా పిలువబడే శ్రీశైలంలో ఏటా ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ వెలసిన భ్రమరాంబా దేవిని తమ ఆడబిడ్డగా భావించి దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, వీరు తమ ఆడబిడ్డ కంటే ముందే నాగలూటి వీరభద్రస్వామిని దర్శించుకుని తొలిమొక్కు చెల్లించుకుంటారు. ఎందుకిలా అంటే వీరభద్ర స్వామిని తమ రక్షకుడిగా కొలుస్తామని చెబుతారు. నేటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం.
ఆత్మకూరు: మూడు దశాబాల క్రితం శ్రీశైలానికి సరైన రవాణా మార్గం ఉండేది కాదు. శ్రీశైలేశుడిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన వెళ్లేవారు. ఎండావాన, కొండాకోన, రాళ్లురప్ప అని చూడకుండా శివనామస్మరణ చేస్తూ నల్లమల అడవి గుండా శ్రీగిరికి చేరుకునేవారు. అయితే, ఈక్రమంలో తమకు మార్గమధ్యంలో ఎలాంటి అవరోధం కలగకుండా సురక్షితంగా క్షేత్రానికి చేర్చాలని నల్లమల కొండ అంచున ఉన్న నాగలూటిలో వీరభద్రస్వామిని దర్శించుకుని ముందుకు సాగుతారు. ఇలా చేస్తే తమ ప్రయాణం సాఫీగా సాగుతుందని వారి నమ్మకం. కాలినడకన వెళ్లే భక్తులు నేటికీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉగాది మహోత్సవాల సందర్భంగా తొలిమొక్కు చెల్లించుకునే వారితో వీరభద్రస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. ఈ స్వామిని కర్ణాటక, మహారాష్ట్ర భక్తులే కాకుండా కాలినడకన వెళ్లే ప్రతి ఒక్కరు శరభ, శరభ, భద్ర..భద్ర అంటూ స్మరించుకుంటూ దట్టమైన నల్లమల అడవి గుండా ఇల కై లాసానికి చేరుకుంటున్నారు.
నాగలూటి వీరభద్రస్వామిపై
భక్తుల నమ్మకం
మల్లన్న కంటే ముందే తొలి పూజ
నేటికి కొనసాగిస్తున్న కర్ణాటక,
మహారాష్ట్ర భక్తులు
మా ఆడపడుచు శ్రీ భ్రమరాంబాను దర్శించుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే వీరభద్రస్వామిని స్మరించుకుని తొలి అడుగు వేస్తాం. నాగలూటిని చేరుకోగానే స్వామిని కనులారా దర్శించి మొక్కులు చెల్లిస్తాం. రవాణా మార్గాలు లేని కాలంలో మా పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగించారు. స్వామిని మేము రక్షకుడిగా భావిస్తాం.
– శ్రీమత్‌గారి గౌర, ముద్దాపూర్,
బాగలకోటె జిల్లా, కర్ణాటక రాష్ట్రం
మా ఇంటి ఇలవేల్పు శ్రీ వీరభద్రస్వామి. యేటా కర్ణాటక రాష్ట్రం నుంచి బయలుదేరి నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రానికి చేరుకుంటాం. ఇంటి నుంచి తెచ్చుకున్న టెంకాయలు, పూజా సామగ్రిని స్వామికి సమర్పిస్తాం. అనుక్షణం మమ్మల్ని కాపాడి శ్రీశైలం మల్లన్న దర్శనం చేసేలా చూడాలని కోరుకుంటాం. తొలి పూజ చేయకుండా శ్రీశైలానికి వెళ్లం. ఇది మా పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయం.
– గుండయ్య, బళ్లారి పట్టణం, కర్ణాటక రాష్ట్రం


