నందికొట్కూరు: శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు కాలినడకన వెళ్తున్న భక్తులకు వివిధ వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మార్గ మధ్యంలో తమ వంతు సేవలు అందిస్తున్నారు. నందికొట్కూరు పట్టణ సమీపంలో జమ్మిచెట్టు వద్ద ఇన్‌ట్యాచ్ నంద్యాల చాప్టర్ కన్వీనర్ శివకుమార్‌రెడ్డి, మన ఊరు– మనగుడి మన బాధ్యత అధ్యక్షుడు రఘువీర్ ఆధ్వర్యంలో పోలూరు జీవన్‌జ్యోతి ఓకేషనల్ జూనియర్ కళాశాల సిస్టర్ స్వరూపరాణి, విద్యార్థులు కేరళ తరహాలో ఆయిల్ మసాజ్ చేస్తున్నారు. అలాగే పట్టణ శివారులో కొందరు అన్నదానం, మరికొందరు మజ్జిగ, కలింగరపండ్లు, మంచినీళ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.
భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి మంగళవారం కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి, పసుపు, కుంకుమలతో వాటికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు ఈ సంవత్సరం ఏప్రిల్ 7న మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పించి కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ కొబ్బరికాయల సమర్పణలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు.


